రేవంత్‌ కలకలం : టీటీడీపీ కీలక భేటీ..! | Sakshi
Sakshi News home page

రేవంత్‌ కలకలం : టీటీడీపీ కీలక భేటీ..!

Published Wed, Oct 18 2017 5:42 PM

TDP reaction on Revanth comments - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఏపీ తెలుగుదేశం మంత్రులు, నాయకులపై రేవంత్‌ రెడ్డి చేసిన తీవ్ర విమర్శలపై తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్పందించింది. రేవంత్‌ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమైనవని, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఏపీ నేతలపై రేవంత్‌ మాటల తూటాలు పేల్చిన గంటల వ్యవధిలోనే టీటీడీపీ ఒక అధికారిక ప్రకటనను విడుదలచేసింది. ఈ వ్యవహారంపై చర్చించేందుకు శుక్ర లేదా శనివారం కీలక నేతలు భేటీ కానున్నట్లు తెలిసింది. 

‘‘పొత్తులపై ఎవరు ఏం మాట్లాడినా అది వారి వ్యక్తిగత అభిప్రాయమే అవుతుంది. పొత్తు విషయంలో అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిదే తుది నిర్ణయం. ఆయన నిర్దేశించినట్లే పార్టీ వెళుతుంది’’ అని టీటీడీపీ ప్రకటనలో పేర్కొన్నారు. అధికార టీఆర్ఎస్‌లో తెలంగాణ టీడీపీ విలీనం లేదా పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న రేవంత్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది. అయితే టీఆర్‌ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు నాయుడి నుంచి స్పష్టత తీసుకున్న తర్వాతే పార్టీ మారేది, లేదని వెల్లడిస్తానని రేవంత్‌ చెప్పుకొచ్చారు.

దీపావళి తర్వాత టీటీడీపీ కీలక భేటీ : టీఆర్‌ఎస్‌తో పొత్తు, రేవంత్ ఫిరాయింపు.. తదితర కీలక అంశాల నేపథ్యంలో తెలంగాణ తెలుగుదేశం ముఖ్యనేతలు భేటీ కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. దీపావళి పండుగ తర్వాతి రోజు ఎల్‌.రమణ అధ్యక్షతన జరగనున్న ఆ సమావేశంలో పొలిట్‌బ్యూరో సభ్యులు, రాష్ట్ర కమిటీ నేతలు పాల్గొంటారని పేర్కొన్నాయి. ఈ మేరకు అందరికీ ఇప్పటికే సమాచారాన్ని చేరవేసినట్లు తెలిసింది. కాగా, భేటీకి రావాల్సిందిగా రేవంత్‌ రెడ్డికి కూడా సమాచారం అందించినట్లు కీలక నేత ఒకరు వెల్లడించారు.

ఏపీ టీడీపీ నేతలపై బాంబులు : బుధవారం మీడియాతో చిట్‌చాట్‌ చేసిన రేవంత్‌రెడ్డి.. ఏపీ టీడీపీ నేతలు, మంత్రులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. వివాహానికి హాజరైన కేసీఆర్‌కు ఏపీ టీడీపీ నేతలు దండాలు పెట్టడాన్ని ఆక్షేపించారు. తెలంగాణలో తెలుగుదేశం నాయకులను కేసీఆర్‌ జైళ్లలో పడేస్తోంటే, ఏపీ నేతలు మాత్రం ఆయనపై ఈగ వాలనీయకుండా చూసుకుంటున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుపై చంద్రబాబు స్పష్టత ఇచ్చిన తర్వాత పార్టీని వీడేది, లేనిదీ చెబుతానని రేవంత్‌ స్పష్టంచేశారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement