సమీక్షణం : ధర్మబద్ధ వాదం | Sakshi
Sakshi News home page

సమీక్షణం : ధర్మబద్ధ వాదం

Published Sun, Mar 16 2014 2:04 AM

సమీక్షణం : ధర్మబద్ధ వాదం

ధర్మబద్ధ వాదం
 పుస్తకం        :    మాటకు మాట (వ్యాసాలు)
 రచన        :    కట్టా శేఖర్‌రెడ్డి
 విషయం    :    ‘ఏ విజయమూ యుద్ధం మొదలుపెట్టగానే రాదు. ఏ శత్రువూ పోరాడకుండా ఓటమిని అంగీకరించడు ’ అంటూ సీనియర్ పాత్రికేయులు కట్టా శేఖర్‌రెడ్డి అభివృద్ధితో తెలంగాణ కోసం పిలుపునిస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటం, ఆటుపోట్లు,  వంచనలు, పోరాట వీరుల స్మృతుల తాలూకు స్కానింగ్ రిపోర్టుగా ఈ వ్యాసాలు కనిపిస్తాయి. తాను పనిచేసిన పత్రికల్లో వారం వారం శీర్షికగా ఇవి రాసినప్పటికీ నిర్మాణాత్మక రాజకీయ విమర్శకు, ప్రణాళికాబద్ధ అభివృద్ధి కాంక్షకు ఈ వ్యాసాల్లో జవసత్వాలు ఇచ్చారు. వామపక్ష విద్యార్ధి ఉద్యమం నుంచి తనను తాను పుటంబెట్టుకున్న శేఖర్‌రెడ్డి అచ్చమైన తెలంగాణావాదిగా కంటే కూడా అన్నిరకాల వెనుకబాటుతనం మీద యుద్దం చేసే సైనికుడిగా కనిపిస్తారు.
 ‘సౌందరనందం’లో బుద్ధుడితో నందుడి సంవాదం లాగా ధర్మబద్దమైన వాదం ఈ పుస్తకంలో కనిపిస్తుంది. 77 వ్యాసాల్లోని అనేక రెఫరెన్సులు జనం పక్షం వహించే ఒక అరుదైన పరిశోధకుడిని పరిచితం చేస్తాయి.
 - డాక్టర్ నూకతోటి రవికుమార్
 
 పేజీలు: 314; వెల: 200
 ప్రతులకు : రాష్ట్రంలోని ముఖ్య పుస్తకాల షాపులతోపాటు, అడుగుజాడలు పబ్లికేషన్స్, ఫ్లాట్ నం. 302, వైష్ణవి నెస్ట్, మూసారాంబాగ్, దిల్‌సుఖ్‌నగర్, హైదరాబాద్-36.
 
 కుటుంబ పరిణామక్రమానికి అద్దం
 చికాగోలో నానమ్మ (కథలు)
 రచన        :    బి.ఎస్.రాములు
 విషయం    :     ఇందులో 16 కథలున్నాయి. రచయిత తీసుకున్న కాన్వాస్ విస్తృతమైంది. వాటిని కథానిక పరిమితిలోకి దించి, స్థల, కాల, సామాజిక పరిణామాలను పరిచయం చేస్తూ క్లుప్తంగా విశ్లేషించారు. కొన్ని కథలకు సంబోధనాపూర్వక శైలీశిల్పాన్ని ఉపయోగించారు. ‘వరుసలు’, ‘పంజరం’, ‘నానమ్మ’ కథలు ఇందుకు ఉదాహరణ. వీరి కథల్లో యదార్థ చిత్రణతో పాటు, పాత్రల ఆదర్శీకరణ, స్పష్టత కనిపిస్తుంది. మానవతా విలువలు, సంస్కృతి ప్రతిపాదనలు ఉన్నతీకరించడం ద్యోతకమౌతుంది. ‘పాతచీర’కథ మానవ సంబంధాలు ఎలా శిథిలమౌతాయో నవతరం మానవ సంబంధాలు కొత్తగా ఎలా ముందుకు పోతుంటాయో తెలుపుతుంది.
 - కొండ్రెడ్డి వెంకటేశ్వరరెడ్డి
 
