'సంకల్ప'మేవ జయతే | Sakshi
Sakshi News home page

'సంకల్ప'మేవ జయతే

Published Thu, May 17 2018 7:40 AM

People Support To Ys Jagan In Praja sankalpa yatra - Sakshi

నిజాన్నే నమ్మిన నికార్సయిన నేత.. అబద్ధపు హామీలు ఇవ్వలేనని తెగేసి చెప్పిననిష్కల్మషశీలి.. వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర బుధవారం దెందులూరు నియోజకవర్గంలో ఉత్సాహంగా సాగింది.పాలకుల అబద్ధపు హామీలు నమ్మి మోసపోయిన పేదల కష్టాలు తెలుసుకుంటూ వారి కన్నీళ్లు తుడుస్తూ.. మండుటెండలోనూ మహాసంకల్పంతో జననేత ముందుకు కదులుతున్నారు. అంతఃకరణశుద్ధితో తమ మధ్యకు వచ్చిన మాట తప్పని నేతకు ప్రజలు జేజేలు పలుకుతున్నారు. టీడీపీ నేతల బెదిరింపులు లెక్కచేయక  ‘ప్రజా సంకల్పం’ఫలించాలని దీవిస్తున్నారు. సంకల్పమేవ జయతే అంటూ నినదిస్తున్నారు.  

సాక్షి ప్రతినిధి, పశ్చిమగోదావరి ,ఏలూరు :గృహిణులు, యువత, విద్యార్థులు, రైతులు, ఆటో డ్రైవర్లు, ప్రజా, కార్మిక సంఘాలు ఇలా ఒక్కరేమిటీ అన్ని వర్గాల ప్రజలతో మమేకమవుతూ.. ముందుకు కదులుతున్నారు జననేత, వైఎస్సార్‌ సీపీ అధినేత వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి. ఆయన చేపట్టిన ప్రజా సంకల్ప పాదయాత్ర నాలుగోరోజు  బుధవారం జిల్లాలో ఉత్సాహంగా సాగింది. టీడీపీ అరాచక పాలనపై ధ్వజమెత్తుతూ.. దగా పడిన ప్రజల కష్టనష్టాలు వింటూ.. వారికి భరోసా ఇస్తూ.. జననేత వడివడిగా అడుగులేస్తున్నారు. ప్రజలూ ఆయనతో మాట్లాడేందుకు, తమ సమస్యలు చెప్పుకునేందుకు పోటీ పడుతున్నారు. యువత ఆయనతో కరచాలనం కోసం.. సెల్ఫీ కోసం ఉవ్విళ్లూరుతున్నారు. మాట తప్పని, మడమ తిప్పని నేతకు జయజయధ్వానాలు పలుకుతున్నారు. సంకల్ప మేవ జయతే అంటూ నినదిస్తున్నారు.

టీడీపీ బెదిరింపులను లెక్కచేయకుండా
టీడీపీ నేతల బెదిరింపులను లెక్కచేయకుండా ప్రజలు ప్రజా సంకల్పయాత్రలో భాగస్వాములవుతున్నారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి సమస్యలు విన్నవిస్తున్నారు. జగనన్న వెంటే నడుస్తామని ఘంటాపథంగా చెబుతున్నారు. జగన్‌ పాదయాత్రకు వెళ్తే రేషన్‌ కార్డులు కట్‌ చేస్తామని, పింఛన్లు, ఇతర పథకాలు అందవని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ బెదిరింపులకు దిగినా.. ప్రజలు లెక్క చేయలేదు. దెందులూరు మండలంలో పాదయాత్రకు గ్రామాల్లో అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మహిళలు జగనన్నకు హారతులు పట్టారు. దీనికోసం అక్కాచెల్లెళ్లు ఉదయం నుంచే రోడ్లపై బారులు తీరారు.

ఒక్కోగ్రామంలో గంటపైనే..!
దెందులూరు టీడీపీ కంచుకోటగా భావిస్తున్న నియోజకవర్గం.. ఈ నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్ర ఒక్కోగ్రామం దాటేందుకు గంటకుపైగానే సమయం పట్టింది. రోడ్లకు ఇరువైపులా ప్రజలు బారులు తీరి తమ భవిష్యత్తు నేతను జగన్‌లో చూసుకుంటూ.. ఆయనకు అపూర్వ స్వాగతం పలికారు. ఆయనకు కష్టాలు చెప్పుకున్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే తమ కష్టాలు తీరిపోతాయని నమ్మకం వ్యక్తం చేశారు. జగనన్న భరోసాతో సంతోషంతో ఉప్పొంగిపోయారు. 

చింతమనేనిపై ఫిర్యాదుల వెల్లువ
జగనన్న పాదయాత్రలో అడుగడుగునా  ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ దౌర్జన్యాలు, దాష్టికాలు, అన్యాయాలు, వేధింపులపై బాధితులు జగన్‌ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. జననేత వారి కన్నీళ్లు తుడిచి ధైర్యం చెప్పారు. తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

యాత్ర సాగిందిలా..   
ప్రజాసంకల్ప పాదయాత్ర 163వ రోజు బుధవారం ఉదయం 8.40గంటలకు దెందులూరు మండలం జోగన్నపాలెం అడ్డరోడ్డు వద్ద ప్రారంభమైంది. అప్పారావు పాలెం అడ్డరోడ్డు, కొత్తగూడెం అడ్డరోడ్డు, శ్రీరామవరం, బైగానిపేట, చల్లచింతలపూడి మీదుగా సాగి పెరుగ్గూడెం వద్ద సాయంత్రం 6.20గంటలకు ముగిసింది. 163వ రోజు ప్రజాసంకల్ప పాదయాత్ర 13.10 కిలోమీటర్ల మేర కొనసాగింది. దారిపొడవునా ప్రజలతో రోడ్లన్నీ కిక్కిరిశాయి. పెరుగ్గూడెంలో అశేష జనవాహిని మధ్య వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ పాదయాత్రలో ఏలూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు,  ఎమ్మెల్సీ ఆళ్లనాని, నరసాపురం పార్లమెంటరీ జిల్లా అ«ధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు,  దెందులూరు కన్వీనర్‌ కొఠారు అబ్బయ్య చౌదరి, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు, ఆచంట, పాలకొల్లు కన్వీనర్లు కవురు శ్రీనివాస్, గుణ్ణం నాగబాబు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement