ఏడు రోజుల నష్టాలకు బ్రేక్‌ | Sakshi
Sakshi News home page

ఏడు రోజుల నష్టాలకు బ్రేక్‌

Published Fri, Feb 9 2018 1:00 AM

Sensex, Nifty in recovery mode - Sakshi

ఆసియా మార్కెట్లలో ఆశావహ ధోరణి, కార్పొరేట్ల ఆదాయాలపై సానుకూల అంచనాలు తదితర అంశాలన్నీ కలిసి స్టాక్‌ మార్కెట్ల ఏడు రోజుల పతనానికి బ్రేక్‌ వేశాయి. గురువారం దేశీ సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 330 పాయింట్లు లాభపడి 34,413 పాయింట్ల వద్ద క్లోజయింది. గడిచిన రెండు వారాల్లో సెన్సెక్స్‌ ఇంతగా లాభపడటం ఇదే తొలిసారి. దేశ, విదేవీ మార్కెట్లలో నెలకొన్న నెగటివ్‌ సెంటిమెంట్‌తో గత ఏడు సెషన్స్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 2,200 పాయింట్లు పతనమైంది.

మరోవైపు, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ కూడా కోలుకుని 100 పాయింట్ల మేర (0.96 శాతం) లాభంతో 10,577 పాయింట్ల వద్ద ముగిసింది. ఇటీవల భారీగా పతనమైన షేర్లతో పాటు ఫార్మా, ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్లతో మార్కెట్లో కొంత ఆశావహ ధోరణి కనిపించింది. ముడిచమురు ధరలు తగ్గుతుండటం, మెరుగైన ఆర్థిక వృద్ధి అంచనాలు తదితర అంశాలు ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడటానికి దోహదపడ్డాయి. ఫ్యూచర్స్‌ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడాయిల్‌ బ్యారెల్‌ ధర ఒక దశలో ఆరు వారాల కనిష్ట స్థాయి అయిన 65.16 డాలర్లకు తగ్గింది.

ఇంధనావసరాలకు ప్రధానంగా దిగుమతులపైనే ఆధారపడిన నేపథ్యంలో ముడిచమురు రేట్ల తగ్గుదల భారత్‌కు సానుకూలాంశం.  దేశీ కంపెనీల ఆదాయాలు మెరుగ్గా ఉండటం, ఆసియా మార్కెట్లలో ఆశావహ ధోరణులు నెలకొనడం భారత మార్కెట్ల లాభాలకు దోహదపడ్డాయని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ మార్కెట్‌ స్ట్రాటెజిస్ట్‌ ఆనంద్‌ జేమ్స్‌ చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా మార్కెట్లు తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతుండటం, కీలక వడ్డీ రేట్లపై బ్యాంక్‌ ఆఫ్‌ ఇంగ్లాండ్‌ (బీవోఈ) నిర్ణయంపై యూరప్‌ మార్కెట్లు స్పందించే తీరుతెన్నులు మొదలైనవాటిని ఇన్వెస్టర్లు చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

Advertisement
Advertisement