దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు! | Sakshi
Sakshi News home page

దిక్కుతోచని స్థితిలో చంద్రబాబు!

Published Fri, Feb 15 2019 1:55 PM

Shock for Chandrababu, Two TDP Leaders Quit - Sakshi

‘టీడీపీ నుంచి బయటకు పోయిన వారంతా చరిత్రహీనులుగా మిగిలిపోతారు.. ఇలాంటి అవకాశవాదులు పార్టీ వీడటం వల్ల నష్టం కంటే లాభమే ఎక్కువ’  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తాజాగా చేసిన వ్యాఖ్యలివి. తమ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు వైఎస్సార్‌ సీపీలో చేరిన నేపథ్యంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీని వదిలివెళ్లే నాయకుల సంఖ్య పెరుగుతుండటంతో చంద్రబాబు అసహనానికి గురవుతున్నారు. మరిం​త మంది పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో నిరాశ, నిస్పృహలకు లోనవుతున్నట్టు కనబడుతోంది. (టీడీపీని వీడి వైఎస్సార్‌ సీపీలో చేరిన అవంతి)

పార్టీ ఫిరాయింపుల గురించి చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వైఎస్సార్‌ సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను టీడీపీలో చేర్చుకోవడమే కాకుండా నలుగురికి మంత్రి పదవులు కట్టబెట్టిన విషయాన్ని మర్చిపోయారా అంటూ ప్రశ్నిస్తున్నాయి. పార్టీ ఫిరాయింపులపై గురివింద చందంగా చంద్రబాబు వ్యవహరించిన తీరును దేశమంతా చూసిందని వ్యాఖ్యానించాయి. ఏపీలో ఫిరాయింపులను ప్రోత్సహించిన చంద్రబాబు తెలంగాణకు వెళ్లి ఫిరాయింపులు నేరమన్నట్టు మాట్లాడారు. తాను చేస్తే మంచి, ఇతరులు చేస్తే నేరమన్నట్టుగా వ్యవహరిస్తారు.

చంద్రబాబులా వైఎస్ జగన్‌ ఫిరాయింపులను ప్రోత్సహించడం లేదు. టీడీపీ ఇమడలేక తమంత తాముగా వచ్చిన వారిని వైఎస్సార్‌ సీపీలో చేర్చుకుంటున్నారు. టీడీపీ ద్వారా పొందిన పదవులకు రాజీనామా చేసిన తర్వాత తమ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. రాజకీయాల్లో విలువలకు పట్టం కడుతున్న జగన్‌పై చంద్రబాబు, ఆయన బృందం విమర్శలు చేయడం విడ్డూరంగా ఉంది. టీడీపీకి దూరమయ్యే నాయకుల సంఖ్య నానాటికీ ఎక్కువవుతుండటంతో పచ్చ పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. (చంద్రన్న సమర్పించు... హస్తినలో ‘హంగామా’)

Advertisement
Advertisement