భూ వినియోగ మార్పిడిపై సమీక్ష | Sakshi
Sakshi News home page

భూ వినియోగ మార్పిడిపై సమీక్ష

Published Wed, Apr 22 2015 1:34 AM

భూ వినియోగ మార్పిడిపై సమీక్ష

పాత అనుమతుల పరిశీలనకు కమిటీ
అమలు నిలిపివేత
హెచ్‌ఎండీఏ ప్రక్షాళనకు చర్యలు
ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష
 

హైదరాబాద్: భూవినియోగ మార్పిడుల్లో చోటుచేసుకున్న భారీ అక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తీసుకుంది. హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ(హెచ్‌ఎండీఏ) పరిధిలో భూ వినియోగ మార్పిడికి ఇటీవల అనుమతించిన వాటిని సమీక్షించాలని నిర్ణయించింది. అప్పటి వరకు ఆ అనుమతుల అమలును నిలిపేయాలని ఆదేశించింది. హెచ్‌ఎండీఏలో అవినీతిపై సీఎం కేసీఆర్ ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసిందే. భూ వినియోగ మార్పిడి వ్యవహారాల్లో జరిగిన అవకతవకలపై వస్తున్న ఫిర్యాదులే అందుకు కారణం. మంగళవారం సచివాలయంలో హెచ్‌ఎండీఏపై సమీక్షలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి ఆదేశాలతో హెచ్‌ఎండీఏ నిర్ణయాల సమీక్షకు ఓ ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు పురపాలక శాఖ కసరత్తు చేస్తోంది.
 
ఒక్కసారిగా గేట్లు ఎత్తేశారు..


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చివరిసారిగా 2013 డిసెంబర్‌లో భూ వినియోగ కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత ఎన్నికలు, రాష్ట్ర విభజన జరగడంతో దాదాపు ఏడాది వరకు తెలంగాణలో భూ వినియోగ మార్పిడి ప్రక్రియ స్తంభించిపోయింది. అప్పటికే వందల సంఖ్యలో దరఖాస్తులు పేరుకుపోయాయి. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం 2014 సెప్టెంబర్ 29న పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో భూ వినియోగ మార్పిడి కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు ఈ కమిటీ ఆధ్వర్యంలో నాలుగు సమావేశాలు మాత్రమే జరిగాయి. అయితే 150కిపైగా దరఖాస్తులకు ఆమోదం తెలుపుతూ తదుపరి అనుమతుల కోసం ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతిపాదనలు వచ్చాయి. ఉన్నతాధికారుల సిఫార్సు నేపథ్యంలో సీఎం కార్యాలయం సైతం సానుకూలంగా స్పందించింది. గత మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 54 భూ వినియోగ మార్పిడులకు ఉత్తర్వులు వచ్చేశాయి. మరో వందకు పైగా దరఖాస్తులకు సంబంధించి జీవోలు రావాల్సి ఉంది. అయితే ఈ విషయంలో భారీగా అవినీతి జరిగినట్లు ఆరోపణలు రావడంతో తాజా సమీక్షకు సీఎం నిర్ణయించారు.
 
భూవినియోగ మార్పిడి అంటే..

 హెచ్‌ఎండీఏ మాస్టర్ ప్లాన్ ప్రకారం వ్యవసాయ, అటవీ/పర్యావరణ సంరక్షణ, పరిశ్రమలు, నివాస, వాణిజ్య జోన్ల పరిధిలోని భూములను ఆయా అవసరాలకే వినియోగించుకోవాలి. ఇతర అవసరాలకు వినియోగించుకోవాలని భూ యజమానులు భావిస్తే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందాల్సి ఉంటుంది. హైదరాబాద్ నగరం చుట్టూ కోట్లాది రూపాయల విలువ చేసే భూముల వినియోగంపై మార్పుల కోసం వచ్చే దరఖాస్తులకు ఆమోదం లభించాలంటే హెచ్‌ఎండీఏతోపాటు పురపాలక శాఖ అధికారుల చేతులు తడపాల్సిందేనన్న ఆరోపణలు ఉన్నాయి.  
 
హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా శాలినీమిశ్రా

 
హెచ్‌ఎండీఏ ప్రక్షాళనకు సర్కారు శ్రీకారం చుట్టింది. హెచ్‌ఎండీఏ కమిషనర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి శాలినీ మిశ్రాను నియమిస్తూ సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఇటీవలి బదిలీల్లో ఐఏఎస్ అధికారి బి.జనార్దన్‌రెడ్డిని ఇన్‌చార్జి కమిషనర్‌గా నియమించారు. ఇప్పుడు ఆయనకు బదులుగా శాలినీ మిశ్రాకు పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
 

Advertisement
Advertisement