2019 ప్రపంచకప్‌ పక్కా మనదే! | Sakshi
Sakshi News home page

Published Sat, Apr 21 2018 6:43 PM

Sehwag Says India Favourites to Win 2019 World Cup - Sakshi

కోల్‌కతా : 2019 ప్రపంచకప్‌ భారత్‌దేనని టీమిండియా మాజీ డాషింగ్‌ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ అభిప్రాయపడ్డాడు. శుక్రవారం కోల్‌కతాలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సెహ్వాగ్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచే సత్తా కోహ్లి సేనకు ఉందన్నాడు. అలాగే ఆస్ట్రేలియా పర్యటనలో భారత్‌ టెస్టు సిరీస్‌ గెలుస్తుందని జోస్యం చెప్పాడు. ‘‘  2019 ప్రపంచకప్‌ ఫేవరేట్‌ భారత్‌.. నమ్మశక్యంగా లేదా.. నిజంగా ఫెవరేట్‌ మనేమే.. ఆసత్తా కోహ్లి సేనకు ఉంది’’  అని తెలిపాడు. గంగూలీ సారథ్యంలోని అప్పటి భారత జట్టు బ్యాటింగ్‌, బౌలింగ్‌లో బలంగా ఉండేదని ఆనాటి రోజులను గుర్తుచేసుకున్నాడు.

‘ఓవర్సీస్‌లో టెస్టు సిరీస్‌ గెలిచే సత్తా అప్పటి గంగూలీ జట్టుకు ఉంది. బౌలింగ్‌, బ్యాటింగ్‌ విభాగం బలంగా ఉండేది. దక్షిణాఫ్రికా పర్యటనలో కొద్దిలో టెస్టు సిరీస్‌ను కోల్పోయాం.. లేకుంటే చరిత్ర సృష్టించేవాళ్లం. ఆ రోజుల్లో శ్రీనాథ్‌, జహీర్‌ఖాన్‌, అజిత్‌ అగార్కర్‌, ఆశిశ్‌ నెహ్రాలతో బౌలింగ్‌ విభాగం పటిష్టంగా ఉండేది. కానీ 2003 ప్రపంచకప్‌ అనంతరం ఈ నలుగురు కలిసి ఎప్పుడు ఆడలేదు. ఈ ప్రపంచకప్‌(2003) ఫైనల్లో సైతం ఒకరు గాయంతో దూరమయ్యారు. ఏ పరిస్థితుల్లోనైనా బౌలింగ్‌ చేసే సత్తా ఈ జట్టుకు ఉండేది.

ఆస్ట్రేలియా ఆటగాళ్లు స్టీవ్‌స్మిత్‌,  డేవిడ్‌ వార్నర్‌లపై నిషేదం విధించకున్నా ఆసీస్‌ పర్యటనలో భారత్‌ ఫేవరేట్‌గానే బరిలోకి దిగేది. వాళ్లు జట్టులో ఉన్నారా లేరా అనేది పెద్ద విషయమే కాదన్నాడు. వారున్నా భారత్‌ గెలుస్తుందన్నారు. ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్‌ గెలవడం తన జీవితంలో అత్యంత మధుర క్షణమని ఈ మాజీ క్రికెటర్‌ చెప్పుకొచ్చాడు. ‘మేం రెండు ప్రపంచకప్‌లు గెలిచాం. కానీ 2007 ప్రపంచకప్‌ గెలిచిన సమయంలో మాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి. యువ ఆటగాడి సారథ్యంలోని యువ రక్తంతో కూడిన జట్టు మాది. కప్‌గెలుస్తామని మాపై ఎలాంటి అంచనాలు లేవు.’ అని సెహ్వాగ్‌ ఆనాటి క్షణాలను నెమరువేసుకున్నాడు.

Advertisement
Advertisement