హోరు..జోరు | Sakshi
Sakshi News home page

హోరు..జోరు

Published Thu, Sep 13 2018 9:34 AM

Telangana Election Campaign In Mahabubnagar - Sakshi

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్‌ :  శాసనసభ ఎన్నికల ప్రచారాన్ని రాజకీయ పార్టీలు ముమ్మరం చేశాయి. అక్టోబర్‌ నెలలో ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ చేసి నవంబర్‌లో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుండడంతో బరిలో నిలిచే అభ్యర్థులు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ఖరారు చేయడంతో వారు రంగంలోకి దిగారు. వారం రోజులుగా నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ దూసుకెళ్తున్నారు. అదే విధంగా ప్రతిపక్ష పార్టీల్లో కాంగ్రెస్‌ నుంచి టికెట్లు ఖచ్చితంగా దక్కుతాయనుకున్న నేతలు కూడా ప్రచారానికి శ్రీకారం చుట్టారు. సదరు నేతలకు పీసీసీ పెద్దలు హామీ ఇవ్వడంతో ప్రచార పర్వంలోకి దిగారు. అలాగే కమలం పార్టీ కూడా ఈ నెల 15 నుంచి లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనుంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా స్వయంగా మహబూబ్‌నగర్‌లో సమరశంఖం పూరించనున్నారు.
 
చేరికలతో కొత్త ఉత్సాహం.. 
ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అనునిత్యం జనంలో ఉండడానికి రాజకీయ పార్టీల నాయకులు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అందుకు అనుగుణంగా నియోజకవర్గాల్లో నేతలను చేర్చుకోవడం ద్వారా కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతున్నాయి. తాజాగా జడ్చర్ల నియోజకవర్గానికి చెందిన పారిశ్రామికవేత్త జనుంపల్లి అనిరు«ధ్‌రెడ్డి తన అనుచరులతో కలిసి కాంగ్రెస్‌లో చేరారు. అలాగే ఇటీవలి కాలంలో కాస్త పలుకుబడి కలిగిన నేతలైన నారాయణపేటకు చెందిన కె.శివకుమార్, దేవరకద్ర నియోజకవర్గంలో న్యాయవాది జి.మధుసూదన్‌రెడ్డి, జెడ్పీటీసీ లక్ష్మీ, ఎంపీపీ క్రాంతి వంటి నేతలను చేర్చుకున్నారు. అదేవిధంగా ఇతర అన్ని నియోజకవర్గాల్లో కూడా ఆయా నేతలు, అసంతృప్తులను కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు చేర్చుకుంటున్నాయి.  
ఉమ్మడి జిల్లాలో ప్రచారహోరు.. 

  • మహబూబ్‌నగర్‌ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వి.శ్రీనివాస్‌గౌడ్‌ పేరు ఖరారు కావడంతో ముమ్మర ప్రచారం చేపట్టారు. అసెంబ్లీ రద్దు చేసిన మరుసటి రోజు నుంచే జనంతో మమేకమవుతున్నారు. బైక్‌ ర్యాలీలతో పాటు చిన్నచిన్న సభలు, సమావేశాలను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారు. అలాగే కరపత్రాలు, వాల్‌పోస్టర్లు, ఆకర్షణీయమైన ప్లెక్సీలను ఏర్పాటు చేయిస్తున్నారు. మరోవైపు విపక్షాలకు సంబంధించి బరిలో నిలిచే అభ్యర్థి విషయంలో స్పష్టత రాకపోయినా ఆశావహులందరూ ప్రచారానికి శ్రీకారం చుట్టారు. డీసీసీ అధ్యక్షుడు నొబేదుల్లా కొత్వాల్, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులైన ఎం.సురేందర్‌రెడ్డి, ఎన్‌పీ వెంకటేశ్‌ తదితర నేతలు బరిలో దిగేందుకు కసరత్తు చేస్తున్నారు. అలాగే తెలంగాణ జనసమితి నుంచి రాజేందర్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తున్నారు.
     
  • రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు పొందిన వనపర్తి నియోజకవర్గంలో ఈసారి పోరు నువ్వా–నేనా అన్నట్లుగా మారింది. టీఆర్‌ఎస్‌ తరఫున ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు ఎస్‌.నిరంజన్‌రెడ్డి మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి నియోజకవర్గంలో సాగునీరు విషయంలో విశేష కృషిచేసిన నేపథ్యంలో తన గెలుపు తథ్యమని భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా ప్రచారంలో మునిగిపోయారు. అయితే ఈసారి కూడా నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌కు భంగపాటు తప్పదని విపక్ష నేతలు హెచ్చరిస్తున్నారు. మహాకూటమి తరఫున ఈసారి బలమైన అభ్యర్థిని బరిలో నిలపాలని యోచిస్తున్నాయి. అందుకు అనుగుణంగా కూటమి తరఫున నియోజకవర్గ ప్రజలకు సుపరితమైన ఒక ప్రభుత్వ ఉద్యోగిని బరిలో దింపాలని భావిస్తున్నట్లు సమాచారం. అందుకోసం టీడీపీ నేత రావుల చంద్రÔóశేఖర్‌రెడ్డి కొన్ని రోజులుగా సదరు ఉద్యోగితో చర్చలు జరుపుతున్నట్లు వినికిడి.
  • దేవరకద్ర నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఆల వెంకటేశ్వర్‌రెడ్డి జోష్‌ మీద ఉన్నారు. బుధ వారం నియోజకవర్గంలోని భూత్పూరు మం డలంలో భారీ బైక్‌ ర్యాలీ చేపట్టారు. ఈసారి కూ డా నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. అందుకు అనుగుణంగా ఈ నాలుగేళ్ల కాలంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ నుంచి నియోజకవర్గ ఇన్‌చార్జీ డి.పవన్‌కుమార్, ఇటీవలి కాలంలో పార్టీలో కొత్తగా చేరిన న్యాయవాది మధుసూదన్‌రెడ్డి కలిసి ముందుకెళ్తున్నారు. ఈసారి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ జెండా ఎగరవేయాలని ప్రచారాన్ని ముమ్మరం చేశారు.
     
  • నారాయణపేట నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా తాజా మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రె డ్డి నియోజకవర్గంలోని అన్ని మండలాలలో కలి య తిరుగుతున్నారు. కార్యకర్తలతో మమేకమవు తూ తన గెలుపుకు కృషిచేయాలని కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్‌ కూడా నియోజకవర్గంలో కొత్త ఉ త్సాహంతో ఉంది. పార్టీలోకి కుంభం శివకుమార్‌రెడ్డి రావడంతో కార్యకర్తల్లో జోష్‌ పెరిగింది. గత రెండు పర్యాయాలుగా కాంగ్రెస్‌ అభ్యర్థి అంతగా పోటీ ఇవ్వకపోవడంతో కార్యకర్తల్లో నైరాశం అలుముకుంది. కానీ ఈసారి బరిలో శివకుమార్‌ ఉంటారనే వార్తలతో పార్టీ ఊపు మీద ఉంది.
     
  • కొల్లాపూర్‌ నియోజకవర్గంలో రెండు దశాబ్ధాలు గా ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆపద్ధర్మమంత్రి జూపల్లి కృష్ణారావు మరోసారి తన స్థానాన్ని సుస్థి రం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి కూడా టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలవడం ఖాయం కావడంతో తనదైన శైలిలో ప్రచారాన్ని ప్రారంభించారు. నియోజకవర్గంలో జూపల్లి తన గెలుపుకోసం ఒక వైపు ప్రచారం చేస్తూనే.. మరో వైపు విపక్ష పార్టీని దెబ్బతీస్తుంటారని రాజకీయవర్గాల్లో వినికిడి. అందులో భాగంగానే ప్రతీసారి తన గెలుపు సులభతరమవుతున్నట్లు నియోజకవర్గ పరిశీలకులు చెబుతుంటారు. ఈసారి అలాంటి ఎత్తుగడలతోనే సులభంగా బయటపడవచ్చనే ధీమాతో ముందుకు వెళ్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అయితే ఈసారి మాత్రం విపక్ష కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జీ బీరం హర్షవర్దన్‌రెడ్డి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. 
     
