మరో చరిత్రే లక్ష్యంగా టీమిండియా.. | Sakshi
Sakshi News home page

మరో చరిత్రే లక్ష్యంగా టీమిండియా..

Published Thu, Jan 17 2019 4:43 PM

India Aim To End Tour With First Bilateral ODI Series Win In Australia - Sakshi

మెల్‌బోర్న్‌: ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను వారి గడ్డపై గెలిచి కొత్త చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇప్పుడు మరో రికార్డుపై కన్నేసింది.  ఆసీస్‌తో మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా చివరి వన్డేలో టీమిండియా గెలిస్తే కొత్త అధ్యాయాన్ని లిఖిస్తుంది. ఇప్పటివరకూ ఆస్ట్రేలియా గడ్డపై ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌ను గెలిచిన చరిత్ర టీమిండియాకు లేదు.  గతంలో రెండు సందర్భాల్లో ఆస్ట్రేలియా గడ్డపై వన్డే ఫార్మాట్‌లో సిరీస్‌లు సాధించినప్పటికీ, అవి ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు కావు. ఒకటి 1985లో జరిగిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌ ఆఫ్‌ క్రికెట్‌ టైటిల్‌ కాగా, రెండోది మూడు దేశాలు పాల్గొన్న సీబీ సిరీస్‌.  

దాంతో ఒక ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లో తొలిసారి ఆసీస్‌ను వారి దేశంలో  ఓడించే అవకాశం టీమిండియా ముంగిట ఉంది.  ఈ మేరకు కసరత్తులు చేస్తున్న కోహ్లి అండ్‌ గ్యాంగ్‌ ఆసీస్‌ పర్యటనకు ఘనమైన ముగింపు ఇచ్చే యోచనలో ఉంది. రేపు(శుక్రవారం) మెల్‌బోర్న్‌ వేదికగా ఇరు జట్ల మధ్య సిరీస్‌ నిర్ణయాత్మక వన్డే జరుగనుంది. భారత కాలమాన ప‍్రకారం ఉదయం గం.7.50 ని.లకు మ్యాచ్‌ ఆరంభం కానుంది. భారత్‌-ఆసీస్‌లు తలో వన్డే గెలిచి సమంగా నిలవడంతో మూడో వన్డేకు ప్రాధాన్యత సంతరించుకుంది. తొలి వన్డేలో ఆసీస్‌ 34 పరుగుల తేడాతో గెలవగా, రెండో  వన్డేలో 6 వికెట్ల తేడాతో భారత్‌ విజయం సాధించింది. రేపటి మ్యాచ్‌లో భారత్‌ గెలిచిన పక్షంలో ఆస్ట్రేలియా పర్యటనలో సిరీస్‌ను కోల్పోకుండా ముగించినట్లు అవుతుంది. మూడు టీ20ల సిరీస్‌ 1-1తో సమం కాగా, నాలుగు టెస్టుల సిరీస్‌ను 2-1తో టీమిండియా గెలుచుకుంది.

సిరాజ్‌కు ఉద్వాసన తప్పదా..?

ఆసీస్‌తో రెండో వన్డేలో ఆడటం ద్వారా ఈ ఫార్మాట్‌లో అరంగేట్రం చేసిన హైదరాబాద్‌ పేసర్‌ మహ్మద్‌ సిరాజ్‌ ఘోరంగా నిరాశపరిచాడు.  అడిలైడ్‌ వన్డేలో 10 ఓవర్లలో 76 పరుగులిచ్చిన అతను ఒక్క వికెట్‌ కూడా తీయలేదు. భారత్‌ తరఫున కర్సన్‌ ఘావ్రీ (0/83) తర్వాత అరంగేట్రంలో అతి చెత్త ప్రదర్శన సిరాజ్‌దే కావడం గమనార్హం. దాంతో సిరాజ్‌పై వేటు తప్పేలా కనబడటం లేదు. అతని స్థానంలో ఖలీల్‌ అహ్మద్‌ తిరిగి జట్టులో చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ ఒక్క మార్పు తప్పితే భారత జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. సిరీస్‌ నిర్ణయాత్మక మ్యాచ్‌లో కేదర్‌ జాదవ్‌ను జట్టులో చోటు దక్కడం కష్టంగానే ఉంది. ఆల్‌ రౌండర్‌ రవీంద్ర జడేజా స్థానంలో కానీ, కుల్దీప్‌ యాదవ్‌ స్థానంలో కానీ కేదర్‌ జాదవ్‌ను తీసుకోవాలి. కాగా, కీలకమైన మ్యాచ్‌కు రవీంద్ర జడేజా, కుల్దీప్‌ యాదవ్‌లను తీసే సాహసం టీమిండియా యాజమాన్యం చేయకపోవచ్చు. అడిలైడ్‌ వన్డేలో కుల్దీప్‌ రాణించనప్పటికీ మెల్‌బోర్న్‌ పిచ్‌ పొడిగా ఉండే అవకాశం ఉండటంతో అతనికే తుది జట్టులో అవకాశం ఖాయంగా కనబడుతోంది. దాంతో పెద్దగా మార్పులు లేకుండానే టీమిండియా ఫైనల్‌ టచ్‌కు సిద్ధమయ్యే అవకాశం ఉంది.

రెండు మార్పులతో ఆసీస్‌..

భారత్‌తో ఎట్టి పరిస్థితుల్లోనూ సిరీస్‌ను వదులుకోకూడదనే యోచనలో ఉన్న ఆసీస్‌ జట్టు రెండు మార్పులతో బరిలోకి దిగనుంది. ఈ వన్డే సిరీస్‌లో ఏమాత్రం ప్రభావం చూపని స్పిన్నర్‌ నాథన్‌ లయన్‌ స్థానంలో ఆడమ్‌ జంపాను తీసుకోగా, పేసర్‌ బెహ్రెన్‌డార్ఫ్‌ స్థానంలో బిల్లీ స్టాన్‌లేక్ జట్టులోకి వచ్చాడు.‌ ఇక రిజర్వ్‌ ఆటగాడిగా కేన్‌ రిచర్డ్‌సన్‌ను తీసుకున్నారు. ఏది ఏమైనా ఇరు జట్ల మధ్య రేపటి మ్యాచ్‌ ఆసక్తికరంగా జరిగే అవకాశం ఉంది.

Advertisement
Advertisement