రేపటి నుంచి జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర

YS Jagan Praja Sankalpa Yatra To Enter Nellore tomorrow - Sakshi

తొమ్మిది నియోజకవర్గాలు, 225 కిలోమీటర్లు

సూళ్లూరుపేటలో ప్రారంభమై ఉదయగిరి నియోజకవర్గంలో ముగింపు

వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్‌ వెల్లడి

నాయుడుపేటలో బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించిన నేతలు

సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, శాసనసభా ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్పయాత్ర ఈ నెల 23వ తేదీన నెల్లూరు జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రజాసంకల్ప యాత్ర కో–ఆర్డినేటర్‌ తలశిల రఘురామ్‌ తెలిపారు. జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోకి పాదయాత్ర మంగళవారం ప్రవేశిస్తుందని పేర్కొన్నారు. జిల్లాలో తొమ్మిది నియోజకవర్గాల మీదుగా యాత్ర కొనసాగి ఉదయగిరి నియోజకవర్గంతో నెల్లూరు జిల్లాలో ముగిసి ప్రకాశం జిల్లాలోకి ప్రవేశిస్తుందని తెలిపారు. ఆదివారం సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేటలో ప్రజాసంకల్ప యాత్ర ఏర్పాట్లను జిల్లా నేతలతో కలిసి ఆయన పరిశీలించారు.

అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. 23వ తేదీ ఉదయం చిత్తూరు జిల్లాలో పాదయాత్ర ముగిసి నెల్లూరు జిల్లాలోని సూళ్లూరుపేట నియోజకవర్గంలోని పెళ్లకూరు మండలం పునబాక గ్రామంలోకి జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ప్రవేశిస్తుందని తెలిపారు. పార్టీ జిల్లా నేతలు, జిల్లా వ్యాప్తంగా ఉన్న పార్టీ కార్యకర్తలు, స్థానికులు అశేషంగా తరలివచ్చి జిల్లాలోకి ప్రవేశించే జగన్‌ పాదయాత్రకు ఘనస్వాగతం పలకటానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు. 24వ తేదీన నాయుడుపేటకు పాదయాత్ర చేరుకుంటుందని పేర్కొన్నారు. అక్కడ బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారని తెలిపారు. అక్కడి నుంచి గూడూరు, వెంకటగిరి, సర్వేపల్లి, నెల్లూరు రూరల్, కోవూరు, ఆత్మకూరు. కావలి, ఉదయగిరి నియోజకవర్గాల వరకు జిల్లాలో పాదయాత్ర కొనసాగుతుందని వివరించారు.

నాయుడుపేట: జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఏర్పాట్లపై నాయకులతో చర్చిస్తున్న తలశిల రఘురామ్, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్య 
నాయుడుపేటలో ఏర్పాట్ల పరిశీలన
 ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా 24వ తేదీన నాయుడుపేటలో బహిరంగ సభ జరగనుంది. స్థానిక పాతబస్టాండ్‌ సెంటర్‌లో మధ్యాహ్నం మూడు గంటలకు బహిరంగ సభ జరుగుతుందని తలశిల రఘురామ్‌ తెలిపారు. ఈ క్రమంలో ఆదివారం పార్టీ నెల్లూరు, తిరుపతి పార్లమెంటరీ అధ్యక్షులు, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కిలివేటి సంజీవయ్యతో కలిసి యాత్ర ఏర్పాట్లు, బహిరంగ సభ జరిగే ప్రదేశాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు పి.రూప్‌కుమార్‌యాదవ్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top