బీజేపీతో యువ తెలంగాణ జట్టు | Sakshi
Sakshi News home page

బీజేపీతో యువ తెలంగాణ జట్టు

Published Fri, Nov 9 2018 1:49 PM

Yuva Telangana cominds with BJP Warangal  - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌:టీఆర్‌ఎస్‌ను ఢీకొట్టేందుకు వివిధ రాజకీయ పార్టీలు ఒక్కటవుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్, సీపీఐ జతకట్టి మహాకూటమిగా,   సీపీఎం సారథ్యంలో వివిధ దళిత, గిరిజన సంఘాలతో కలిసి బహుజన లెఫ్ట్‌ ఫ్రంట్‌(బీఎల్‌ఎఫ్‌)గా ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా తెలంగాణలో మరో కూటమి ఏర్పడబోతోంది. ఇందుకోసం జిట్టా బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో ఏర్పడిన యువ తెలంగాణ పార్టీతో బీజేపీ చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. తొలుత సొంతంగానే పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటించినప్పటికీ ప్రస్తుతం చిన్నాచితక పార్టీలతో జతకట్టేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.

బీజేపీలో నేరుగా చేరితే మైనార్టీలతో కొంత ఇబ్బందివస్తుందని పలువురు యువ తెలంగాణ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే వివిధ రాజకీయ పార్టీలలో అసంతృప్తులకు ఒక వేదికగా మారనున్నట్లు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో బీజేపీ తరఫున మొదటి జాబితాలో పరకాల నుంచి డాక్టర్‌ పెసరు విజయచందర్‌ రెడ్డి, భూపాలపల్లి నుంచి కీర్తిరెడ్డి పేర్లను ప్రకటించారు. రెండో జాబితాలో వరంగల్‌ పశ్చిమ నుంచి మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, వర్ధన్నపేట నుంచి పంచాయతీరాజ్‌ రిటైర్డ్‌ ఎస్‌ఈ కొత్త సారంగరావు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ నుంచి పెరుమాండ్ల వెంకటేశ్వర్లును ప్రకటించారు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉండగా బీõజేపీ అధిష్టానం ఇప్పటి వరకు ఐదు నియోజకవర్గాలకు మాత్రమే తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా వరంగల్‌ తూర్పు, నర్సంపేట, మహబూబాబాద్, డోర్నకల్, జనగామ, పాలకుర్తి, ములుగు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. వివిధ రాజకీయ పార్టీలలో టికెట్లు దక్కనివారిని చేర్పించుకుని టికెట్లు ప్రకటించే అవకాశం ఉంది.

నర్సంపేటపై రాణిరుద్రమ కన్ను..
రాణిరుద్రమ గతంలో వైఎస్సార్‌ సీపీలో చేరి ప్రత్యేక గుర్తింపును పొందిన విషయం తెలిసిందే. పలు న్యూస్‌ ఛానళ్లలో పని చేస్తూ తనదైన ముద్రవేసుకున్న రాణిరుద్రమ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తెలిసింది. ఆమె పుట్టినిల్లు, మెట్టినిల్లు నర్సంపేట నియోజకవర్గమే కావడంతో ఇక్కడి నుంచి పోటీ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నర్సంపేట నుంచి లేదా గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ఏదేని నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.  

Advertisement
Advertisement