చివరి అంకానికి ‘మున్సిపల్’ పోరు! | Sakshi
Sakshi News home page

చివరి అంకానికి ‘మున్సిపల్’ పోరు!

Published Fri, Mar 4 2016 2:03 AM

చివరి అంకానికి ‘మున్సిపల్’ పోరు! - Sakshi

* వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో ఎన్నికల ప్రచారానికి నేటితో తెర
* మూడు చోట్లా గెలుపుపై టీఆర్‌ఎస్ భరోసా

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మూడు జిల్లాల్లోని మూడు మున్సిపాలిటీలకు జరుగుతున్న ఎన్నికల పోరు చివరి అంకానికి చేరుకుంది. గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, మహబూబ్‌నగర్ జిల్లా అచ్చంపేట నగర పంచాయతీలకు ఎన్నికల ప్రచారం శుక్రవారంతో ముగియనుంది. ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్‌ఎస్ విజయమే లక్ష్యంగా ఆయా జిల్లాల్లో మంత్రులకు బాధ్యతలు అప్పజెప్పింది. మంత్రులు సైతం జిల్లాల్లోనే మకాం వేశారు కూడా.

అయితే అభ్యర్థుల ఖరారు సమయం నుంచే వ్యూహాత్మకంగా వ్యవహరించిన టీఆర్‌ఎస్... రెబల్స్ బెడద నుంచి బయటపడేందుకు నానా అవస్థలు పడింది. వరంగల్, ఖమ్మం నగరాల్లో స్థానిక సమస్యలను గుర్తించిన పార్టీ నాయకత్వం, మున్సిపల్ మంత్రి కేటీఆర్ ద్వారా హామీలు ఇప్పించేలా ప్రణాళిక రచించింది. ప్రచారానికి చివరి రెండు రోజులైన గురు, శుక్రవారాల్లో కేటీఆర్‌తో ప్రచారం చేయిస్తోంది. మొత్తంగా మూడు చోట్లా విజయం సాధిస్తామని టీఆర్‌ఎస్ భరోసా వ్యక్తం చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందు సీఎం కేసీఆర్ ఖమ్మం జిల్లాలో పర్యటించడం మినహా ఎన్నికల సందర్భంగా ఈ మూడు జిల్లాలకూ వెళ్లలేదు.
 
వరంగల్‌లో రెబెల్స్ బెడద!
ఈ ఎన్నికల్లో గ్రేటర్ వరంగల్ అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవలి వరంగల్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ రికార్డు స్థాయి మెజారిటీతో విజయం సాధించడంతో... తాజా ఎన్నికలపై అంచనాలు పెరిగాయి.  పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న వారిలో ద్వితీయ శ్రేణి నాయకులు, ఎమ్మెల్యేలు, మం త్రుల అనుచరులు అత్యధికులు టికెట్లు ఆశిం చారు. ఒకదశలో తమ అనుచరులకు టికెట్లు దక్కడం లేదని, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికే ప్రాధాన్యం ఇస్తున్నారని పలువురు ఎమ్మెల్యేలు అలకబూనారు కూడా.

ఈ పరిస్థితుల్లో జిల్లా ఎన్నికల బాధ్యతను మంత్రి హరీశ్‌రావుకు అప్పగించారు. అభ్యర్థుల ఖరారు సమయంలోనే ఆయన అనేక జాగ్రత్తలు తీసుకున్నా... ఇక్కడ ఏకంగా వంద మంది దాకా రెబెల్స్ బరిలో ఉన్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లకుగాను పార్టీ నుంచి అధికారికంగా బరిలో ఉన్న అభ్యర్థి కాకుండా... పార్టీకి చెందిన వారే డివిజన్‌కు సగటున ఇద్దరి చొప్పున పోటీలో ఉండడం ఫలితాలపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

అయితే విపక్షాల నుంచి పోటీ లేదని, అత్యధిక డివిజన్లలో తామే గెలుస్తామని టీఆర్‌ఎస్ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల బాధ్యతను భుజాన వేసుకున్న హరీశ్‌రావు పూర్తిగా ప్రచారంలో మునిగిపోయారు. ఇక గురువారం ఖమ్మంలో ప్రచారం చేసిన మంత్రి కేటీఆర్ శుక్రవారం వరంగల్‌లో ప్రచారంలో పాల్గొననున్నారు.
 
అచ్చంపేటలో తలనొప్పులు
ఇక అచ్చంపేట నగర పంచాయతీలో అధికార పార్టీకి త లనొప్పులు తప్పేలా లేవని చెబుతున్నారు. ఒక ప్రజాప్రతినిధి వివాదాస్పద వ్యవహార శైలి వల్ల అచ్చంపేట నగర పంచాయతీలో ఓటర్ల నుంచి టీఆర్‌ఎస్ నాయకులకు నిరసన లు వ్యక్తమయ్యాయని సమాచారం. దీన్నుంచి గట్టెక్కేందుకు పార్టీ నాయకులు నానా అవస్థలు పడుతున్నారు. ఆ జిల్లాకు చెందిన మంత్రి జూపల్లి కృష్ణారావు అచ్చంపేటలోనే మకాంవేసి పరిస్థితిని చక్కదిద్దే పనిలో పడ్డారు. ఒక విధంగా ఈ ఎన్నికల  ఫలితం ఆ జిల్లాకు చెందిన నేతల రాజకీయ భవిష్యత్తుతో ముడిపడి ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
 
6న వరంగల్, ఖమ్మం, అచ్చంపేటల్లో సెలవు
వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట నగర పంచాయతీల పరిధిలోని ఫ్యాక్టరీలు, దుకాణాలు, సంస్థల ఉద్యోగులు, కార్మికులకు ఈ నెల 6న జీతంతో కూడిన సెలవును ప్రభుత్వం ప్రకటించింది. ఆ రోజు ఆదివారం కావడంతో సెలవు దినం కాని సంస్థలకు మాత్రమే సెలవు వర్తిస్తుందని కార్మిక ఉపాధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి హరిప్రీత్‌సింగ్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. షిఫ్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఆయా పరిశ్రమలు, సంస్థలకు ఓటింగ్ జరిగే వేళలకు మాత్రమే వర్తిస్తుందని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement