బీసీలకు నష్టం కలిగిస్తే ఊరుకోం | Sakshi
Sakshi News home page

బీసీలకు నష్టం కలిగిస్తే ఊరుకోం

Published Fri, Feb 5 2016 3:04 AM

బీసీలకు నష్టం కలిగిస్తే ఊరుకోం - Sakshi

సాక్షి, హైదరాబాద్: కాపులను బీసీల్లో కలుపబోమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేసేంత వరకు వెనుకబడిన వర్గాల ఆందోళనలు ఆగవని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, బీసీ సంఘం నేత ఆర్. కృష్ణయ్య స్పష్టం చేశారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్‌కు వ్యతిరేకంగా జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు ఏపీలోని 13 జిల్లాల్లో ‘కలెక్టరేట్ల ముట్టడి’ కార్యక్రమాలు విజయవంతమైనట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. కాపుల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం వేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బీసీ బిల్లును చట్టసభల్లో ప్రవేశపెట్టే విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.

రైళ్లను దహనం చేయడం, నిరాహారదీక్షలకు దిగడం వల్ల ఉన్నత వర్గాలు బీసీలు కాబోరని పేర్కొన్నారు. హింసతో ఉద్యమాన్ని నడిపిస్తున్న కాపు నేతల డిమాండ్లకు రాష్ట్ర ప్రభుత్వం గంగిరెద్దులా తల ఊపడం శోచనీయమని అన్నారు. ఎలాంటి చట్టబద్ధత లేని డిమాండ్ మేరకు అన్ని రంగాల్లో ముందంజలో ఉన్న కాపులను బీసీల్లో చేర్చే అంశంపై ఉరుకులు పరుగులు పెడుతున్న చంద్రబాబు ప్రభుత్వం, భవిష్యత్తులో ఇతర కులాలు కూడా ఇదే డిమాండ్‌తో మరో రెండు రైళ్లను తగలబెడితే వారిని కూడా బీసీల్లో చేరుస్తారా? అని ప్రశ్నించారు.

కాపులది ఆకలి పోరాటం అయితే బీసీలది ఆత్మ గౌరవ పోరాటమన్నారు.  బీసీల ప్రయోజనాలకు భంగం కలిగించే ఎలాంటి చర్యలకు ఏపీ ప్రభుత్వం ఉపక్రమించినా, కాపుల కన్నా వంద రెట్ల ఉద్యమాన్ని బీసీలు కొనసాగిస్తారని హెచ్చరించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బీసీలకు అన్యాయం చేయబోమని, బీసీల న్యాయమైనరిజర్వేషన్లను కాపులకు పంచబోమని ప్రకటించాలని డిమాండ్ చేశారు.

Advertisement
Advertisement