ధర్మతత్పరత | Sakshi
Sakshi News home page

ధర్మతత్పరత

Published Sun, Jul 16 2017 1:50 AM

ధర్మతత్పరత

దిలీప మహారాజు భార్య సుదక్షిణాదేవి. వారికి సకల సంపదలూ ఉన్నా కానీ, సంతానం మాత్రం లేకపోవడంతో వశిష్ట మహర్షి వద్దకెళ్లి తరుణోపాయం చెప్పమని కోరారు. ఆయన తన వద్ద ఉన్న నందిని అనే ధేనువును ఆ రాజదంపతులకిచ్చి ‘‘దీనిని నిష్ఠగా సేవించండి. తప్పక సంతానప్రాప్తి కలుగుతుంది’’ అని చెప్పాడు. ఆ దంపతులు ఆ ఆవును తీసుకెళ్ళి భక్తిశ్రద్ధలతో సేవించుకో సాగారు. రాజు దాన్ని అడవికి  తీసుకు వెళ్లి, అది మేతమేసిన తర్వాత తీసుకొచ్చేవాడు. ఓ రోజున రాజు ఏమరపాటున ఉన్నప్పుడు ఆ ఆవు కాస్తా తప్పిపోయింది. రాజు దానికోసం  వెతుకుతుండగా సమీపంలో ఉన్న ఒక గుహనుంచి దాని అంబారావాలు వినిపించాయి.  వెంటనే ఆ గుహలోకి ప్రవేశించాడు రాజు.

అక్కడ ఆ ఆవును ఒక సింహం చంపి తినడానికి సిద్ధంగా ఉన్నట్లు కనిపించింది. దిలీపుడు వెంటనే బాణం సంధించబోయాడు. చిత్రం! ఆయన చెయ్యి స్తంభించిపోయి నట్లయింది. ఆశ్చర్యంతో నిలబడిపోయిన రాజుతో ఆ సింహం మానవభాషలో ‘‘రాజా! నేను శివుడికి అత్యంత ఆప్తుడనైన కుంభోదరుడనేవాడను. శివుడు నందిని అధిరోహించే ముందు నా పైన కాలు పెట్టి ఎక్కుతాడు. ఈ గుహలోకి ప్రవేశించిన పశుపక్ష్యాదులను భక్షించడం నా హక్కు. ఇప్పుడు ఈ ఆవును చంపి తిని నా ఆకలి తీర్చుకుంటాను, అడ్డు లే’’ అంటూ తొందర చేశాడు కుంభోదరుడు.

‘‘మా గురువు వశిష్టుడు దీని బాధ్యతను నాకు అప్పగించారు. నా సంరక్షణలో ఉన్న ఈ ఆవును విడిచి పెట్టు లేదా, నేనే దాని బదులుగా నీకు ఆహారమవుతా’’ అన్నాడు దిలీపుడు. ‘‘పిచ్చివాడా! ఆవుకోసం ప్రాణాలెవరైనా వదులుకుంటారా! నీవు రాజువు. నీ ప్రాణాలు ఉంటే ఇటువంటి వెయ్యి ఆవులను  దానంగా ఇవ్వవచ్చు’’ అంది సింహం. ‘‘ఆవునే కాపాడలేనివాడిని నేనింక ప్రజల ప్రాణాలనేమి కాపాడగలను? అందుకే నన్ను చంపి నీ ఆకలి తీర్చుకో’’ అంటూ ప్రాధేయపడడంతో అంగీకరించింది సింహం.

కళ్లు మూసుకున్నాడు రాజు. అయితే, సింహం తన మీద పడకపోగా పైనుంచి పూలవర్షం కురవడంతోపాటు, ‘‘కుమారా! లే’’ అన్న పలుకులు వినపడడంతో ఆశ్చర్యంగా కళ్లు తెరిచాడు రాజు. అక్కడ సింహం లేదు. ‘‘రాజా! నీ ధర్మతత్పరతకు మెచ్చాను. నా పాలు పిండి, నీవు, నీ భార్యా ఇద్దరూ తాగండి. సత్సంతానం ప్రాప్తిస్తుంది’’అని చెప్పింది నందిని. దిలీప మహారాజు ఆవు పాలు పితికి తాను  తాగి, భార్యకు కూడా తాగించాడు. రాణి గర్భం ధరించి, పండంటి బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డే రఘుమహారాజు. రాముడి తాతగారు. ఆయన పేరు మీదుగానే రఘువంశం ఏర్పడింది. రాముడు ఆయన నుంచే ధర్మాన్ని పుణికి పుచ్చుకున్నాడు. రఘురాముడయ్యాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement