మానవ ప్రయోగాల్లో క్యాన్సర్‌ వ్యాక్సిన్‌ సత్ఫలితాలు!

Cancer Vaccine Good results in human experiments - Sakshi

ప్రాణాంతకమైన క్యాన్సర్‌కు మెరుగైన చికిత్స కల్పించే విషయంలో టెక్సాస్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఎండీ యాండర్సన్‌ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ శాస్త్రవేత్తలు విజయం సాధించారు. చికిత్స చేయడం చాలా కష్టంగా మారిపోయిన నాన్‌స్మాల్‌ ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో పాటు పెద్ద పేవు, మెడుల్లరీ, పాపిలరీ థైరాయిడ్‌ వంటి వేర్వేరు క్యాన్సర్లను బీఎల్‌యూ 667 పేరున్న మందుతో చెక్‌ పెట్టగలమని వీరు మానవ ప్రయోగాల ద్వారా నిరూపించారు. క్యాన్సర్‌ డిస్కవరీ మ్యాగజైన్‌ తాజా సంచికలో వివరాలు ప్రచురితమయ్యాయి. ఈ క్యాన్సర్లను ఆర్‌ఈటీ రకమని పిలుస్తూంటారని; ఇప్పటివరకూ వీటికి తగిన చికిత్సా పద్ధతులు లేవని ఈ పరిశోధనలకు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త డాక్టర్‌ వివేక్‌ సుబ్బయ్య తెలిపారు.

ఆర్‌ఈటీ క్యాన్సర్లతో బాధపడుతున్న కొంతమందికి 30 నుంచి 400 మిల్లీగ్రాముల వరకూ బీఎల్‌యూ 667ను నోటి ద్వారా అందించినప్పుడు చాలామందిలో మెరుగుదల కనిపించిందని, దుష్ప్రభావాలు తక్కువగా ఉండటంతో పాటు క్యాన్సర్‌ లేని అవయవాలకు ఇబ్బంది కూడా కలిగించలేదని వివేక్‌ తెలిపారు. కణితి పరిమాణం తగ్గడంతో పాటు ఇతర లక్షణాల్లోనూ మెరుగుదల కనిపించినట్లు చెప్పారు. క్యాన్సర్‌ కారక జన్యుమార్పులను అడ్డుకునే లక్షణాలను గుర్తించిన తరువాత తాము బీఎల్‌యూ 667పై విస్తృత పరిశోధనలు మొదలుపెట్టినట్లు తెలిపారు.  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top