‘మా’పై నిప్పులు చెరిగిన మంచు విష్ణు

Manchu Vishnu Fires on MAA Over Sri Reddy Issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : శ్రీ రెడ్డి వ్యవహారంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనుసరించిన వ్యవహార శైలిపై హీరో మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీ రెడ్డిపై ఏ హక్కుతో ఆంక్షలు ఎందుకు విధించారని? తిరిగి ఎందుకు ఎత్తేశారని? ఆయన మా ను నిలదీశారు.  ఈ మేరకు మా అధ్యక్షుడికి నేరుగా ఆయన ఓ లేఖ రాశారు. 

‘మా’ను భ్రష్టు పట్టించకండి...
‘మా లో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలు గందరగోళంగా ఉన్నాయి. సభ్యత్వం లేని ఆమె(శ్రీ రెడ్డిని ఉద్దేశించి...) చేసిన ఆరోపణల ఆధారంగా హడావుడిగా సమావేశం నిర్వహించి.. 900 సభ్యుల్లో ఏ ఒక్కరూ కూడా ఆమెతో నటించకూడదని మా ఆదేశాలు జారీ చేసింది. అయితే ఆ 900 మంది సభ్యుల్లో మా నాన్న గారు, నా తమ్ముడు, నా సోదరి మరియు నేను కూడా ఉన్నాం. అంటే మమల్ని కూడా కలిపే చెప్పారా? ఎవరిని అడిగి ఆ ఆదేశాలు ఇచ్చారు. మళ్లీ ఏదో పొడుచుకొచ్చినట్లు మీటింగ్‌ పెట్టి ఆ నిషేధం ఎత్తేశారు. ఈ నిర్ణయాలన్నీ మా పై వ్యతిరేకత పెరిగిపోవటానికి కారణాలు అవుతున్నాయి. మీ చేష్టలతో  ప్రజల్లో, మీడియాలో ‘మా’ చులకన అయిపోతోంది. దయచేసి మీ అనాలోచిత నిర్ణయాలతో మా ను భ్రష్టు పట్టించకండి’ అంటూ లేఖలో విష్ణు విమర్శలు సంధించారు.

మార్గదర్శకాలేవీ?
అసలు నటీనటులకు సరైన మార్గదర్శకాలేవీ? అని ‘మా’ను మంచు విష్ణు సూటిగా ప్రశ్నించారు. తక్షణమే మార్గదర్శకాలను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. సినీ పరిశ్రమకు చెందిన 24 క్రాఫ్ట్‌లకు కూడా ఆ మార్గదర్శకాలను అన్వయించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం మా లో సభ్యత్వం లేని చాలా మంది స్థానిక నటులు ఉన్నారని.. వారందరితో నటించేందుకు తనను అనుమతిస్తారా? అంటూ విష్ణు నిలదీశారు. కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు టాలీవుడ్‌ పరువు తీసేస్తోందన్న విష్ణు..  గ్రీవియన్స్‌(అత్యవసర) సెల్‌ ఏర్పాటు బాధ్యతను మా కాకుండా ఫిల్మ్‌ ఛాంబర్‌ తీసుకోవాలని కోరారు. ఈ లేఖపై ‘మా’ ఎలా స్పందిస్తుందో చూడాలి.

                                   మంచు విష్ణు రాసిన లేఖ

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top