కుంగదీసిన అప్పులు | Sakshi
Sakshi News home page

కుంగదీసిన అప్పులు

Published Wed, Dec 17 2014 1:54 AM

debts

మాగనూర్: వ్యవసాయాన్నే నమ్ముకున్న వారిని అప్పులు మరింత కుంగదీశాయి. కాలం కనికరించక.. ఆశించిన పంట దిగుబడి రాక.. రుణదాతలకు ముఖం చూపలేక తాము నమ్ముకున్న మట్టిలోనే ప్రాణాలు విడిచారు. అప్పులబాధ తాళలేక పురుగుమందు తాగి రైతు దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన మంగళవారం మాగనూర్‌లో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు.. మండల కేంద్రానికి చెందిన కటిక చందెసాబ్(55)ఆయన భార్య రసూల్‌భీ(50) భార్యాభర్తలు.
 
  వారికి కొడుకు ఉన్నాడు. రెక్కలకష్టాన్ని నమ్ముకున్న వారు తమకు ఉన్న ఆరెకరాల పొలంలో ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి పంట సాగుచేశారు. ఇందుకోసం రూ.లక్షన్నర అప్పుచేశారు. సీజన్ ప్రారంభంలో కాలం కనికరించకపోవడంతో పత్తి పంట దిగుబడి ఆశించినస్థాయిలో రాలేదు. ఈ క్రమంలో రుణదాతల నుంచి కూడా ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. పంట రాకపోవడంతో అప్పులు ఎలాతీర్చాలని రోజూ దిగులుపడుతుండేవారు. ఈ క్రమంలో భార్యాభర్తలు మంగళవారం పత్తి తీసేందుకు పొలానికి వెళ్లి.. అక్కడే పురుగుమందు తాగారు. సాయంత్రంకొడుకు మౌలాలి పొలానికి వెళ్లి చూసేలోగా అప్పటికే ప్రాణాలు విడిచారు.
 
 కొడుకు బాగుకోసం..
 ఇదిలాఉండగా, వృద్ధదంపతులు తన కొడుకు బాగుకోసం తపించినట్లు సంఘటనస్థలాన్ని పరిశీలిస్తే తెలుస్తుంది. తాము చనిపోతే కొడుకైనా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం వస్తుందేమోననే భావనతో పొలంలోని విద్యుత్ వైర్లను కట్‌చేసి అక్కడే పడిపోయారు. చూసినవారు మొదట విద్యుదాఘాతంతో మృత్యువాతపడ్డారేమోనని భావించారు. కానీ కొద్దిదూరంలో పడి ఉన్న డబ్బాను పరిశీలిస్తే పురుగుమందు తాగినట్లు స్పష్టమవుతోంది. ఎస్‌ఐ ఫారాద్‌హుసేన్ తన సిబ్బందితో సంఘటనస్థలాన్ని పరిశీలించారు. కేసునమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కోసం ముక్తల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
Advertisement