అభి'వంద'నం | Sakshi
Sakshi News home page

అభి'వంద'నం

Published Wed, May 23 2018 7:14 AM

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

నవ్యాంధ్ర నవశకం కోసం‘నవరత్నా’లే అస్త్రాలుగా..ప్రజా సంక్షేమమే లక్ష్యంగా.. ఉక్కు సంకల్పంతో వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన పాదయాత్ర జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. మంగళవారం 2,100 కిలోమీటర్ల మైలు రాయిని స్పృశించింది. జిల్లాలో వంద కిలోమీటర్లను పాదాక్రాంతంచేసుకుంది. ‘నారా’కాసుర పాలన అంతానికి సమరశంఖం పూరిస్తూ.. రాజన్న రాజ్యమే ధ్యేయంగా ముందుకు కదులుతున్న ప్రజాసంకల్పయాత్రకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు.. వందనం.. అభివందనం అంటూ బ్రహ్మరథం పడుతున్నారు. 

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి , ఏలూరు:  ఇలా ప్రతిఒక్కరూ జననేతకు సమస్యలు విన్నవిస్తున్నారు. పాదయాత్ర పొడవునా విజ్ఞాపనలు వినిపిస్తున్నారు. తమ కష్టాలు తీర్చే జననేస్తం వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డేనని నినదిస్తున్నారు. ఆయన వెన్నంటే ఉంటామని, ఆయన అధికారంలోకి వస్తే తమ కష్టాలు తీరినట్టేనని స్పష్టం చేస్తున్నారు.

వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర జిల్లాలో దిగ్విజయంగా సాగుతోంది. మంగళవారం తాడేపల్లిగూడెం మండలం పెంటపాడు నుంచి ప్రారంభమైన పాదయాత్ర ఉంగుటూరు నియోజకవర్గం పిప్పర వరకూ సాగింది. పెంటపాడు మండలం ముదునూరు వద్ద సరిహద్దు దాటి జననేత ఉంగుటూరు నియోజకవర్గంలోకి ప్రవేశించారు. దారిపొడవునా ప్రతి గ్రామంలో డ్వాక్రా మహిళలు, వృద్ధులు, రైతులు, ఉద్యోగులు, కార్మికులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి జననేత కోసం నిరీక్షించారు. ఆయనను కలిసి తమ సమస్యలు చెప్పుకునేందుకు తహతహలాడారు. ప్రతిఒక్కరూ జగనన్నను కలిసేందుకు పోటీ పడడంతో యాత్ర  ముందుకు సాగడం కష్టంగా మారింది. ఒక్కో కిలోమీటరు సాగడానికి గంటకుపైగానే సమయం పట్టింది.

తరలివచ్చిన పార్టీ శ్రేణులు
పాదయాత్రకు పార్టీ శ్రేణులు తరలివచ్చాయి. రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి, ఎమ్మెల్యే కోరుముట్ల శ్రీనివాసులు, పార్టీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆళ్ల నాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ కోటగిరి శ్రీధర్, నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్‌ వంకా రవీంద్ర, తాడేపల్లిగూడెం కన్వీనర్‌ కొట్టు సత్యనారాయణ, ఉంగుటూరు కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు, తణుకు కన్వీనర్‌ కారుమూరి నాగేశ్వరరావు, పోలవరం కన్వీనర్‌ తెల్లం బాలరాజు, గోపాలపురం కన్వీనర్‌ తలారి వెంకట్రావు, పాలకొల్లు కన్వీనర్‌ గుణ్ణం నాగబాబు, ఆచంట కన్వీనర్‌ కవురు శ్రీనివాస్,  పార్టీ సీనియర్‌ నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు, కారుమంచి రమేష్, కమ్మ శివరామకష్ణ, చెలికాని రాజబాబు,  నూకపెయ్యి సు«ధీర్‌బాబు, వందనపు సాయిబాలపద్మ, జగ్గవరపు జానకీరెడ్డి, దిరిశాల కృష్ణ శ్రీనివాస్, మామిళ్లపల్లి జయప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.

జననేతను కలిసిన తుందుర్రు వాసులు
పాదయాత్రలో తుందుర్రు వాసులు జననేతను కలిశారు. గోదావరి మెగా ఆక్వాఫుడ్‌ పార్క్‌కు వ్యతిరేకంగా చేస్తున్న ఉద్యమం గురించి ఆయనకు వివరించారు. అలాగే శ్రీకాకుళం నుంచి వచ్చిన ఆటో కార్మికులు జగనన్నను కలిసి సంఘీభావం తెలిపారు. ప్రతి ఆటో కార్మికునికి ఏడాదికి రూ.పదివేలు లబ్ధిచేకూరుస్తానని ఇప్పటికే జననేత హామీ ఇవ్వడంతో ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.  

యాత్ర సాగిందిలా..
మంగళవారం ప్రజాసంకల్ప యాత్ర తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు నుంచి ఉదయం 8.30 గంటలకు మొదలైంది. అడుగడుగునా జననేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ప్రజలు ఎదురు వచ్చి స్వాగతం పలికారు. రోడ్లకు ఇరువైపులా పెద్ద ఎత్తున మహిళలు నిలబడి ఆయనకు నీరాజనాలు పలికారు. హారతులిచ్చారు. దిష్టితీసి విజయీభవ అంటూ దీవించారు. యువత జగన్‌ను చూసేందుకు, మాట్లాడేందుకు పోటీపడ్డారు. ఫలితంగా దారులు జనసంద్రమయ్యాయి. ముదునూరు  శివార్లలో జగనన్న తలపాగా కట్టుకుని రైతులు, కూలీలతో కలిసి ధాన్యాన్ని తూర్పారబోశారు.  అనంతరం అక్కడి నుంచి పాదయాత్ర కాసిపాడు క్రాస్, చిలకంపాడు, వీరేశ్వరపురం క్రాస్‌ రోడ్డు మీదుగా ఉంగుటూరు నియోజకవర్గం గణపవరం మండలం పిప్పర చేరింది. అక్కడికి చేరుకోగానే పార్టీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్‌ పుప్పాల వాసుబాబు నేతృత్వంలో వందలాదిమంది కార్యకర్తలు ఎదురేగి జననేతకు ఘనస్వాగతం పలికారు. అనంతరం పిప్పిర పెట్రోల్‌ బంకు వద్ద ప్రజాసంకల్ప పాదయాత్ర 2,100 కిలోమీటర్ల మైలురాయికి చేరుకుంది. అక్కడ వై.ఎస్‌.జగన్‌ పార్టీ జెండా ఆవిష్కరించి, వేప మొక్క నాటారు. జిల్లాలోనూ యాత్ర వంద కిలోమీటర్ల మైలురాయిని దాటడం విశేషం.

నేడు గణపవరంలోబహిరంగసభ
ప్రజా సంకల్పయాత్రలోభాగంగా బుధవారం సాయంత్రం 3.30 గంటలకు గణపవరంలోబహిరంగ సభ జరగనుంది. ప్రజలనుద్దేశించి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రసంగిస్తారు. 

Advertisement
Advertisement