మంచు కొండల్ని తరలిస్తారట..! | Sakshi
Sakshi News home page

Published Mon, Jul 2 2018 10:21 PM

UAE To Town Antarctic Icebergs To Its Coasts For Drinking Water - Sakshi

సుదూర ప్రాంతాల్లోని మంచు కొండలు తరలించి మంచినీటి సమస్యను అధిగమిస్తానంటోంది యునైటెడ్‌ అరబ్‌ ఎమిరైట్స్‌ (యూఏఈ). దాదాపు 5–12 కోట్ల డాలర్ల అంచనా వ్యయం కాగల ఈ ప్రతిష్టాకర ప్రాజెక్టు గురించి ఇటీవల యూఏఈ నేషనల్‌ అడ్వయిజర్‌ బ్యూరో లిమిటెడ్‌ సంస్థ  వెల్లడించింది. దీనిలో భాగంగా అంటార్కిటా ఖండం  నుంచి మంచుకొండలను యూఏఈ తీరప్రాంతాలకు తరలిస్తారు.

ఆ తర్వాత వాటిని కరిగించడం ద్వారా తమ దేశవాసులకు  శుద్ధిచేసిన మంచినీటిని తక్కువ ఖర్చుతోనే అందుబాటులోకి తీసుకురావాలన్నది ఈ భారీ ప్రాజెక్టు లక్ష్యం. యూఏఈ–ఐస్‌బర్గ్‌ ప్రాజెక్టు, దానికి సంబంధించిన వెబ్‌సైట్‌ ప్రారంభం సందర్భంగా మంచుపర్వతాలను తమ ఫుజైరాయ్‌ తీరప్రాంతానికి తరలించే ప్రణాళికలు ప్రకటించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఈ ప్రాజెక్టును పూర్తిచేయనున్నట్టు ఆ సంస్థ వెల్లడించింది.

మంచు పర్వతాల తరలింపు కోసం, వాటిని  తరలిస్తున్నపుడు  కరిగిపోకుండా ఉండే సాంకేతిక పరిజ్ఞానంపై పేటెంట్‌ హక్కుల కోసం బ్రిటన్‌లో దరఖాస్తు చేసుకున్నట్టు ఆ సంస్థ ఎండీ అబ్దుల్లా మహ్మద్‌ సులేమాన్‌ అల్‌ షాహి తెలిపారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రయోగాత్మకంగా దీనిని మొదలుపెడతారు. ముందుగా అంటార్కిటా నుంచి ఆస్ట్రేలియా లేదా  దక్షిణాఫ్రికా తీరప్రాంతం వైపు మంచుకొండల తరలింపు చేపడతారు. 2020 సంవత్సరం ప్రారంభంలో వీటిని యూఏఈకి చేర్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. 

తరలింపు ఇలా...
సెటిలైట్‌ ఇమేజింగ్‌ ద్వారా మంచుకొండలు ఎంపిక చేస్తారు. అంటార్కిటికా నుంచి విడిపోయి సముద్రంలో తేలియాడుతూ వెళ్లే మంచు కొండలను లక్ష్యంగా చేసుకుంటారు. పదికోట్ల టన్నుల బరువున్న మంచు దిమ్మెలను లాక్కురాగలిగే హైకెపాసిటీ టో–బోట్లు ఉపయోగిస్తారు. సముద్ర అలలు ఈ మంచుకొండలు ఉత్తరదిశలో సాగేలా సహకరిస్తే టో బోట్లు వాటి దిశాగమనానికి దోహదపడతాయి.

ఒక్కో మంచుకొండ యూఏఈకి చేరేందుకు దాదాపు 9 నెలలు పట్టొచ్చని అంచనా. ఫుజైరాయ్‌ తీరానికి చేరాక  చిన్నచిన్న ముక్కలుగా. ఆ తర్వాత మంచినీరుగా మారుస్తారు. అనంతరం ఆ నీటిని పెద్ద పెద్ద ట్యాంకుల్లో భద్రపరుస్తారు. ఈ క్రమంలో మంచుకొండలున్న ప్రాంతాన్ని పర్యాటక ప్రదేశంగా కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తారు. 
 

Advertisement
Advertisement