'ముస్లింలు ఆటవికంగా మారుతున్నారు' | Sakshi
Sakshi News home page

'ముస్లింలు ఆటవికంగా మారుతున్నారు'

Published Sun, Nov 29 2015 11:09 AM

'ముస్లింలు ఆటవికంగా మారుతున్నారు' - Sakshi

మియామి: ప్రపంచంలోని ముస్లింలు అందరూ ఆటవికులుగా మారుతున్నారంటూ అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడుతున్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 9/11 దాడులను సమర్థిస్తూ, నాటి దాడులను ఎంతో మంది ముస్లింలు సమర్థించారని పేర్కొన్నారు. శనివారం మియామీలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో డోనాల్డ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

'ప్రపంచవ్యాపంగా ఉన్న ముస్లింలు రోజురోజుకూ ఆటవికంగా మారిపోతున్నా సంగతి అందరికీ తెలిసిందే. ఇది అందరూ అంగీకరించే విషయమే. అయితే 9/11 దాడులను సమర్థించేవారు ఓ సారి చరిత్రను తిరగేయాలి. పాలస్తీనా పోరాటయోధుడు, దివంగత యాసర్ అరాఫత్, లిబియా మాజీ నియంత గడాఫీలు నాటి దాడులను ఖండించారు. ఇస్లాం ఆచరణే ధ్యేయంగా జీవించిన ఆ ఇద్దరూ అమెరికాపై ఉగ్రవాదుల దాడి సరికాదన్నారు' అని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.

గడిచిన వారంలో ఫ్లోరిడా, సరసోటాల్లో నిర్వహించిన ప్రచారసభల్లోనూ ట్రంప్ ఇదే విధమైన ముస్లిం వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. అమెరికాలో నివసిస్తున్న అరబ్, ముస్లింల వివరాలు సేకరించాలనే డిమాండ్ ను తాను సమర్థిస్తున్నానన్నారు. 9/11 దాడుల తర్వాత అమెరికాలోని ముస్లింలు సంబరాలు జరుపుకున్నారని ట్రంప్ గతంలోనూ పదేపదే వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement