చెలరేగిపోతున్న అక్రమార్కులు | Sakshi
Sakshi News home page

చెలరేగిపోతున్న అక్రమార్కులు

Published Thu, Aug 25 2016 11:21 PM

చెలరేగిపోతున్న అక్రమార్కులు

ఇష్టానుసారంగా ఇసుక తవ్వకాలు
పట్టించుకోని అధికారులు 
 
 
మక్కువ: ఉచిత ఇసుక విధానంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. నిబంధనలను పక్కనబెట్టి మరీ ఇసుకను తరలించుకుపోతున్నారు. ఏకంగా లారీలనే నదీ సమీపంలోకి తీసుకువచ్చి ఇసుకను ఇతర మండలాలు, జిల్లాలకు తరలిస్తూ రెండు చేతులా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇష్టానుసారంగా తవ్వకాల వల్ల నదీ స్వరూపాలు మారిపోతున్నాయి. వంతెనలు, కాజ్‌వేల వద్ద ఇసుక తవ్వకూడదనే నిబంధనలున్నా పట్టించుకోవడం లేదు.  మండలంలో డి.శిర్లాం గ్రామ సమీపంలో ఉన్న సువర్ణముఖీనదిలో గతంలో వెలుగు అధికారులు ఇసుకరీచ్‌ను గుర్తించారు. గతంలో ఇక్కడ నుంచే ఇసుకను తరలించేవారు. ప్రస్తుతం ఇసుక ఉచితమని ప్రకటించడంతో అక్కమార్కులు వారికి నచ్చిన ప్రదేశాల నుంచి ఇసుకను తరలించుకుపోతున్నారు. దీంతో వంతెనలు, కాజ్‌వేలకు ప్రమాదం పొంచి ఉందని పలువురు ఆందోళన చెందుతున్నారు. డి. శిర్లాం నుంచి సేకరించిన ఇసుకను విజయనగరం, విశాఖపట్నం ,తదితర ప్రాంతాలకు తరలించి అక్రమార్కులు సొమ్ము చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే మక్కువ, సీతానగరం, పార్వతీపురం, బొబ్బిలి మండలాలకు చెందిన ట్రాక్టర్లు, లారీలు సువర్ణముఖి నదికి వస్తుండడంతో  డీ.శిర్లాం, వెంకటభైరిపురం గ్రామాల మధ్యనున్న రహదారి పాడైంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి నదిలో కేటాయించిన ఇసుకరీచ్‌  నుంచి మాత్రమే ఇసుకను తరలించాలని పలువురు కోరుతున్నారు.                     
 

Advertisement
Advertisement