గరళమా! | Sakshi
Sakshi News home page

గరళమా!

Published Sun, May 26 2024 3:20 AM

గరళమా

మధురఫలమా..
● నోరూరించే మామిడిపండ్లు విషతుల్యం ● తి(కొ)నే ముందు అప్రమత్తత అవసరం ● కాల్షియం కార్బైడ్‌తో మగ్గుతున్న పండ్లు ● ఆరోగ్యానికి హానికరమంటున్న వైద్య నిపుణులు

నిర్మల్‌ఖిల్లా: పండ్లలో రారాజుగా పేరొందిన మామిడి విషతుల్యంగా మారుతోంది. మార్కెట్‌లోకి వచ్చే కాయలను రసాయనాలతో కృత్రిమంగా మాగబెడుతున్నారు. నిషేధిత కాల్షియం కార్బైడ్‌ ఇతర ప్రమాదకర రసాయనాలను వ్యాపారులు విరివిగా వినియోగిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా, మంచిర్యాల చుట్టుపక్కల మామిడితోటల నుంచి కాయలు జిల్లాకు దిగుమతి అవుతున్నాయి. నిషేధిత కార్బైడ్‌ రసాయనాలు వినియోగించి ఎక్కువ ధరకు అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ పండ్లను తినడంతో అనేక అనారోగ్యం బారినపడే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

మాగబెట్టిన పండ్లను గుర్తించండిలా..

మామిడి కాయలను కార్బైడ్‌ ద్వారా మాగబెట్టినవి గుర్తించడానికి నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. ఈ పండ్లపై ఆకుపచ్చని మచ్చలు, పసుపు వర్ణం ఎక్కువగా ఉంటుంది. సహజసిద్ధంగా మాగితే ఆకుపచ్చ, పసుపుపచ్చ రంగులు కలిసినట్టుగా ఉంటాయి. పండును కోసినపుడు గుజ్జు ఎరుపు, పసుపు కలిసినట్టుగా ఉంటుంది. పండ్లలో రసం ఎక్కువ, తొడిమ లోపటికి కుంగినట్లుగా ఉంటుంది. ప్రజలు పండ్లను కొనుగోలు చేసేముందు అప్రమత్తంగా ఉండాలి.

జిల్లాలో తగ్గిన దిగుబడి..

జిల్లా వ్యాప్తంగా ఇటీవల కురిసిన ఈదురుగాలులతో కూడిన వర్షాలకు మామిడి పండిస్తున్న రైతులు నష్టానికి గురయ్యారు. ఉద్యానవన శాఖ అంచనా ప్రకారం.. జిల్లాలో 2,744 ఎకరాల్లో మామిడి పంటను రైతులు సాగు చేశారు. ఇందులో అకాల వర్షాలకు 671 ఎకరాల్లో తోటలు దెబ్బతిన్నట్లు అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో 486 మంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏటా రావల్సిన దిగుబడి ఈసారి తగ్గింది. వ్యాపారులు ఇతర ప్రాంతాల నుంచి మామిడి దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది.

ఆరోగ్యానికి హానికరం

రసాయనాలతో పక్వానికి తెచ్చిన పండ్లు తింటే అనేక ఆరోగ్య సమస్యల బారినపడే ప్రమాదముంది. జీర్ణ సంబంధిత వ్యాధులు, కాళ్లు చేతులు, తిమ్మిర్లు, నరాల బలహీన తలకు గురయ్యే అవకాశం ఉంది. చిన్నారుల్లో వ్యాధి నిరోధకత తగ్గి శ్వాస సంబంధిత ఇబ్బందులు తలెత్తుతాయి. గర్భిణుల్లో హార్మోన్లు దారితప్పుతాయి. సహజపద్ధతిలో పండిన పండ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. – డాక్టర్‌ ఎన్‌.శశికాంత్‌,

ల్యాప్రోస్కొపిక్‌ సర్జన్‌, నిర్మల్‌

ఇథిలీన్‌పై అవగాహన ఏది?

రసాయనాలతో పండించిన మామిడి అనారో గ్యానికి కారణమవుతుందని అప్పటి ఏపీ హైకోర్టు నిషేధించింది. ఇథలీన్‌ వాయువు ద్వా రా పండ్లు మాగబెడితే ఆరోగ్యకరమని కేంద్రం గతంలో ప్రకటించింది. మాగబెట్టే గదులను ఉపయోగించాలని తెలిపింది. ఇందుకోసం రైఫనింగ్‌ చాంబర్ల ఏర్పాటు కోసం రాయితీ కల్పి స్తోంది. ఇథలీన్‌ వాడకం, రైఫనింగ్‌ చాంబర్ల ఏర్పాటుపై అధికారులు అవగాహన కల్పించడం లేదు. ఇథలీన్‌ గ్యాస్‌ను వదిలి పండ్లను మూడు రోజులపాటు మాగబెడితే సహజసిద్ధంగా ఉంటాయి. మంచి రంగుతోపాటు రుచి ఉంటుంది. ఇథలీన్‌ గ్యాస్‌తో ఖర్చు పెరుగుతుందని ఉపయోగించడం లేదని తెలుస్తోంది.

గరళమా!
1/2

గరళమా!

గరళమా!
2/2

గరళమా!

Advertisement
 
Advertisement
 
Advertisement