  • నాగర్‌కర్నూల్‌ నియోజకవర్గంలో పాగా వేసేం దుకు ఇరు పార్టీలు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నాయి. టీఆర్‌ఎస్‌ నుంచి తాజా మాజీ మర్రి జనార్ధన్‌రెడ్డి ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని తిమ్మాజిపేట నుంచి భారీ బైక్‌ ర్యా లీతో బిజినేపల్లి, నాగర్‌కర్నూల్‌ వరకు ర్యాలీ తీశారు. నియోజకవర్గానికి కేఎల్‌ఐ నీరు రావడం తో పార్టీకి అనుకూలంగా ఉందని.. కొన్ని అభివృద్ధి పనుల విషయంలో స్వంత డబ్బు ఖర్చు చేసి కొత్త రూపం తీసుకొచ్చినట్లు చెబుతున్నారు. అంతేకాదు ఉమ్మడి జిల్లాలో అందరి కంటే ముం దుగా ప్రచార రథాలను తెప్పించి అందరి దృష్టిని ఆకర్షించారు. మరోవైపు కాంగ్రెస్‌ తరఫున రాజకీయ భీష్ముడు నాగం జనార్ధన్‌రెడ్డి బరిలో నిలిచేందుకు దాదాపు లైన్‌ క్లియర్‌ అయ్యింది. ఈసారి గెలిచి నా గర్‌కర్నూల్‌పై పట్టును నిలుపుకోవాలని శతవిధాల యత్నిస్తున్నారు.
     
  • రాష్ట్ర రాజకీయాలకు సెంటిమెంట్‌గా నిలిచే అచ్చంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్‌–టీఆర్‌ఎస్‌ గట్టిగా తలపడుతున్నాయి. అచ్చంపేటలో ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే అదే పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఒక నమ్మకంగా ఏర్పడింది. దీంతో టీఆర్‌ఎస్‌ తరఫున తాజా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. అందుకోసం నియోజకవర్గం మొత్తంలో జెట్‌స్పీడ్‌తో ప్రచారాన్ని చేస్తున్నారు. అదే విధంగా కాంగ్రెస్‌ తరఫున డాక్టర్‌ వంశీచంద్‌రెడ్డి ఈసారి గెలిచి తీరాలని గట్టిగా తలపడుతున్నారు. అందుకోసం పార్టీలో మంచి గుర్తింపు ఉన్న రేవంత్‌రెడ్డి, నాగం తదితర నేలతో తరచూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు.
     
  • ఎన్నికల్లో సంచలనాలకు కేరాఫ్‌గా నిలిచే కల్వకుర్తి త్రిముఖ పోరుతో రక్తి కడుతోంది. టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌కు టికెట్‌ ఖరారైంది. దీంతో అక్కడ అసంతృ ప్త నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చేందుకు పా ర్టీ ముఖ్యులు ప్రయత్నాలను ముమ్మరం చే శారు. ఈ మేరకు బుధవారం మంత్రి కేటీఆర్‌ తో ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డితో పాటు బరిలో నిలవనున్న జైపాల్‌యాదవ్‌ సమావేశమయ్యారు. అలాగే ఈసారి కల్వకుర్తి నుంచి కాంగ్రెస్‌ తాజా మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మరోసారి విజయకేతనం ఎగురవేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. మరోవైపు గత ఎన్నికల్లో తృటిలో విజయం తప్పిన బీజేపీ నేత టి.ఆచారి ఈసారి ఖచ్చితంగా గెలవాలని భావిస్తున్నారు.
     
  • జడ్చర్ల నియోజకవర్గంలో అపద్ధర్మ మంత్రి డా.సి.లక్ష్మారెడ్డి ప్రచారం ప్రారంభించారు. బుధవారం నియోజకవర్గంలో భారీ బైక్‌ ర్యాలీతో హల్‌చల్‌ చేశారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో ప్రచారాన్ని హడలెత్తించారు. నియోజకవర్గంలో ఈ నాలుగేళ్ల పాటు ఏమేం చేశామో వివరిస్తూ ముందుకెళ్లారు. మరోవైపు ప్రధానప్రతిపక్షమైన కాంగ్రెస్‌ జడ్చర్లలో ఈసారి జెండా ఎగురవేయడం ఖాయమంటూ ఆ పార్టీ నేత మల్లు రవి శపథం చేస్తున్నారు. తాజాగా రాజాపూర్‌ మండలానికి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త జనుంపల్లి అనిరు«ధ్‌రెడ్డి పార్టీలో చేరడంతో కాంగ్రెస్‌కు కొత్త జోష్‌ వచ్చింది.

1/1

గండీడ్‌ మండలం పగిడ్యాల్‌ గుడిలో పూజలు చేస్తున్న పరిగి మాజీ ఎమ్మెల్యే టీఆర్‌ఆర్‌

Advertisement
Advertisement