స్వచ్ఛ సేన | Sakshi
Sakshi News home page

స్వచ్ఛ సేన

Published Wed, Jan 23 2019 6:32 AM

GHMC New Challans on Scrap With New Team Swachh Dooth - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో పారిశుధ్య నిర్వహణకు, స్వచ్ఛ హైదరాబాద్‌ సంపూర్ణ సాకారానికి మరో నూతన విభాగం ఏర్పాటు కానుంది. ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపునకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్‌ అండ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ (ఈవీడీఎం) తరహాలోజీహెచ్‌ఎంసీ ప్రత్యేక విభాగంఏర్పాటు చేయనుంది. ‘స్వచ్ఛ దూత్‌’గా వ్యవహరించనున్న ఈ విభాగం స్వతంత్రంగా పనిచేయనుంది. నగరంలో పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణకు ఏటా రూ.కోట్లు ఖర్చు చేస్తున్నా, కొత్త వాహనాలు కొనుగోలు చేసినా, ఇంటింటికీ చెత్త డబ్బాలు పంపిణీ చేసినా, స్వచ్ఛ ఆటోలను వినియోగిస్తున్నా పరిస్థితిలో చెప్పుకోదగ్గ మార్పు కనిపించడం లేదు. స్వచ్ఛ ర్యాంకింగ్‌లు, జాతీయ స్థాయిలో అవార్డులు లభిస్తున్నప్పటికీ... క్షేత్రస్థాయిలో పరిస్థితులు మాత్రం తీసికట్టుగానే ఉంటున్నాయి.

రహదారుల వెంబడి చెత్తకుప్పలు, నాలాల్లో నిర్మాణ వ్యర్థాలు, బహిరంగ మూత్ర విసర్జన తదితర విశ్వనగరంగా ఎదగాలనుకుంటున్న హైదరాబాద్‌ సిటీ అందమైన ముఖంపై మచ్చలా మారాయి. ఈ నేపథ్యంలో స్వచ్ఛ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేయాలని, పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి తగిన అధికారాలు అప్పగించాలని అధికారులు భావిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ నేతృత్వంలో పనిచేసే ఈ విభాగానికి అత్యున్నత స్థాయి అధికారులు తప్ప... ఇతర స్థాయిల్లో పెత్తనం చేసే వారుండరు. అంతే కాకుండా ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలోని ఇతర విభాగాల సిబ్బంది చేస్తున్నట్లుగా ఎన్నికల విధులు, ఇంటింటి సర్వే, ఆస్తి పన్ను వసూళ్లు సహా ఇతరత్రా పనులేవీ ఉండవు. కేవలం ‘స్వచ్ఛ నగరం... అద్దంలా వీధులు’ నినాదంతో ఈ విభాగం పనిచేయనుంది.  

ఇవీ టీమ్స్‌...   
జీహెచ్‌ఎంసీలోని 150 డివిజన్లకు గాను 150 ‘స్వచ్ఛ దూత్‌’ టీమ్‌లను ఏర్పాటు చేస్తారు. జీహెచ్‌ఎంసీ రెగ్యులర్‌ ఉద్యోగి నేతృత్వంలో ఒక్కో టీమ్‌లో ఐదుగురు ఔట్‌సోర్సింగ్‌/కాంట్రాక్ట్‌ సిబ్బంది ఉంటారు. చలానాలు రాసే అధికారం రెగ్యులర్‌ ఉద్యోగికే ఉంటుంది. ఈ టీమ్‌కు ప్రత్యేకంగా బొలెరో/స్కార్పియో లాంటి వాహనం ఇస్తారు. వాహనాన్ని చూడగానే గుర్తించేలా ప్రత్యేకంగా బ్రాండింగ్‌ చేస్తారు. టీమ్‌ సభ్యులకు సైతం డ్రెస్‌ కోడ్‌ ఉంటుంది. గ్రీన్‌ రంగు ప్రధానంగా కనిపించేలా వీరి డ్రెస్‌ ఉంటుంది. ఈ విభాగంలో పని చేసేందుకు 45ఏళ్ల లోపు వారినే తీసుకుంటారు. నాలుగైదు టీమ్‌లకు కలిపి పైస్థాయిలో మరో సూపర్‌వైజర్‌ను నియమిస్తారు. వీరంతా తమ అడిషనల్‌ కమిషనర్‌ ఆదేశాలకు అనుగుణంగా విధులు నిర్వహిస్తారు. ఈ టీమ్‌లకు ట్యాబ్‌లు అందజేస్తారు. ఎక్కడైనా చెత్త, డెబ్రిస్‌ తదితర వ్యర్థాలుంటే ఎవరు వేస్తున్నది గుర్తిస్తారు. వారి ఫొటోలు తీస్తారు. సంబంధిత వ్యక్తులకు చలాన్లు వెళ్లేలా తగిన ఏర్పాట్లు చేస్తారు. ఇందుకు పోలీస్‌ తదితర శాఖల సహకారం తీసుకుంటారు. ఏ రకమైన ఉల్లంఘనలకు ఎంత చలాన్‌ అనేది ఆటోమేటిక్‌గానే నమోదవుతుంది.  

