రైతా..రాజా.. | Sakshi
Sakshi News home page

రైతా..రాజా..

Published Fri, Mar 22 2019 12:32 PM

Bobbili Constituency Review in Andhra Pradesh Election - Sakshi

పౌరుషాల పోరుగడ్డగా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న  బొబ్బిలి అసెంబ్లీ నియోజకవర్గం ఈ సారి బొబ్బిలిరాజుల చేజారిపోయేలా ఉంది.  విజయనగరం జిల్లాలో తామేం చేసినా చెల్లుతుందని స్వయంకృతాపరాధాలెన్నో చేసుకున్న బొబ్బిలి రాజులు ఈ ఎన్నికల్లో ఓటమి చవిచూసేలా ఉన్నారు. ఇక్కడ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్ధి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు ప్రజల్లో తనకున్న మంచిపేరును, రాజులపై ఉన్న వ్యతిరేకతను కూడగట్టుకుని గెలుపుదిశగా దూసుకువెళుతున్నారు.

వైఎస్‌కు అండగా..
బొబ్బిలి నియోజకవర్గం వైఎస్‌ కుటుంబానికి ఆది నుండీ అండగా నిలిచింది. నియోజకవర్గం పునర్వ్యస్థీకరించిన తరువాత అంతకు ముందు కూడా వైఎస్‌ కుటుంబానికి ఈ ప్రాంత ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి దివంగత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి బొబ్బిలి రాజులకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చారు. అప్పట్లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి బొబ్బిలిలో పర్యటించి అనేక సంక్షేమ కార్యక్రమాలకు ఊతమిచ్చారు. 2004లో ప్రస్తుత మంత్రి సుజయకృష్ణ రంగారావుకు వైఎస్‌ నాయకత్వంలో 24వేల ఓట్లతో గెలుపొందారు. ఆ తరువాత కూడా మహానేత అండతో సుజయ్‌ గెలుపొందారు. ఆ తరువాత మూడు ప్రధాన పార్టీల మహా సంగ్రామంలోనూ రాష్ట్రంలోనూ, బొబ్బిలిలోనూ మహానేత నిలబెట్టిన అభ్యర్థే గెలుపొందారు. 2014లో ఎన్నికల బరిలో వైఎస్సార్‌సీపీ  బొబ్బిలి అభ్యర్థిగా బరిలో దిగిన సుజయకృష్ణ రంగారావుకు  విజయం సాధించారు.

సుజయకు వ్యతిరేక పవనాలు
నియోజకవర్గంలో మూడు సార్లు వైఎస్సార్‌ కుటుంబం నిలబెట్టిన అభ్యర్థులే గెలుపొందారు. టీడీపీకి బొబ్బిలిలో పోటా పోటీ ఉన్నా ఓటింగ్‌ వచ్చే సరికి మాత్రం ఓటమి తప్పడం లేదు. రాజకీయ జీవితాన్ని ప్రసాదించిన వైఎస్‌ కుటుంబాన్ని స్థానిక మంత్రి సుజయ్‌  పదవి కోసం వంచించి అధికార పార్టీ పంచన చేరిపోయారు. దీంతో ఆయనను  ప్రజలు చీదరించుకుంటున్నారు. ప్రజలను పట్టించుకోని ఈ రాజును ఎందుకు గెలిపించాలని పలువురు ప్రశ్నిస్తున్నారు.

‘శంబంగి’వైపే జనం
రైతుబిడ్డ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి శంబంగి వెంకట చిన అప్పలనాయుడు మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది ప్రజల మన్నన పొందారు. నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషిచేయడం నాయుడుకు కలిసొచ్చే అంశం.  వైఎస్‌ కుటుంబానికి అండగా నిలిచే ప్రజలు ఈ సారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థికే మద్దతు తెలిపే అవకాశముంది.  

ఇంతవరకు ఇలా...
1952లో ఏర్పడ్డ బొబ్బిలి అసెంబ్లీ స్థానం 2007–08లో పునర్వ్యవస్థీకరణ జరిగింది. తెర్లాం నియోజకవర్గంలోని తెర్లాం, బాడంగి మండలాలు, సాలూరు నియోజకవర్గంలోని రామభద్రపురం మండలంతో పాటు బొబ్బిలి మున్సిపాలిటీ, రూరల్‌ మండలాలతో బొబ్బిలి నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటి వరకు జరిగిన 14 ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు ఏడుసార్లు, టీడీపీ 3, ఇతరులు 2, ఇండిపెండెంట్‌ ఒకసారి విజయం సాధించగా 2014లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి గెలుపొందారు.

నియోజకవర్గం : బొబ్బిలి
మొత్తం 2,09,058
పురుషులు 1,04,028
మహిళలు  1,05,018

Advertisement
Advertisement