'నాన్న వారసుడిగా రెండు అడుగులు ముందుకేస్తా' | Sakshi
Sakshi News home page

'నాన్న వారసుడిగా రెండు అడుగులు ముందుకేస్తా'

Published Mon, Dec 11 2017 5:48 PM

ys jagan mohanreddy face to face in mudigubba  - Sakshi

సాక్షి, మదిగుబ్బ : 'నాన్నగారు ప్రజలకు మంచి జరగాలని ఒక అడుగు ముందుకు వేస్తే ఆయన వారసుడిగా నేను రెండు అడుగులు మరింత ముందుకు వేస్తాను' అని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి అన్నారు. 32వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ఆయన రాప్తాడు నియోజకవర్గంలోని ముదిగుబ్బలో ముస్లింలతో ముఖాముఖి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింలకు మేలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని అన్నారు. మైనార్టీలకు 4శాతం రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత వైఎస్‌ఆర్‌కే దక్కుతుందని చెప్పారు. కేబినెట్‌లో ఒక్క ముస్లింకు కూడా చంద్రబాబు స్థానం ఇవ్వలేదని తెలిపారు. ఉచిత విద్య పేరుతో చంద్రబాబు మోసం చేశారని అన్నారు. ఉన్నత చదువులు చదివే విద్యార్థులను సైతం బాబు వదిలిపెట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.



'పేదరికంలో ముస్లింలు చాలామంది ఉన్నారు. ఒక విద్యార్థి ఇంజినీరింగ్‌, డాక్టర్‌ చేయాలంటే లక్షపైనే ఖర్చు అవుతుంది. కానీ, చంద్రబాబు ఇచ్చేది ముష్టి వేసినట్లు రూ.30 వేలు మాత్రమే. ఇలా ఇస్తే మన పిల్లలు ఇంజినీర్లు, వైద్యులు అవుతారా? నాన్నగారు (వైఎస్‌ఆర్‌) అధికారంలోకి రాకమునుపు చంద్రబాబు పాలన ఎలా ఉండేదో ఇప్పుడు చంద్రబాబు పాలన అలాగే ఉంది. ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకుంటే వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. అర గంటలో 108 రావడం లేదు. సాధారణంగా ఎంత పేదవాడైనా ఇంట్లో ఆరోగ్యం బాగా లేని వ్యక్తిని వడ్డీకి తీసుకొచ్చుకొని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాలనుకుంటాడు. మంచి హాస్పిటల్స్‌ అన్ని హైదరాబాద్‌లో ఉన్నాయి. 50 ఏళ్లు రాజధానిగా ఉంది కాబట్టే అక్కడ ఉన్నాయి. కానీ, చంద్రబాబు పాలనలో హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుంటే ఆరోగ్య శ్రీ వర్తించదంట. నేడు ఆరోగ్య శ్రీ ఎలాంటి పరిస్థితిలో ఉందో ఆలోచించండి. ఆరోగ్య శ్రీ పరిధిలోని ఆస్పత్రులకు ఎనిమిది నెలల బిల్లులు పెండిగ్‌ ఉన్నాయి.



108కి ఫోన్‌ చేస్తే టైర్లు బాగలేవు, డీజిల్‌ లేదంటు బదులిస్తున్నారు. పెద్ద పెద్ద రోగాలకు వైద్యం చేయించుకునే పరిస్థితి లేదు. ఈ మధ్యే నవరత్నాలు ప్రకటించుకున్నాం. ప్రతి పిల్లాడికి తోడుగా ఉంటాం. తల్లిదండ్రులు అప్పుల పాలు కావద్దు.. నవరత్నాల్లో భాగంగా ఇంజినీరింగ్‌, వైద్య విద్యకు ఎంత ఖర్చు అవుతుందో అంత మేమే భరిస్తాం. నాన్నగారు ప్రజల మంచి కోసం ఒక్క అడుగు ముందుకు వేస్తే నేను ఆయన వారసుడిగా రెండు అడుగులు ముందుకు వేస్తా. ఇంజినీర్లు, డాక్టర్లుగా చేయడం మాత్రమే కాదు వారి ఖర్చులకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం. చిన్నచిన్నపిల్లలు బడులకు పోతే అందరి తలరాతలు మారుతాయి.. వారిని బడికి పంపే బాధ్యత తల్లులదే. పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తాం. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పు తెస్తున్నాం.



పేదవాడికి ఆరోగ్యం బాగలేకుంటే రూ.వెయ్యిపైన ఖర్చు అయితే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చి ఉచితంగా చికిత్స చేయించి చిరునవ్వుతో ఇంటికి పంపిస్తాం. చికిత్స పొందేటప్పుడు పని విరామ సమయంలో ప్రతి పేదవాడికి డబ్బులిస్తాం. హైదరాబాద్‌, బెంగళూరు, చెన్నై ఎక్కడ వైద్యం చేయించుకున్నా అధికారంలోకి వచ్చాక మేమే భరిస్తాం. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారికి పెన్షన్‌ రూ.పది వేలు ఇస్తాం. అవ్వతాతలకు మందులు, పెన్షన్లు రూ.2వేలు ఇస్తాం. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు పనికి వెళితేనే బతుకు గడుస్తుంది. లేదంటే పది రోజుల్లో పస్తులుండాల్సిన పరిస్థితి. అందుకే అలాంటి సమస్య లేకుండా పెన్షన్‌ వయసు 45కు తగ్గిస్తున్నాం. ఇమామ్‌లకు రూ.10 వేలు, మౌజిమ్‌లకు రూ.5000 ఇస్తాం. మసీదులైనా, చర్చిలైనా, గుడులైనా అందరికీ మన ప్రభుత్వం అండగా ఉంటుంది. మంచి ఏమిటో తెలుసుకునేందుకు ప్రతిఒక్కరు మసీదు, గుడులు, చర్చిలకు పోవాల్సిందే' అని అన్నారు.

ముస్లింలతో ముఖాముఖిపై వైఎస్‌ జగన్‌ ట్వీట్‌
ముఖాముఖి అనంతరం వైఎస్‌ జగన్‌.. ‘ముస్లిం సమాజ సామాజిక-ఆర్ధిక అభివృద్ధి నా ప్రధాన ప్రాధాన్యతలలో ఒకటి. మహానేత వైఎస్ఆర్.. గొప్ప దృష్టితో ముస్లింల అభివృద్ధి కోసం బలమైన పునాది వేశారు. ఆయన ఆశయాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా, ముస్లింల స్థిరమైన అభివృద్ధి కోసం నేను పాటుపడతాను’ అని ట్వీట్‌ చేశారు.

Advertisement
Advertisement