సురక్షితమైన చేతుల్లో దేశం  | Sakshi
Sakshi News home page

సురక్షితమైన చేతుల్లో దేశం 

Published Wed, Feb 27 2019 4:23 AM

Prime Minister Narendra Modi has said that India is in safe hands - Sakshi

న్యూఢిల్లీ: భారత దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశం కన్నా ఏదీ ముఖ్యమైనది కాదని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతిని ఓడిపోనీయమని హామీ ఇచ్చారు. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిక్షణ కేంద్రాలపై వైమానిక దాడుల తరువాత రాజస్తాన్‌లోని చురులో జరిగిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘అమర జవాన్లకు నిజమైన నివాళులర్పించే రోజొచ్చింది. దేశం సురక్షితమైన చేతుల్లో ఉందని ప్రజలకు హామీ ఇస్తున్నా. 2014లో చెప్పిన మాటల్నే మరోసారి చెప్పమని నా ఆత్మ కోరుతోంది. నా దేశాన్ని ఎవరూ నాశనం చేయలేరని, దేశం ఇతరుల ముందు తలవంచుకోదని, జాతికి తలవంపులు రాకుండా చూస్తానని నా మాతృభూమికి మాట ఇస్తున్నా.

దేశం కన్నా మిన్న ఏదీ లేదు. దేశానికి సేవ చేస్తున్న, జాతి నిర్మాణంలో పాలుపంచుకుంటున్న ప్రతీ ఒక్కరికి ఈ ప్రధాన సేవకుడి ప్రణామాలు’అని మోదీ అన్నారు. వ్యక్తి కన్నా పార్టీ గొప్పదని, పార్టీ కన్నా దేశం గొప్పదని ఉద్ఘాటించారు. ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్‌’స్ఫూర్తితో ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రాజస్తాన్‌లోని చురు, సికర్, ఝున్‌ఝును లాంటి ప్రాంతాలకు చెందిన సైనికులు సరిహద్దుల్లో విశేష సేవలందిస్తున్నారని కొనియాడారు. దుష్టశక్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు దైవశక్తి తమవైపే ఉందని మోదీ అన్నారు. ‘మానవాళికి శత్రువులుగా పరిణమించే వారిని ఎదుర్కొనేందుకు దైవశక్తి మనవైపే ఉంది. దుష్టశక్తులు, దుర్మార్గులకు నేనిచ్చే సందేశం ఇదే. విద్యార్థికి అయినా, దేశాధినేతకు అయినా భగవద్గీతలో అన్ని సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయి’అని ఢిల్లీలో ఇస్కాన్‌ నిర్వహించిన కార్యక్రమంలో మోదీ అన్నారు.  

మోదీ రాత్రంతా నిద్రపోకుండా.. 
న్యూఢిల్లీ:  జైషే శిబిరాలపై వైమానిక దళ దాడుల్ని పర్యవేక్షిస్తూ ప్రధాని మోదీ సోమవారం రాత్రంతా మేల్కొనే ఉన్నట్లు తెలిసింది. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న విమానాలు, పైలట్లు సురక్షితంగా భారత్‌ చేరుకున్నాకే ఆయన రిలాక్స్‌ అయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మిషన్‌ను విజయవంతంగా ముగించుకుని వచ్చిన సిబ్బందిని వేకువజాము 4.30 గంటలకు అభినందించిన మోదీ ఆ తరువాత తన రోజూవారీ కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు.  భోజనం చేసిన తరువాత వైమానిక దళ ఆపరేషన్‌ దాడి వ్యూహాల్ని పరిశీలించి, ఆపరేషన్‌ను పర్యవేక్షించారు. అయితే ఆ సమయంలో మోదీ ఇంట్లోనే ఉన్నారా? లేదా మరో ప్రదేశంలో ఉండి కంట్రోల్‌ రూం ద్వారా మిషన్‌ను పర్యవేక్షించారా? అన్నది తెలియరాలేదు.  

Advertisement
Advertisement