
53లో నిశ్చితార్థం.. 16లో పెళ్లి!
తల్లిదండ్రుల బెదిరింపుల కారణంగా విడిపోయిన ఆ ప్రేమజంట.. 63 ఏళ్ల తర్వాత తిరిగి ఒక్కటైంది.
పేరెంట్స్ బెదిరింపుల కారణంగా విడిపోయిన ప్రేమజంట.. 63 ఏళ్ల తర్వాత తిరిగి ఒక్కటైంది. ఆమె పేరు హెలెన్ ఆండ్రీ. అతను డేవ్ మాక్స్. కాలేజ్ మేట్స్. ఆర్ట్స్ కాలేజీలో చదువుకునేటప్పుడే ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. చదువు పూర్తయిన వెంటనే, అంటే 1953లో ఉంగరాలు మార్చుకుని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ విషయం తెలుకున్న అమ్మాయి తల్లిదండ్రులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. ‘పనీపాటాలేని వెధవ నిన్నెలా పోశిస్తాడనుకున్నావ్?’ అని హెలెన్ ను తిట్టి, బెడ్ రూమ్ లో బంధించారు. అటు డేవ్ మాక్స్ పేరెంట్స్ ఓకే చెప్పినా పెళ్ళి చేసుకునే మార్గాలన్నీ మూసుకుపోయాయి. 63 ఏళ్ల తర్వాత..
డిజైనర్ గా మంచి పేరుతోపాటు సొంత ఫ్యాబ్రిక్ కంపెనీని ఏర్పాటుచేసుకున్న హెలెన్.. 2010లో రిటైర్మెంట్ తీసుకుంది. శేషజీవితాన్ని గడిపేందుకు కూతురి ఊరైన డెర్బీషైర్ కు వెళ్లింది. ఆ ఊళ్లోని ఆర్ట్స్ కాలేజీలోనే హెలెన్, డేవ్ లు కలిసి చదువుకుంది! ఓ రోజు యథాలాపంగా కాలేజీకి వెళ్లిన హెలెన్ కు అక్కడో శిల్పం, దానిమీద ‘మాక్స్’అనే సంతకం కనిపించాయి. అంతే, ఒక్కసారిగా కూలబడి కన్నీరు విడిచింది. పక్కనే ఉన్న మనుమరాలికి ప్రేమకథ మొత్తం చెప్పేసింది. అప్పుడా మనుమరాలు ‘మాక్స్’శిల్పి కోసం తీవ్రంగా గాలించింది. చివరికి ఆ శిల్పి మరెవరోకాదు.. డేవ్ మాక్స్ చిన్న కొడుకని తేలింది. అలా ఇద్దరూ ఇద్దరికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు.
హెలెన్ తో ఎంగేజ్ మెంట్ రద్దయిన మూడేళ్లకు డేవ్ మాక్స్ కు ఆర్ట్ టీచర్ గా ఉద్యోగం వచ్చింది. 1956లో వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత మొదటిభార్య చనిపోవడంతో రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది నెలల కిందటే ఆవిడకూడా ప్రాణాలు విడిచింది. 86 ఏళ్ల వయసులో ఒంటరిగా జీవిస్తోన్న డేవ్ ను.. తొలిప్రేయసి హెలెన్ కు సంబంధించిన కబురు మళ్లీ యవ్వనంలోకి లాక్కెళ్లింది.
డేవ్ తో ఎంగేజ్ మెంట్ రద్దయిన తర్వాత ఉన్నత చదువులపై దృష్టిసారించిన హెలెన్ 1960లో పెళ్లిచేసుకుంది. ముగ్గురు పిల్లలు పుట్టాక భర్త నుంచి వేరైంది. తర్వాత మరో రెండు పెళ్లిళ్లు చేసుకుంది. 2010లో హెలెన్ మూడో భర్త చనిపోయిన సమచానికే డిజైనర్ గా రిటైర్మెంట్ తీసుకున్న ఆమె.. కూతురు నివసించే ఊరికి వెళ్లి అనూహ్యంగా తొలి ప్రేమికుడిని కలుసుకుంది.
1953లో నిశ్చితార్థం చేసుకున్న హెలెన్, డేవ్ లు 2016లో పెళ్లి చేసుకున్నారు. గత జీవితంలో ఎంత మందిని పెళ్లాడినా తన మనసు మాత్రం తొలి ప్రేమికుడిచుట్టూ తిరిగేదని, ఇన్నేళ్ల తర్వాత అతణ్ని కలుసుకోవడం తనను తాను వెతుక్కున్నట్లుందని హెలెన్ చెప్పారు. ‘వాళ్ల పేరెంట్స్ తీరు ఆక్షేపణీయమే. పారిపోవడం తప్ప మాకు వేరే దారిలేదప్పుడు. కానీ మేం ఆ పని చేయలేకపోయాం. ఇన్నాళ్లకు నా తొలిప్రేమ దక్కినందుకు సంతోషంగా ఉంది’అని డేవ్ అంటున్నారు. వాటె లవ్ స్టోరీ కదా!
హెలెన్, డేవ్ ఎంగేజ్ మెంట్ నాటి ఫొటో..