'వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది' | Sakshi
Sakshi News home page

'వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది'

Published Sat, Apr 19 2014 5:16 PM

'వైఎస్సార్ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంది' - Sakshi

మహబూబ్ నగర్: ఆ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి తెలంగాణ ప్రాంత ప్రజలతో విడదీయరాని బంధం ఉందని వైఎస్సార్ సీపీ నేత షర్మిల అభిప్రాయపడ్డారు. ఆ క్రమంలోనే ఆయన ఏ సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టినా తెలంగాణ ప్రాంతం నుంచే ఆరంభించేవారని ఆమె తెలిపారు. ఈ రోజు ఎన్నికల రోడ్ షోలో భాగంగా మహబూబ్ నగర్ సభకు హాజరైన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అశేష జనవాహినిని ఉద్దేశించి ఆమె ప్రసంగిస్తూ..మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత వైఎస్సార్ కే దక్కుతుందని మరోమారు గుర్తు చేశారు. ఆయన పాలనలో ఏ ఒక్క ఛార్జీలు పెంచలేదని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలోనే కాకుండా దేశంలో రెండుసార్లు అధికారాన్ని కట్టబెడితే.. ఆయన పేరును ఆ పార్టీ ఎఫ్ఐఆర్ లో చేర్చిందని మండిపడ్డారు.

 

వైఎస్సార్ కు కాంగ్రెస్ అన్యాయం చేసినా.. తెలుగు ప్రజలు మాత్రం ఆయన్ను గుండెల్లో పెట్టుకుని ఆదరిస్తున్నారన్నారు. వైఎస్సార్ ను గుండెల్లో పెట్టుకున్న తెలంగాణ ప్రజలకు తమ కుటుంబం ఎప్పటికీ రుణపడి ఉంటుంద్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో కూర్చోబెట్టడానికి బాబు నానా తంటాలు పడ్డారని ఎద్దేవా చేశారు. విప్ జారీ చేసి మరీ..కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాపాడిన ఘనత చంద్రబాబుకే చెందుతుందన్నారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సమస్యల కోసం రోజుల తరబడి ఎన్నో పోరాటాలు చేశారని షర్మిల తెలిపారు. ప్రజల కష్ట సుఖాలను తెలుసుకున్న వైఎస్సార్ సీపీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలకు విజ్క్షప్తి చేశారు.

 

Advertisement
Advertisement