కేసీఆర్‌ మాట విని అరెస్టులా? | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ తొత్తుల్లా పోలీసులు: ఉత్తమ్‌

Published Tue, Sep 11 2018 3:54 AM

Uttam Kumar Reddy Fires Over Jagga Reddy Arrest - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి అరెస్ట్‌ కలకలం రేపింది. అక్రమ రవాణా కేసులో జగ్గారెడ్డిని సోమవారం అర్దరాత్రి పోలీసులు అరెస్ట్‌ చేయడంతో.. ఆ పార్టీ నేతలు ఉత్తమ్, రేవంత్ రెడ్డి, సునీతా లక్ష్మా రెడ్డి, బట్టి విక్రమార్క, షబ్బీర్ అలీ, సంపత్, దాసోజు శ్రవణ్, విక్రమ్ గౌడ్ సోమవారం అర్ధరాత్రి డీజీపీ మహేందర్‌రెడ్డితో భేటీ అయ్యారు. డీజీపీ ఇంటికి వెళ్లి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పోలీసులు కేసీఆర్‌ తొత్తుల్లా పనిచేస్తున్నారని మండిపడ్డారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే ఎలా అరెస్ట్‌ చేస్తారని ధ్వజమెత్తారు. పోలీసులు కేసీఆర్‌ చెప్పినట్టు చేస్తున్నారని విమర్శించారు. కేసీఆర్‌ మాట విని జగ్గారెడ్డిని అక్రమంగా అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. 2004లో ఎఫ్ఐఆర్ అయిన కేసులో ఇప్పుడు అరెస్ట్ చేశామని చెబుతున్న పోలీసులు.. 2004లో నమోదైన ఇల్లీగల్ ఇమ్మిగ్రేషన్ కేసులో కేసిఆర్, హరీష్ రావులు నిందితులుగా ఉన్నారని వారిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్‌ చేశారు.

అరెస్ట్ పై నాకు సమాచారం లేదు : జగ్గారెడ్డి భార్య నిర్మల
జగ్గారెడ్డి అరెస్ట్‌పై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన భార్య నిర్మల పేర్కొన్నారు. తనకు, తన పిల్లలకు పాస్‌పోర్ట్‌ లేదని, ఈ మధ్యే జగ్గారెడ్డి పాస్‌పోర్ట్‌ తీసుకున్నారని తెలిపారు. తాము ఎప్పుడూ అమెరికా వెళ్లలేదని, ఎన్నికలు సమీపిస్తుండటంతో కావాలనే కుట్రపూరితంగా తన భర్తను అరెస్ట్‌ చేశారని అన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement