Sakshi News home page

టాపార్డర్ తడబడినా.. ధోనీ గెలిపించాడు

Published Fri, Mar 6 2015 7:10 PM

టాపార్డర్ తడబడినా.. ధోనీ గెలిపించాడు

పెర్త్: ప్రపంచ కప్లో టీమిండియాకు తొలిసారి సవాల్ ఎదురైంది. ఏకపక్ష ఘనవిజయాలతో దూసుకెళ్తున్న భారత్ తొలిసారి చెమటోడ్చి నెగ్గింది. అయినా ధోనీసేన జైత్రయాత్ర కొనసాగించి వరుసగా నాలుగో విజయం సాధించింది. గ్రూపు-బిలో భాగంగా శుక్రవారం వెస్టిండీస్తో హోరాహోరీగా సాగిన మ్యాచ్లో ధోనీసేన 4 వికెట్లతో విజయం సాధించింది. భారత టాపార్డర్ తడబడినా ధోనీ (45 నాటౌట్)  కెప్టెన్ ఇన్నంగ్స్ తో జట్టును గెలిపించాడు. తాజా విజయంతో భారత్ దాదాపుగా నాకౌట్ బెర్తు సొంతం చేసుకుంది. 183 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన టీమిండియా 6 వికెట్లు కోల్పోయి మరో 65 బంతులు మిగిలుండగా విజయతీరాలకు చేరింది. కష్టసాధ్యంకాని లక్ష్యఛేదనలో భారత్ తడబడింది. 20 పరుగులకే ఓపెనర్లు ధవన్ (9), రోహిత్ (7) ఇద్దరూ అవుటయ్యారు. జెరోమ్ టేలర్ వరుస ఓవర్లలో వీరిద్దరినీ అవుట్ చేశాడు. ఈ దశలో కోహ్లీ (33), రహానె (14) కాసేపు జట్టును ఆదుకునే ప్రయత్నం చేసినా వెంటవెంటనే వెనుదిరిగారు.  అనంతరం ధోనీ.. రైనాతో కలసి జట్టు స్కోరును 100 దాటించాడు. జట్టు విజయం దిశగా పయనిస్తున్న సమయంలో రైనా (22), జడేజా (13) అవుటవడంతో మ్యాచ్ ఉత్కంఠగా మారింది. మరో వికెట్ పడుంటే పరిస్థితి దారుణంగా ఉండేది. అయితే ధోనీ, అశ్విన్ తో కలసి జట్టును విజయతీరాలకు చేర్చాడు. మహీ మరోసారి బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అవతారమెత్తాడు. షమీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.


అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన విండీస్ను భారత బౌలర్లు 44.2 ఓవర్లలో 182 పరుగులకు ఆలౌట్ చేశారు. విండీస్ జట్టులో కెప్టెన్ జాసన్ హోల్డర్ (57) టాప్ స్కోరర్. ఇతర బ్యాట్స్మెన్ విఫలమయ్యారు. విధ్వంసక వీరుడు క్రిస్ గేల్ 21 పరుగులకే అవుటయ్యాడు. సామీ 26, కార్టర్ 21 పరుగులు చేశారు. విండీస్ ఓ దశలో 85/7తో పీకల్లోతు కష్టాల్లోపడింది. హోల్డర్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడటంతో విండీస్ కాస్త గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. భారత బౌలర్లు షమీ మూడు, ఉమేష్, జడేజా చెరో రెండు వికెట్లు పడగొట్టారు.

Advertisement
Advertisement