కేటీఆర్, చంద్రబాబు మధ్యలో లగడపాటి | Sakshi
Sakshi News home page

కేటీఆర్, చంద్రబాబు మధ్యలో లగడపాటి

Published Mon, Dec 17 2018 3:07 AM

Ambati Rambabu comments on Chandrababu and TRS - Sakshi

విజయవాడ సిటీ: ముఖ్యమంత్రి చంద్రబాబువి పచ్చి అవకాశవాద రాజకీయాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. చంద్రబాబు పతనం హైదరాబాద్‌ నుంచి ప్రారంభమైందన్నారు. విజయవాడలోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌తో పొత్తుకు వెంపర్లాడింది చంద్రబాబు కాదా? అని ప్రశ్నించారు. ‘మా పుట్టలో వేలుపెడితే...మీ పుట్టలో కాలుపెడతామని’ కేటీఆర్‌ అంటే దానిని తమకు ఆపాదిస్తారా? అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను అమరావతి శంకుస్థాపనకు పిలిచింది మీరు కాదా, మిమ్మల్ని పిలవకపోయినా కేసీఆర్‌ చేసిన యాగానికి ఎగేసుకొని వెళ్లింది నిజం కాదా అని అంబటి నిలదీశారు. కేటీఆర్‌కు, చంద్రబాబుకు మధ్య లగడపాటి రాజగోపాల్‌ బ్రోకర్‌ పనిచేశారని అన్నారు. ఎన్టీఆర్‌ తనయుడు హరికృష్ణ భౌతికకాయం వద్దే టీఆర్‌ఎస్‌ నేత కేటీఆర్‌తో చంద్రబాబు పొత్తుల గురించి మాట్లాడారని, టీఆర్‌ఎస్‌ ఛీ.. పో.. అన్న తర్వాతే ఆయన కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్నారని గుర్తుచేశారు.

కన్నీటికి కారణమైన కాంగ్రెస్‌తో పొత్తా?
ఆంధ్ర రాష్ట్ర ప్రజల కన్నీరుకు కారణమైన పార్టీ కాంగ్రెస్‌ అని, అలాంటి కాంగ్రెస్‌తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారని అంబటి మండిపడ్డారు. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయానికి తానే కారణమని చంద్రబాబు చెబున్నారని, మరి ఏ ఒక్క కాంగ్రెస్‌ నేత కూడా చంద్రబాబు వల్లే తాము గెలిచామని ఎందుకు చెప్పడంలేదన్నారు. చంద్రబాబు దోచుకున్న సొమ్ముతో కాంగ్రెస్‌ పార్టీకి పెట్టుబడి పెట్టారన్నారు. తెలంగాణ ఎన్నికలకు ముందు అశోక్‌ గెహ్లోత్‌ డబ్బు గురించే అమరావతికి వచ్చారనే విషయం నిజం కాదా అని ప్రశ్నించారు. అడ్డగోలుగా దోచుకున్న అవినీతి డబ్బుతో మళ్లీ ఎన్నికల్లో గెలవాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. 

ఎల్లో మీడియాకే బాబు గొప్ప..
ఎల్లో మీడియాకు మాత్రమే చంద్రబాబు గొప్పగా కనిపిస్తున్నారని, నాలుగున్నరేళ్ల పాలనలో ప్రజలకు ఏమీ చేయకపోయినా, ప్రత్యేక హోదా వద్దని చంద్రబాబు అన్నా ఆయనకు అనుకూలంగానే కథనాలు రాసిందని అంబటి అన్నారు. ఆపరేషన్‌ గరుడ సృష్టికర్త్త చంద్రబాబేనని చెప్పారు. ఎన్నికల చివరి నిమిషంలో తెలంగాణ ప్రజల మనసులు మార్చడానికి లగడపాటి రాజగోపాల్‌ని చంద్రబాబు ప్రయోగించారన్నారు. నటుడు శివాజీ, లగడపాటి ఇద్దరూ చంద్రబాబు ప్రయోగించిన అస్త్రాలేనని చెప్పారు. ఇప్పటికే శివాజీ అమెరికా పారిపోయాడని, అలాగే దివాలా తీసిన రాజగోపాల్, దోచుకున్న సొమ్ముతో సీఎం రమేష్, సుజనా చౌదరి కూడా దేశం విడిచి పారిపోతారని అన్నారు.  

Advertisement
Advertisement