హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు

హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు


► వారం రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు

►వీరి నియామకంతో 27కు చేరనున్న న్యాయమూర్తుల సంఖ్య

►ఇంకా భర్తీ చేయాల్సిన పోస్టులు 34


సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తులుగా జయలకర్‌ ఉమాదేవి, నక్కా బాలయోగి, తెల్లప్రోలు రజనీ, డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌ నియమితులు కానున్నారు. ఇప్పటికే వీరి నియామకానికి సుప్రీంకోర్టు ఆమోదముద్ర వేసిన నేపథ్యంలో ఇటీవలే వీరి నియామకపు ఫైల్‌పై ప్రధానమంత్రి సంతకం చేశారు. ఆ తరువాత పూర్తి కావాల్సిన విధి విధానాలు కూడా దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వచ్చే వారంలోపు వీరి నియామకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు జారీ చేయనున్నారు. ఉమాదేవి ప్రస్తుతం సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా, బాలయోగి సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. టి.రజనీ హైదరాబాద్‌ మెట్రోపాలిటన్  సెషన్స్  జడ్జిగా, షమీమ్‌ అక్తర్‌ ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌(జుడీషియల్‌)గా పనిచేస్తున్నారు.


ఈ నలుగురి నియామకంతో ఉమ్మడి హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 27కు చేరనున్నది. ఇంకా భర్తీ కావాల్సిన పోస్టులు 34 ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత తీవ్ర పని ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రస్తుత న్యాయ మూర్తులకు ఈ నలుగురి నియామకంతో కొంత పని భారం తగ్గే అవకాశం ఉంది. ఈ నలుగురి పేర్లను న్యాయమూర్తుల పదవులకు సిఫారసు చేస్తూ ఉమ్మడి హైకోర్టు కొలీజియం గత ఏడాది సిఫారసు చేసింది. అయితే వీరి నియామకం విషయంలో కేంద్రం వైపు నుంచి అసాధారణ జాప్యం జరుగుతూ వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకం విషయంలో జరుగుతున్న జాప్యంపై ఇటీవల సుప్రీంకోర్టు మండిపడిన నేపథ్యంలో కేంద్ర న్యాయ శాఖ ఈ నలుగురి పేర్లకు ఆమోదముద్ర వేసింది. తరువాత సుప్రీంకోర్టు సైతం వీరి నియామకానికి సానుకూలంగా స్పందించ డంతో సంబంధిత ఫైల్‌ ప్రధానికి చేరింది. ఇటీవల ఆయన ఫైల్‌పై సంతకం చేయడంతో రాష్ట్రపతి కార్యాలయానికి చేరింది.
జె.ఉమాదేవి: 1959 సెప్టెంబర్‌ 26న అనంతపురం జిల్లాలో జన్మించారు. 1986లో కృష్ణ దేవరాయ వర్సిటీలో బీఎల్‌ పూర్తి చేశారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్ రోల్‌ అయ్యారు. 1996లో జిల్లా, సెషన్స్  జడ్జిగా నియమితులయ్యారు. తరువాత ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో వివిధ జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.నక్కా బాలయోగి: 1957 జనవరి 15న తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. 1980లో ఆంధ్రా వర్సిటీ నుంచి లా డిగ్రీ సాధించారు. అదే ఏడాది న్యాయవాదిగా ఎన్ రోల్‌ అయ్యారు. 1985లో డిస్ట్రిక్‌ మునిసిఫ్‌ మేజిస్ట్రేట్‌గా నియమితులయ్యారు. ఆ తరువాత ఉమ్మడి రాష్ట్రంలో వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ప్రధాన న్యాయాధికారిగా కూడా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చీఫ్‌ జడ్జిగా ఉన్నారు.టి.రజనీ: 1958 నవంబర్‌ 6న ప్రకాశం జిల్లాలో జన్మించారు. 1980లో ఆంధ్రా వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1981లో న్యాయవాదిగా ఎన్ రోల్‌ అయ్యారు. 1982లో గుంటూరులో న్యాయవాదిగా ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. 2002లో న్యాయాధికారిగా నియమితుల య్యారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో వివిధ జిల్లాల్లో పనిచేశారు. ప్రస్తుతం హైదరాబాద్‌ మెట్రోపాలిటన్  సెషన్స్  జడ్జిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.డాక్టర్‌ షమీమ్‌ అక్తర్‌: 1961 జనవరి 1న నల్లగొండ జిల్లాలో జన్మించారు. 1986లో నాగ్‌పూర్‌ వర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 1997లో పీజీ కాలేజ్‌ ఆఫ్‌ లా హైదరాబాద్‌ నుంచి ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. 2001లో ఉస్మానియా నుంచి పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1986లో న్యాయవాదిగా ఎన్ రోల్‌ అయ్యారు. 2002లో జిల్లా, సెషన్స్ జడ్జిగా నియమితులయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో పలు హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు రిజిస్ట్రార్‌(జుడీషియల్‌)గా బాధ్య తలు నిర్వర్తిస్తున్నారు.

Back to Top