అధికారం మళ్లీ మాదే..

We Will Win Again Says KCR - Sakshi

స్వామి ఆశీస్సులు, మీ దీవెనలతో  వందకు పైగా సీట్లు గెలుస్తాం: కేసీఆర్‌ 

ఇక్కడ నుంచి ప్రారంభమైన ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు 

ధనవంతమైన రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకుందామని పిలుపు 

కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో టీఆర్‌ఎస్‌ అధినేత పూజలు

హరీశ్‌ను లక్ష మెజార్టీతో గెలిపించాలని గ్రామస్తులకు వినతి 

పూజల అనంతరం గజ్వేల్‌లో నామినేషన్‌ దాఖలు 

సాక్షి, సిద్దిపేట : ‘‘నా ఇష్ట దైవం కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి.. ఈ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో పెద్ద యు ద్ధమైన రాష్ట్ర సాధన ఉద్యమానికి శ్రీకారం చుట్టాం.. అసాధ్యం అనుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం.. ఇక్కడి నుంచి ప్రారంభమైన ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు.. ఇప్పుడు కూడా స్వామివారు.. కోనాయిపల్లి గ్రామస్తులు.. అందరి దీవెనలతో తిరిగి టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వస్తుంది’’అని ఆ పార్టీ అధినేత, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ధీమా వ్యక్తంచేశారు. ప్రతీ ఎన్నికల ముందు బీ–ఫాంతో సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలోని వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పూజలు చేయడం కేసీఆర్‌కు ఆనవాయితీ. ఈ నేపథ్యంలో బుధవారం కోనాయిపల్లి చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం లభించింది.
 

మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికి తిలకం దిద్దారు. కేసీఆర్‌ ఆలయ ప్రాంగణంలోకి చేరుకోగానే పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భం గా కేసీఆర్‌ తన బీ–ఫాంపై సంతకం చేసి పురోహితులకు అందజేశారు. వారు గర్భగుడిలో దేవుడి పాదా ల వద్ద బీ–ఫాం పెట్టి పూజలు చేశారు. అనంతరం గ్రామస్తులు, అక్కడికి వచ్చిన నాయకులను ఉద్దేశిం చి కేసీఆర్‌ మాట్లాడారు. శాసనసభ డిప్యూటీ స్పీకర్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఇక్కడకు వచ్చే స్వామివారు, ఈ గ్రామస్తుల దీవెనలతో ఉద్యమబా ట పట్టానని తెలిపారు. దేవుడి దీవెనలతో స్వరాష్ట్రం సాధించుకున్నామని, అలాగే అసాధ్యమని చెప్పిన 24గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేసుకుంటూ.. అందరి అనుమానాలను నివృత్తి చేశామని చెప్పారు. 

రైతులు బాగుండాలన్నదే నా ఆలోచన... 
ఆర్థిక వనరులు ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని ధనవంతమైన రాష్ట్రంగా మార్చుకుందామని కేసీఆర్‌ పేర్కొ న్నారు. ఇప్పటికే సంక్షేమ రాష్ట్రంగా తీర్చిదిద్దామని, మీ దీవెనలతో వందకుపైగా సీట్లు సాధించుకుంటామని ధీమా వ్యక్తంచేశారు. గతంలో రైతులు కరెం ట్‌ కష్టాలతో ఇబ్బందులు పడ్డారని, ఇప్పుడు ఆ తిప్పలు లేవని చెప్పారు. తన ఆలోచన అంతా రైతులు బాగుండాలన్నదేనన్నారు. అప్పులు చేసుకొని రైతులు ఇబ్బందులు పడొద్దని, ఎప్పటికీ రైతులకు రూ.5 లక్షలు చేతిలో ఉండేలా మార్చుకోవాల్సి న అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దేశంలో అత్యంత ధనవంతులైన రైతులు తెలంగాణలో ఉన్నా రని చెప్పుకోవాలన్నదే తన కోరిక అని స్పష్టంచేశారు. రైతుల ఇబ్బందులు పోవాలంటే సాగునీరు రావాలని, ఇందుకోసం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజె క్టు పనులు పూర్తికావస్తున్నాయని కేసీఆర్‌ తెలిపారు. నీళ్ల మంత్రి హరీశ్‌రావు ఆ పనిలో నిమగ్నమై ఉన్నా రని చెప్పారు. త్వరలోనే కాళేశ్వరం నీళ్లు ఈ ప్రాంతం లో పారించి కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి కాళ్లు కడగాలని హరీశ్‌రావుకు చెప్పానని వెల్లడించారు.
 

 

కేసీఆర్‌కు హరీశ్‌ పాదాభివందనం 
‘‘ఇప్పటి వరకు మీ మద్దతుతోనే ఇంత పెద్దవాడినయ్యాను. నన్ను ఆదరించినట్టుగానే హరీశ్‌రావును కూడా ఆశీర్వదించి లక్ష మెజార్టీతో గెలిపించాలి’’అని కోనాయిపల్లి గ్రామస్తులకు కేసీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పక్కనే ఉన్న హరీశ్‌రావు.. కేసీఆర్‌కు పాదాభివందనం చేశారు. దీంతో కార్యకర్తలు, నాయకులు ఒక్కసారిగా నినాదాలు చేశారు. వెంటనే కేసీఆర్‌.. హరీశ్‌రావు భుజం తట్టి పైకి లేపారు. అనంతరం కేసీఆర్‌కు హరీశ్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సంతోష్, ఎమ్మెల్సీలు పాతూరి సుధాకర్‌రెడ్డి, బోడెకుంట్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

 

సాదాసీదాగా  కేసీఆర్‌ నామినేషన్‌ 
గజ్వేల్‌: టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ బుధవారం గజ్వేల్‌లో సాదాసీదాగా నామినేషన్‌ దాఖలు చేశారు. పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి మధ్యాహ్నం 2:26 గంటలకు చేరుకున్న ఆయన.. ముందుగా నిర్ణయించుకున్న ముహూర్తం కోసం కొద్దిసేపు కార్యాలయంలో నిరీక్షించారు. 2:33 గంటలకు మొదటి సెట్, 2:35 గంటలకు రెండో సెట్‌ నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అ«ధికారి విజయేందర్‌రెడ్డికి అందజేశారు. కేసీఆర్‌ అభ్యర్థిత్వాన్ని జెడ్పీ మాజీ చైర్మన్‌ లక్ష్మీకాంతారావు, మాజీ నాచారం ట్రస్టు బోర్డు చైర్మన్‌ కొట్టాల యాదగిరి బలపర్చగా.. వీరిద్దరితో కలిసి రిటర్నింగ్‌ అధికారికి నామినేషన్‌ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఫాం–26తోపాటు ఆస్తులు, అప్పులకు సంబంధించిన పత్రాలు కూడా సమర్పించారు. అనంతరం రాజ్యాంగం ప్రకారం సత్యనిష్టతో అంటూ ఎన్నికల ప్రమాణం చేశారు. కేసీఆర్‌ వెంట మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మాజీ స్పీకర్‌ సురేష్‌రెడ్డి, కేసీఆర్‌ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి శేరి సుభాష్‌రెడ్డి ఉన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top