 పేజీలు: 224; వెల: 120; ప్రతులకు: విశాల సాహిత్య అకాడమీ, 201, సులేఖ గోల్డెన్ టవర్స్, రామకృష్ణనగర్, బాగ్‌అంబర్‌పేట్, హైదరాబాద్-13. ఫోన్: 8331966987
 
 
 
 నవరసభరిత కదంబం
 పుస్తకం        :    మూడుకాళ్ల మేక (కథలు)
 రచన        :    కల్లూరు రాఘవేంద్రరావు
 విషయం    :    ఉపాధ్యాయుడిగా దీర్ఘకాలం పని చేసిన విశేష అనుభవంతో నిత్యజీవితంలో ఎదురయ్యే రకరకాల సంఘటనలన్నింటినీ గుదిగుచ్చి, ఈ ‘కథ’ంబాన్ని అందించారు కల్లూరు రాఘవేంద్రరావు. ఈ కథలన్నీ ముప్ఫై నలభై ఏళ్ల నుంచి, రెండు మూడేళ్ల క్రితం వరకు రకరకాల పత్రికల్లో అచ్చయినవే. ఇవి చిరునవ్వుతో పెదవులు విచ్చుకునేట్లు, కోపంతో పిడికిళ్లు బిగుసుకునేట్లు, బాధతో కళ్లు చెమర్చేట్లు చేసేలా ఉన్నాయి.
 - డి.వి.ఆర్.
 
 పేజీలు: 152; వెల: 70; ప్రతులకు: మేనేజింగ్ ఎడిటర్, శ్రీకృష్ణదేవరాయ గ్రంథమాల, 26-4-982, త్యాగరాజనగర్, హిందూపురం- 515 201; ఇతర ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
 
 
 సాఫ్ట్‌వేర్ నవల
 పుస్తకం        :    రామ్‌ః శృతి.కామ్ (నవల)
 రచన        :    అద్దంకి అనంతరామ్
 విషయం    :    శాస్త్ర సాంకేతిక  విప్లవం మనుషుల అభిరుచుల్ని, అభినివేశాల్ని ప్రభావితం చేస్తుందనటానికి నిదర్శనం ఈ బ్లాగు నవల. నేటి యువత విజయపు వేటలో పడి జీవితంలో యేం కోల్పోతున్నామో, ఇప్పటికే ఎంతో కోల్పోయామేమోననే స్పృహ కలిగి జీవన మాధుర్యాన్ని వెతుక్కుంటూ, ప్రేమ రాహిత్య భావన నుండి బయటపడాలని ప్రయత్నిస్తారు. ఈ నవల్లోని రామ్ కూడా అలాంటి ప్రయత్నమే చేశాడు. ఇంజనీరింగ్ తర్వాత హైదరాబాద్ చేరుకొని సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం పొందుతాడు. అదే కంపెనీలోని సహోద్యోగి శృతిని తొలిచూపులోనే ప్రేమించడం, వెంట తిరగడం, పరిచయం కోసం ఆరాటపడటం, సాగర్ నౌకాయానం ద్వారా ఒకరినొకరు అర్థం చేసుకోవడం వంటి స్వానుభవ అనుభూతుల్ని అందంగా అల్లే ప్రయత్నం చేశాడు.
 
 అయితే, ఈ ప్రేమకథలో పేద ధనిక తారతమ్యాలు గానీ, కుల మత భేదాలు గానీ అడ్డుతగలకపోవడం వల్ల గాఢంగా ఊపేయలేకపోయిందనే చెప్పాలి. బతుకుల్లో కల్లోలం లేనప్పుడు ఇలాంటి అందమైన ‘సాఫ్ట్’ కథలే, నవలలే పుట్టుకొస్తాయి.
 - మీరాసాహెబ్
 
 పేజీలు: 134; వెల: 80; ప్రతులకు: www.Kinige.com
 
 

Advertisement
Advertisement