మూడు దాటితే వడ్డింపే...  
ఈ చర్యలు తీసుకోవడానికి ముందు ప్రజలకు తగినంత సమయమిస్తారు. అవగాహన కల్పించేందుకు దాదాపు నెల రోజులు విస్తృత ప్రచారం నిర్వహిస్తారు. ముందస్తు హెచ్చరికలుగా ఒకట్రెండు చలాన్ల వరకు జరిమానా ఉండదు. చలానా మొత్తం జీరోగా పంపిస్తారు. మూడు చలాన్‌లు దాటాక మాత్రం చెత్త వేయడం తదితర ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు చెల్లించాల్సిందే. విస్తృత ప్రచారంతో పాటు రోడ్లపై చెత్త వేయకుండా ఉండేందుకు, ఇళ్లు, దుకాణాల నుంచి వ్యర్థాలను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లను సైతం జీహెచ్‌ఎంసీ చేస్తుంది. అన్నీ సమకూర్చాకే చర్యలకు దిగుతుంది. మూత్ర విసర్జనకు ప్రస్తుతానికి తగినన్ని పబ్లిక్‌ టాయిలెట్లు లేనందున, దానికి తప్ప మిగతా ఉల్లంఘనలకు చలాన్లు జారీ చేస్తారు. పదేపదే అవే ఉల్లంఘనలకు పాల్పడితే జరిమానాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఎంత మొత్తంలో వ్యర్థాలు వేశారు? ఎంతమేర రోడ్డు పాడు చేశారు? తదితరాలను బట్టి చలాన్‌లు విధిస్తారు. ఈ బృందం పనితీరును కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ల నుంచి  పరిశీలిస్తారు. ఇవి అమలు చేయడానికి ముందు తగినన్ని చెత్త ఆటోలను అందుబాటులోకి తెస్తారు. మార్కెట్లు, ఇళ్లు తదితర ప్రాంతాల నుంచి చెత్త తరలించే ఏర్పాట్లు చేస్తారు. ప్రజలు బహిరంగంగా చెత్త వేయకుండా ఉండేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తారు. అయినప్పటికీ మారకపోతే ఈ చర్యలు తీసుకుంటారు.  

ప్రయోగాత్మకంగా ఒక్కో సర్కిల్‌లో...   
తొలుత ప్రయోగాత్మకంగా ఒక్కో సర్కిల్‌లో రెండు లేదా మూడు వార్డుల్లో ఈ విధానాన్ని అమలు చేసి పరిశీలిస్తారు. క్రమేపీ నగరమంతా అమలు చేస్తారు. జరిమానాల విధింపునకు సంబంధించి ఇండోర్, పుణె లాంటి నగరాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి, మన సిటీకి తగిన విధానాన్ని ఎంపిక చేస్తారు. ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీలోని వివిధ విభాగాల్లో అదనంగా ఉన్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికులను ‘స్వచ్ఛ దూత్‌’ బృందాల్లో నియమిస్తారు. ఐపీఎస్‌ అధికారి నేతృత్వంలో పని చేసేందుకు చాలామంది వెనకడుగు వేస్తుండడంతో వీరికి అలాంటి పరిస్థితి రాదు. తొలి విడతగా దాదాపు 500–600 మందిని ఈ విధుల్లో నియమించనున్నారు. రోజుకు రెండు షిఫ్టుల్లో రెండు బృందాలు విధులు నిర్వర్తిస్తాయి. అవసరాలకు అనుగుణంగా సర్కిల్‌ స్థాయిలో నైట్‌షిఫ్ట్‌లో కూడా నియమిస్తారు. నగరాన్ని స్వచ్ఛ హైదరాబాద్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ విభాగం పని చేస్తుంది. చలాన్ల విధింపు తదితరమైన వాటికి సంబంధించి జీహెచ్‌ఎంసీకి ఇప్పటి వరకూ లేని అధికారాలను బదలాయించేందుకు ప్రభుత్వం కూడా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అక్రమ పార్కింగ్‌లకు జరిమానాలు విధించే అధికారం కూడా త్వరలోనే జీహెచ్‌ఎంసీకి బదలాయించనున్నారు.   

ఫిర్యాదులపై సత్వర చర్యలు...
‘స్వచ్ఛ దూత్‌’ విభాగం ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై సత్వర చర్యలు తీసుకుంటుంది. రోడ్లపై చెత్త లేదా ఇతరత్రా వ్యర్థాలు, మురుగునీరు తదితర సమస్యలేవైనా ప్రజలు ఫొటో తీసి ‘మై జీహెచ్‌ఎంసీ’ యాప్‌ ద్వారా పంపించినా, కాల్‌సెంటర్‌కు తెలియజేసినా... ఆ సమాచారం వెంటనే సంబంధిత వార్డు ‘స్వచ్ఛ దూత్‌’ టీమ్‌కు చేరుతుంది. వెంటనే అక్కడకి చేరుకొని బాధ్యులైన వారికి జరిమానా విధించడంతో పాటు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటుంది. ప్రస్తుతం ఫుట్‌పాత్‌ ఆక్రమణల తొలగింపులో నిష్పక్షపాతంగా  వ్యవహరిస్తున్న ఈవీడీఎం విభాగం త్వరలోనే సెల్లార్లలో అక్రమాలపై దృష్టిసారించనుంది.  

Advertisement
Advertisement