కోడి పందాలకు..

కోడి పందాలకు.. - Sakshi


ఆరిలోవలో టీడీపీ నేతల ముమ్మర ఏర్పాట్లు

స్థలం చదునుకు జీవీఎంసీ ట్యాంకర్‌తో నీటి తరలింపు




ఆరిలోవ(తూర్పు విశాఖ): కోడి పందాలపై హైకోర్టు ఆదేశాలు.. పోలీసుల హెచ్చరికలను టీడీపీ నేతలు బేఖాతర్‌ చేస్తున్నారు. సంక్రాంతి పండగ ముసుగులో సన్నాహాలు జరుపుతున్నారు. ఆరిలోవలో పందాల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఖాళీగా ఉన్న జీవీఎంసీ స్థలాన్ని శుభ్రం చేసి పందాలకు వేదికగా సిద్ధం చేస్తున్నారు. జీవీఎంసీ అధికారులు మాత్రం ఇవేమీ తెలియనట్టు మిన్నకుండడంపై పలు విమర్శలు వినిపిస్తున్నాయి. ముడసర్లోవ రిజర్వాయర్‌ వెనక జీవీఎంసీకి చెందిన ఖాళీ భూముల్లో సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడానికి ఓ ప్రజాప్రతినిధి అండదండలతో టీడీపీ తముళ్లు సిద్ధమవుతున్నారు. ఇక్కడ జీవీఎంసీకి చెందిన సుమారు పదెకరాల ఖాళీ స్థలం ఉంది. ఈ స్థలంలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేశారు. ఇందులో ఎకరం స్థలాన్ని ప్రత్యేక వేదికగా చదును చేశారు. నీటితో తడుపుతూ చుట్టూ సిమెంట్‌ స్తంభాలు పాతారు. దాన్ని ఓ ప్లాట్‌ఫాం మాదిరిగా తయారు చేస్తున్నారు. పందెంరాయుళ్ల వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేకంగా కొంత స్థలాన్ని చదును చేశారు. బైకులు, కార్లు నిలపడానికి వేర్వేరుగా ఏర్పాట్లు చేపడుతున్నారు.  

గతేడాది నుంచి ఈ సంస్కృతి

నగరంలో ఎప్పుడూ సంక్రాంతికి కోడి పందాల నిర్వహణ సంస్కృతి లేదు. గతేడాది కోడి పందాలకు ఇక్కడ బీజం పడింది. సాక్షాత్తు తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబే ఈ పందాలను గతేడాది ప్రారంభించారు. దీంతో ఉభయ గోదావరి జిల్లాల కోడి పందాల సంస్కృతి సంక్రాంతి సందర్భంగా ఇక్కడ వ్యాపించినట్లయింది. అందుకే దాన్ని కొనసాగించాలని ఇప్పుడు ఎలాంటి ఆదేశాలనైనా పట్టించుకోకుండా తెలుగు తమ్ముళ్లు ముందుకెళుతున్నారు. భోగి, సంక్రాం తి, కనుమ రోజుల్లో ఇక్కడ పందాలు నిర్వహించడానికి ఏర్పా ట్లు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కొందరు పందెంరాయుళ్లు ఇప్పటికే నగరానికి చేరుకొన్నట్లు సమాచారం.



కోర్టు ఆదేశాలూ బేఖాతర్‌



సంక్రాంతికి కోడి పందేలు నిర్వహించకూడదని కొద్ది రోజుల కిందట ఉమ్మడి హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ప్రభుత్వానికి జారీచేసిన విషయం తెలిసిందే. ఈ ఆదేశాల ప్రకారం డీజీపీ ఎన్‌.సాంబశివరావు కూడా పందాలు నిర్వహించొద్దని, ఆదేశాలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హోం మంత్రి చినరాజప్ప కూడా కోడి పందాలు జరిపితే కేసులు పెడతామని మంగళవారం ప్రకటించారు. ఇన్ని హెచ్చరికలు, ఆదేశాలు ఉన్నా ఇక్కడ టీడీపీ తమ్ముళ్లకు మాత్రం పట్టడంలేదు. ఆదేశాలతో మాకేంటి అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఓ ప్రజాప్రతినిధి అండ ఉండడంతో జీవీఎంసీ అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం విశేషం. ఆ నీటితోనే ఇక్కడ స్థలాన్ని తడిపి పందేలు నిర్వహించే ప్లాట్‌ఫాం తయారు చేస్తున్నారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top