ఘోర తప్పిదం | Sakshi
Sakshi News home page

నీతి ఆయోగ్‌ సమావేశానికి ముఖ్యమంత్రి డుమ్మా

Published Mon, Jun 18 2018 12:33 PM

The Chief Minister Did Not aAttend The Niyati Ayog Program - Sakshi

భువనేశ్వర్‌ : భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన నీతి ఆయోగ్‌ సమావేశానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ డుమ్మా కొట్టారు. ఈ చర్యపట్ల రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు రాష్ట్ర ప్రభుత్వం పై విరుచుకుపడ్డాయి. రాష్ట్రాల బాగోగుల పర్యవేక్షణకు సమయానుకూలంగా నీతి ఆయోగ్‌ సమావేశం నిర్వహిస్తారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఈ సమావేశం జరుగుతుంది.

రాష్ట్రాల అవసరాలు, స్వార్థ ప్రయోజనాల పరిరక్షణ వంటి కార్యాచరణ ఈ సమావేశంలో భారత ప్రధాన మంత్రి సమక్షంలో లోతుగా చర్చించిన మేరకు నీతి ఆయోగ్‌ భావి కార్యాచరణ ఖరారు చేస్తుంది. ఇటువంటి కీలక సమావేశానికి రాష్ట్ర ముఖ్య మంత్రి డుమ్మా కొట్టి రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్షంగా చర్చించేందుకు కల్పించిన అవకాశాన్ని చేజార్చుకోవడం అత్యంత విచారకరంగా ప్రతిపక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.

రాష్ట్రం, ప్రజల స్వార్థ ప్రయోజనాల కంటే ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌కు పార్టీ స్వార్థ ప్రయోజనాలే అధికంగా మారాయని కేంద్ర దళిత వ్యవహారాల శాఖ మంత్రి జుయెల్‌ ఓరాం వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశానికి గైర్హాజరు కావడం రాజ్యాంగబద్ధమైన బాధ్యతల్ని విస్మరించినట్లేనని దుయ్యబట్టారు. 

రాష్ట్రాల సమగ్ర అభివృద్ధితో దేశ అభివృద్ధి ముడిపడి ఉంది. ఈ పంథాని పటిష్టంగా అనుసరించాలని తరచూ ప్రకటనలు జారీ చేసే ముఖ్యమంత్రి నీతి ఆయోగ్‌ సమావేశానికి డుమ్మా కొట్టడం చెప్పింది ఒకటి, చేస్తున్నది ఒకటిగా తేలిపోయిందని భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిథి గోలక్‌ మహాపాత్రో ఆరోపించారు. 

నీతి అయోగ్‌ విలువ తెలియనిది కాదు: పీసీసీ చీఫ్‌

కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న నీతి ఆయోగ్‌ సమావేశం ప్రాధాన్యత, ప్రాముఖ్యత తెలియనిది కాదు. లోగడ ప్రణాళిక సంఘం పేరుతో ఈ కార్యక్రమం కొనసాగేది. రాష్ట్రాల అవసరాల దృష్ట్యా సమగ్ర కార్యాచరణ ఖరారు చేయడం ఈ సమావేశం ధ్యేయం కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ గైర్హాజరు కావడం అత్యంత విచారకరంగా రాష్ట్ర ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు నిరంజన్‌ పట్నాయక్‌ ఆరోపించారు.

నీతి ఆయోగ్‌ దృష్టికి రాష్ట్ర అవసరాల్ని ప్రత్యక్షంగా తీసుకుపోయేందుకు అనుకూలమైన సదవకాశాన్ని ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ చేజార్చుకున్నారు. రాష్ట్ర అభ్యర్థనలు ప్రవేశపెట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వ వాస్తవ కార్యాచరణ తేలిపోయి ఉండేదని తెలిపారు. 

ముందస్తు కార్యక్రమాలతో వీలు కాలేదు: బీజేడీ

ముందస్తు నిర్ధారిత కార్యక్రమాల హడావుడితో రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌ నీతి ఆయోగ్‌ సమావేశానికి హాజరు కాలేకపోయారని అధికార పక్షం బిజూ జనతా దళ్‌ అధికార ప్రతినిథి, పార్లమెంటు సభ్యుడు ప్రతాప్‌ కేశరి దేవ్‌ సర్ది చెప్పారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన జారీ చేశారు.

ఈ సమావేశానికి హాజరు కావడం రాజ్యాంగబద్ధం కాదని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ముందస్తు నిర్ధారిత కార్యక్రమాలకు సంబంధించి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి నవీన్‌ పట్నాయక్‌ తెలియజేశారు. సమావేశానికి సంబంధించి రాష్ట్ర విన్నపాల్ని భారత ప్రధాన మంత్రికి వివరించారని తెలిపారు.   

Advertisement
Advertisement