ఫలితాలకు ముందు జాగ్రత్త | Sakshi
Sakshi News home page

ఫలితాలకు ముందు జాగ్రత్త

Published Mon, Apr 8 2019 11:59 PM

Rs 1 lakh grows to Rs 3.9 crore in 40 years Secret behind Sensex - Sakshi

ఆద్యంతం తీవ్రమైన ఒడిదుడుకులమయంగా సాగిన సోమవారం నాటి మార్కెట్లో స్టాక్‌ మార్కెట్‌ నష్టాల్లో ముగిసింది. కంపెనీల ఆర్థిక ఫలితాలు మొదలు కానుండటం, లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కూడా ఈ వారమే ఆరంభం కానున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ముడిచమురు ధరలు ఐదుల నెలల గరిష్ట స్థాయికి చేరడం, డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనం కావడం ప్రతికూల ప్రభావం చూపించాయి. గత వారంలో సెన్సెక్స్, నిఫ్టీలు జీవిత కాల గరిష్ట స్థాయిలకు చేరడంతో గరిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపారు. లోహ, ఆర్థిక, ఇంధన, రియల్టీ షేర్లు బాగా పతనమయ్యాయి. రూపాయి పతనం కారణంగా ఐటీ, టెక్నాలజీ షేర్లు పెరిగాయి. రోజు మొత్తం మీద 520 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన సెన్సెక్స్‌ చివరకు 162 పాయింట్లు తగ్గి 38,701 పాయింట్ల వద్ద ముగిసింది. 161 పాయింట్ల రేంజ్‌లో కదలాడిన  ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 61 పాయింట్లు నష్టపోయి 11,605 పాయింట్ల వద్దకు చేరింది. మొత్తం 19 రంగాల బీఎస్‌ఈ సూచీల్లో 16 సూచీలు నష్టపోగా, మూడు సూచీలు మాత్రమే లాభపడ్డాయి.  

చమురు ధరలు భగ్గు.... 
ముడి చమురు ధరలు భగ్గుమంటున్నాయి. ఒపెక్‌ సరఫరాల్లో కోత, ఇరాన్, వెనుజులా దేశాలపై అమెరికా ఆంక్షలు, లిబియాలో అశాంతి నెలకొనడం తదితర కారణాల వల్ల చమురు ధరలు పెరు గుతున్నాయి.  అమెరికా–చైనాల మధ్య ఇప్పటివరకూ ఎలాంటి వాణిజ్య ఒప్పందం కుదరకపోవడం, బ్రెగ్జిట్‌కు సంబంధించి ఒప్పందం కుదరడంలో జాప్యం, వివిధ దేశాల కేంద్ర బ్యాంక్‌లు కీలక సమావేశాల నేపథ్యంలో ప్రపంచ మార్కెట్లు నష్టపోయాయి. ఇటీవల మార్కెట్లు కొత్త శిఖరాలకు చేరడంతో సమీప భవిష్యత్తులో లాభాల స్వీకరణ కొనసాగుతుందని నిపుణులంటున్నారు. ఆసియా మార్కెట్లు మిశ్రమంగా ముగిశాయి.యూరప్‌ మార్కెట్లు బలహీనంగా ఆరంభమై, నష్టాల్లో ముగిశాయి.  

520 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌... 
సెన్సెక్స్,నిఫ్టీలు  లాభాల్లోనే ఆరంభమయ్యాయి. ఆరంభ కొనుగోళ్ల జోరుతో మరింత లాభపడ్డాయి. లాభాల స్వీకరణ కారణంగా నష్టాల్లోకి జారిపోయాయి. తీవ్రమైన ఒడిదుడుకులకు గురయ్యాయి. సెన్సెక్స్‌ ఒక దశలో 179 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 341 పాయింట్లు నష్టపోయింది. ఇక నిఫ్టీ ఒక దశలో 44 పాయింట్లు పెరగ్గా, మరో దశలో 117 పాయింట్లు పతనమైంది.  
►ముడి చమురు ధరలు భగ్గుమంటుండటంతో ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ షేర్లు నష్టపోయాయి.  బీపీసీఎల్‌ 2%,  హెచ్‌పీసీఎల్‌ 4 %,  ఐఓసీ కూడా 4% చొప్పున నష్టపోయాయి.  
►  ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌లో 30 శాతం వాటాను బారింగ్‌ ప్రైవేల్‌ ఈక్విటీ ఏషియా కొనుగోలు చేస్తుండటంతో ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ షేర్‌ 3.5  శాతం నష్టంతో రూ.1,301 వద్ద ముగిసింది.  బారింగ్‌ సంస్థ 30 శాతం వాటాలో అధిక భాగాన్ని ఎన్‌ఐఐటీ టెక్నాలజీస్‌ ప్రమోటర్‌ అయిన ఎన్‌ఐఐటీ నుంచి కొనుగోలు చేస్తుండటంతో ఎన్‌ఐఐటీ షేర్‌ 19 శాతం లాభంతో రూ.114 వద్ద ముగిసింది.  
► ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీతో విలీనం కానున్న నేపథ్యంలో లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌ షేర్‌ వరుసగా మూడో రోజూ 5 శాతం అప్పర్‌ సర్క్యూట్‌ ను తాకింది.  

Advertisement
Advertisement