ప్రజాకంటక పాలన | Sakshi
Sakshi News home page

ప్రజాకంటక పాలన

Published Wed, Jun 21 2017 10:59 PM

ప్రజాకంటక పాలన - Sakshi

- రాష్ట్రంలో సంక్షేమానికి పాతర
- ఒక్క హామీ నెరవేర్చని చంద్రబాబు
- టీడీపీ నాయకులది ‘దోచుకో..దాచుకో’ సిద్ధాంతం
- వైఎస్సార్‌సీపీ జిల్లా ప్లీనరీలో నేతల మండిపాటు
-అరాచక పాలనకు చరమగీతం పాడాలని ప్రజలకు పిలుపు
-ప్లీనరీ సక్సెస్‌తో పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం


అనంతపురం : రాష్ట్రంలో ప్రజాకంటక పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు.  సంక్షేమానికి పాతరేసిన  టీడీపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. అనంతపురంలోని గుత్తిరోడ్డులో ఉన్న కేటీఆర్‌ ఫంక్షన్‌ హాలులో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ప్లీనరీ నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా పార్టీ బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు,, మాజీ ఎమ్మెల్యే జంగా కృష్ణమూర్తి, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  అంతకుముందు పార్టీ జెండా ఎగురవేశారు. వైఎస్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జిల్లాలో  వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తల మృతికి సంతాపం ప్రకటించారు.  ఆత్మహత్యలు చేసుకున్న రైతులు, చేనేత కార్మికులకు కూడా సంతాపం ప్రకటిస్తూ   మౌనం పాటించారు.

అనంతరం  జంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ రాష్ట్రంలో పాలన అధ్వానంగా ఉందన్నారు.  అధికార దాహంతో అలివికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాటిని విస్మరించారన్నారు. ఉన్న పథాకాలకు కోతలు విధిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని మండిపడ్డారు.   సమావేశంలో జెడ్పీ మాజీ చైర్‌పర్మన్‌ తోపుదుర్తి కవిత, మాజీ మేయర్‌ రాగే పరుశురాం, ప్లీనరీ పర్యవేక్షకుడు కె. ధనుంజయయాదవ్, ఎల్‌ఎం మోహన్‌రెడ్డి, నాయకులు చవ్వా రాజశేఖర్‌రెడ్డి, బోయ తిరుపాలు, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డి, మీసాల రంగన్న, తోపుదర్తి ఆత్మారామిరెడ్డి,  మరువపల్లి ఆదినారాయణరెడ్డి, పెన్నోబులేసు, బోయ సుశీలమ్మ, సాకే రామకృష్ణ, పాలె జయరాంనాయక్, కొర్రపాడు హుసేన్‌పీరా, లీగల్‌సెల్‌ నారాయణరెడ్డి,  గౌని ఉపేంద్రరెడ్డి, రంగంపేట గోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
దళిత ద్రోహి చంద్రబాబు
దళితుల ఓట్లతో అధికార పీఠమెక్కిన చం‍ద్రబాబు అనంతరం వారిని మోసగించి దళిత ద్రోహిగా మారారు.  ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని అపహాస్యం చేస్తున్నారు. మా పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ ఉద్యమాలకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు ఉన్నాయో కూడా తెలీని చంద్రబాబు తనయుడు లోకేష్‌ చాలెంజ్‌ చేయడం విడ్డూరంగా ఉంది.
- మేరుగ నాగార్జున,  ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు

వైఎస్సార్‌సీపీ ప్లీనరీ తీర్మానాల్లో ముఖ్యమైనవి..
– జిల్లాలో హంద్రీ–నీవా ద్వారా నిర్ధేశించిన ఆయకట్టుకు డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేసి వెంటనే నీరు ఇవ్వాలి.
– రాజధాని ప్రకటన సమయంలో జిల్లా అభివృద్ధికి ఇచ్చిన 21 హామీలను వెంటనే అమలు చేయాలి.
– ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలను వెంటనే చెల్లించి, ఈ పథకాలను సక్రమంగా అమలు చేయాలి.
– చేనేత కార్మికుల సమస్యలు పరిష్కరించాలి.
– ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్‌ నిధులు పక్షపాతం లేకుండా అర్హులందరికీ రుణాలివ్వాలి.
– జిల్లాలో కుద్రేముఖ్‌ ఇనుప పిల్లెట్లు పరిశ్రమతో పాటు పారిశ్రామిక అభివృద్ధికి పాటుపడాలి.
– కరువు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలి. రాయితీల విషయంలో అనంతపురం జిల్లాను ప్రత్యేకంగా పరిగణించాలి
– శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement