బాబు, లోకేశ్‌ల అవినీతి రూ.3 లక్షల కోట్లు! | Sakshi
Sakshi News home page

బాబు, లోకేశ్‌ల అవినీతి రూ.3 లక్షల కోట్లు!

Published Tue, Jun 26 2018 2:47 AM

CM Chandrababu and Lokesh corruption is Rs 3 lakh crore - Sakshi

సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అవినీతి ఈ నాలుగేళ్ల పాలనలో రూ.3 లక్షల కోట్లకు చేరిందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ వి.విజయసాయిరెడ్డి ఆరోపించారు. ప్రజాధనాన్ని దోచుకొని విదేశాల్లో దాచుకున్నా తండ్రీకొడుకుల అసంతృప్తి తీరట్లేదని, 24 గంటలూ పనిచేస్తున్నామని వారు చెప్పుకునేది అవినీతిలో సంతృప్తి కోసమే తప్ప ప్రజాసంక్షేమం కోసం కాదన్నారు. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు జిల్లాల వారీగా బూత్‌ స్థాయి కమిటీలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సోమవారం శ్రీకాకుళం 80 ఫీట్‌ రోడ్డులోని ఆనందమయి కన్వెన్షన్‌ హాల్‌లో జరిగిన శ్రీకాకుళం పార్లమెంటరీ జిల్లా పరిధిలోని బూత్‌ కమిటీల సమీక్ష సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు మీడియాతో మాట్లాడారు. 

సాగునీటి ప్రాజెక్టులపై అలసత్వం...
శ్రీకాకుళం జిల్లా మెట్ట భూములన్నింటికీ రెండు పంటలకు పుష్కలంగా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డా.వైఎస్‌ రాజశేఖరరెడ్డి వంశధార రెండో దశ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారని గుర్తు చేశారు. వైఎస్సార్‌ ఆకస్మిక మరణంతో పనులు నిలిచిపోయాయన్నారు. ఆ ప్రాజెక్టును 2018 జనవరి నాటికల్లా పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు... అధికారంలోకి వచ్చి నాలుగేళ్లయినా పూర్తి చేయలేకపోయారని మండిపడ్డారు. అంచనా వ్యయం పెంచేసి కమీషన్లు దండుకోవడానికి మొగ్గుచూపడం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. వైఎస్సార్‌ హయాంలో రూ.7 వేల కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టునూ చంద్రబాబు పూర్తిగా నిర్లక్ష్యం చేశారని విమర్శించారు.   

బీసీలంటే బాబుకు చిన్నచూపు...
బీసీలంటే బాబుకు ఎప్పుడూ చిన్నచూపేనని విజయసాయిరెడ్డి విమర్శించారు. న్యాయం చేయాలని అడగడానికి వెళ్లిన నాయీ బ్రాహ్మణులను తోక కత్తరిస్తానని, హామీలు నెరవేర్చాలని అడిగితే తోలు తీస్తానని బెదిరించారంటే బీసీల పట్ల ఆయనకున్న చిత్తశుద్ధి ఏమిటో అర్థం చేసుకోవచ్చన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, సాగి దుర్గాప్రసాదరాజు, ధర్మాన కృష్ణదాస్, రెడ్డి శాంతి, దువ్వాడ శ్రీనివాస్, పేరాడ తిలక్, సీదిరి అప్పలరాజు, పిరియా సాయిరాజ్‌ పాల్గొన్నారు.

మేము వానరసేనే.. త్వరలోనే రాష్ట్రంలో రామరాజ్యం
ట్విట్టర్‌లో ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి: రాక్షసుడైన చంద్రబాబు తమను వానర సేనగా పిలవడాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నామని ఎంపీ వి.విజయసాయిరెడ్డి సోమవారం ట్వీట్‌ చేశారు. రాష్ట్రంలో త్వరలోనే రామరాజ్యం వస్తుందన్నారు. అసురుడైన చంద్రబాబు నేతృత్వంలోని పచ్చ గ్యాంగ్‌ నదులను కూడా వదలకుండా దోచుకుంటోందని, ఇసుకనూ భక్షిస్తోందని మండిపడ్డారు. ప్రజాగ్రహ ఉప్పెనలో ఈ ఇసుకమాఫియా బంగాళాఖాతంలోకి కొట్టుకుపోయే రోజు మరెంతో దూరంలో లేదన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని రాక్షసమూక ఏపీలో న్యాయాన్ని, ధర్మాన్ని చంపేసిందన్నారు. బాబు నిర్వహిస్తున్న సమీక్షా సమావేశాలన్నీ డ్రామాలేనని,   లెక్కలన్నీ వండి వార్చి, అభూత కల్పనలు ప్రదర్శిస్తున్నారన్నారు. రాష్ట్రంలో మెజారిటీ ప్రజలు ఇబ్బందులతో సతమతమవుతున్నారని పేర్కొన్నారు. ప్రజలను లూటీ చేస్తూ, మోసం చేస్తూ ఒక్క చంద్రబాబు కుటుంబీకులే ఆనందంలో మునిగి తేలుతున్నారని విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement