ఆ ఒక్క నిర్ణయమే ధోనిని హీరోను చేసింది | Sakshi
Sakshi News home page

Published Tue, Jul 31 2018 10:07 AM

Ganguly Shared he Asked Dhoni to Bat Up The order - Sakshi

హైదరాబాద్ : టీమిండియా మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ ఎంతో మంది యువక్రికెటర్లను తీర్చిదిద్దాడు. అతని సారథ్యంలో చాలా మంది క్రికెటర్లు తమ సత్తా చాటారు. అందులో టీమిండియా మాజీ కెప్టెన్‌, సీనియర్‌ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని ఒకడు. ఈ జార్ఖండ్‌ డైనమైట్‌ వెలుగులోకి వచ్చింది గంగూలీ సారథ్యంలోనే అన్న విషయం అందరికీ తెలిసిందే. గంగూలీ ఇచ్చిన ఒక్క ఛాన్స్‌ను అందిపుచ్చుకున్న ధోని తనేంటో ప్రపంచానికి చాటి చెప్పాడు. ఈ విషయాన్ని ధోని సైతం అనేక ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చాడు. తాజాగా ఇదే అంశాన్ని దాదా బ్రేక్‌ ఫాస్ట్‌ విత్‌ చాంపియన్స్‌ షోలో ప్రస్తావించాడు.

‘ధోని 2004లో జట్టులోకి వచ్చాడు. అతని ఆడిన తొలి రెండు మ్యాచ్‌ల్లో 7 స్థానంలోనే బ్యాటింగ్‌కు చేశాడు. అయితే పాకిస్తాన్‌తో వైజాగ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో కూడా అతను 7వ స్థానంలోనే బ్యాటింగ్‌ చేయాలని ముందురోజు నిశ్చయించుకున్నాం. ఆ సమయంలో నేను నా గదిలో కూర్చోని న్యూస్‌ చూస్తున్నాను. ధోనిని మంచి ఆటగాడిగా ఎలా మార్చాలని ఆలోచించాను. అతని సత్తా ఏంటో నాకు తెలుసు. మరుసటి రోజు మ్యాచ్‌లో టాస్‌ నెగ్గాం. వెంటనే అతన్ని మూడో స్థానంలో బ్యాటింగ్‌ పంపించాలని డిసైడయ్యాను. ఏం జరిగినా పర్వాలేదనుకున్నాను. 7 స్థానంలో బ్యాటింగ్‌ కదా అని సిద్దం కాకుండా ధోని కూర్చొని ఉన్నాడు. నేను ‘ధోని నీవు మూడో స్థానంలో బ్యాటింగ్‌ వెళ్తున్నావు’ అని చెప్పా. వెంటనే అతను మరి మీరు అని అడిగాడు. నేను నాలుగో స్థానంలో వస్తానని చెప్పా.’  అని నాటి రోజులను గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ఈ ఒక్క నిర్ణయమే భారత్‌కు ఓ గొప్ప కెప్టెన్‌ అందించడమే కాకుండా ఐసీసీ టైటిళ్లన్నీ నెగ్గేలా చేసింది. ఇక ఆ మ్యాచ్‌లో ధోని శతకంతో విశ్వరూపం చూపిన విషయం తెలిసిందే. తన హెలీక్యాప్టర్‌ షాట్‌లతో పాక్‌ బౌలర్లను ఉతికి ఆరేసాడు. 15 ఫోర్లు, 4 సిక్స్‌లతో 148 పరుగులు చేసి సంచలనం సృష్టించాడు. 

చదవండి: లక్ష్మణ్‌ వద్దన్నా చేసా: గంగూలీ

ఇంగ్లండ్‌ గడ్డపై ఆ.. ఆరు ముత్యాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement