Sakshi News home page

ఎప్పుడో ఒకసారి తాగినా అంతే హాని!

Published Sat, May 20 2017 11:28 PM

ఎప్పుడో ఒకసారి తాగినా  అంతే హాని!

ఎప్పుడో ఒకసారి మాత్రమే సిగరెట్‌ తాగుతున్నారా? సోషల్‌ స్మోకింగ్‌ అంటూ ఏ ఏడాదికోసారి మాత్రమే పొగ పీలుస్తున్నారా? అయినప్పటికీ రెగ్యులర్‌ స్మోకర్స్‌లో ఎలాంటి దుష్పరిణామాలు వస్తాయో, వీళ్లకూ అలాంటి ముప్పే ఉంటుందంటున్నారు అధ్యయనవేత్తలు. అమెరికాలోని దాదాపు 40,000 మందికి పైగా వ్యక్తులపై జరిపిన అధ్యయనంలో ఈ విషయాలు తెలిశాయి. వీళ్లలో దాదాపు 10 శాతం మంది కేవలం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే సిగరెట్‌ తాగే సోషల్‌ స్మోకర్లు. అయినప్పటికీ వీళ్లలోనూ రెగ్యులర్‌ స్మోకర్స్‌కు వచ్చిన దుష్పరిణామాలనే వీళ్లలోనూ అధ్యయనవేత్తలు గమనించారు.

 ‘‘ఎప్పుడూ సిగరెట్‌ తాగే రెగ్యులర్‌ స్మోకర్స్‌లో వచ్చినట్లుగానే ఎప్పుడో ఒకసారి తాగే వారిలోనూ గుండెసమస్యలు, హైబీపీ వంటి దుష్ప్రభావాలు ఉంటాయి. సోషల్‌ స్మోకర్స్‌ ఏమీ పొగతాగే ముప్పునకు అతీతులు కాదు’’ అంటున్నారు ఒహాయో స్టేట్‌ యూనివర్సిటీలో ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన నిపుణుల బృందంలో ఒకరైన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కేట్‌ గాలిక్‌. ‘‘ఇలా సిగరెట్‌ తాగే ప్రతి పదిమందిలో ఒకరికి మిగతా వారికి వచ్చినట్లుగానే గుండె జబ్బులు వస్తున్నాయి’’ అని నిర్ధారణ చేశారామె.

Advertisement
Advertisement