రోడ్డుపై కోమటిరెడ్డి ధర్నా | Sakshi
Sakshi News home page

రోడ్డుపై కోమటిరెడ్డి ధర్నా

Published Sun, Oct 29 2017 2:40 AM

Komatireddy Dharna on the road

నల్లగొండ టౌన్‌: తేమ శాతంతో సంబంధం లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి శనివారం నల్లగొండ వ్యవసాయ మార్కెట్‌ యార్డు ఎదుట రోడ్డుపైనే ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు మాయమాటలతో రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు.

అకాల వర్షాల కారణంగా పత్తి, వరి పంటలు దెబ్బతిని రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై అసెంబ్లీలో చర్చించడానికి కాంగ్రెస్‌ పార్టీకి అవకాశం కల్పించడం లేదన్నారు. ఉద్యోగులు, ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలను పెంచడంపై ఉన్న శ్రద్ధ రైతుల సమస్యలపై కేసీఆర్‌కు లేదన్నారు. రైతులు ఏం పాపం చేశారని మద్దతు ధర చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు.

ధాన్యం కొనుగోలు చేసేంత వరకు ఆందోళన విరమించేది లేదని రోడ్డుపై బైఠాయించారు. పెద్ద ఎత్తున పోలీసులు మోహరించి ఒక దశలో అరెస్టు చేసే ప్రయత్నం చేయగా తనను అదుపులోకి తీసుకుంటే రాష్ట్రం భగ్గుమంటుందని హెచ్చరించటంతో వారు వెనకడుగు వేశారు.

సమాచారం అందుకున్న, డీఎస్‌ఓ రాజేందర్, నల్లగొండ ఆర్డీఓ వెంకటాచారి, ఎమ్మార్వో వినయ్‌కుమార్‌లు అక్కడికి చేరుకుని కోమటిరెడ్డికి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. చివరకు జాయింట్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి చేరుకుని తేమతో సంబంధం లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి కాంటాలను వేయించడంతో ఆయన ధర్నా విరమించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement