ఆర్‌బీఐ ‘ఫండ్స్‌’ | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ ‘ఫండ్స్‌’

Published Tue, Apr 28 2020 1:40 AM

RBI opens ₹50000-cr liquidity tap for mutual funds - Sakshi

ముంబై: డెట్‌ మార్కెట్లో నిధుల లేమికి ఆర్‌బీఐ తాత్కాలిక పరిష్కారం చూపించింది. రూ.50,000 కోట్ల నిధులను మ్యూచువల్‌ ఫండ్స్‌ పరిశ్రమకు బ్యాంకుల ద్వారా అందించే ప్రత్యేక రెపో విండో ఏర్పాటును ప్రకటించింది. డెట్‌ ఫండ్స్‌కు ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ పెరగడం, అదే సమయంలో మార్కెట్లో కొత్తగా వచ్చే పెట్టుబడులు తగ్గడంతో నిధుల కటకట పరిస్థితి నెలకొంది. ఈ కారణంగానే ఫ్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థ ఆరు అధిక రిస్క్‌తో కూడిన డెట్‌ పథకాలను మూసివేస్తూ గత వారం నిర్ణయం తీసుకుంది.

గోరుచుట్టుపై రోకలి పోటు చందంగా అసలే లిక్విడిటీ సమస్య తీవ్రంగా ఉన్న డెట్‌ మార్కెట్లో ప్రాంక్లిన్‌ టెంపుల్‌టన్‌ నిర్ణయం ఇన్వెస్టర్ల నుంచి మరింత మొత్తంలో ఉపసంహరణలు పెరిగేందుకు దారితీయవచ్చన్న ఆందోళనలతో.. సోమవారం ఆర్‌బీఐ మార్కెట్లను ఆదుకునే చర్యలతో ముందుకు వచ్చింది. దీంతో ఫండ్స్‌ సంస్థలకు నిధుల లభ్యత పెరగనుంది. ఫలితంగా అవి తమకు ఎదురయ్యే పెట్టుబడుల ఉపసంహరణలకు చెల్లింపులు చేసే వీలు కలుగుతుంది.

అధిక రిస్క్‌ విభాగంలోనే సమస్య..   
‘‘కరోనా వైరస్‌ కారణంగా క్యాపిటల్‌ మార్కెట్లలో ఆటుపోట్లు పెరగడంతో మ్యూచువల్‌ ఫండ్స్‌కు నిధుల లభ్యత సమస్యలు ఎదురయ్యాయి. పెట్టుబడుల ఉపసంహరణ కారణంగా కొన్ని డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ను మూసివేయడంతో ఈ ఒత్తిళ్లు మరింత తీవ్రతరమయ్యాయి. ప్రస్తుత దశలో అధిక రిస్క్‌తో కూడిన డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌ విభాగానికే ఈ ఒత్తిళ్లు పరిమితమయ్యాయి. పరిశ్రమలో మిగిలిన విభాగాల్లో అధిక శాతం నిధుల లభ్యత ఉంది’’ అంటూ ఆర్‌బీఐ తన ప్రకటనలో పేర్కొంది.

ఆర్‌బీఐ ఇప్పుడు ఏం చేస్తుంది..?
మ్యూచువల్‌ ఫండ్స్‌కు ప్రత్యేక నిధుల సదుపాయం (ఎస్‌ఎల్‌ఎఫ్‌–ఎంఎఫ్‌) కింద ఆర్‌బీఐ 90 రోజుల కాల పరిమితితో రూ.50,000 కోట్ల మేర రెపో ఆపరేషన్స్‌ను చేపడుతుంది. 4.4 శాతం ఫిక్స్‌డ్‌ రెపో రేటుపై ఈ నిధులను బ్యాంకులకు అందిస్తుంది. ఈ నెల 27 నుంచి మే 11 వరకు ఈ పథకం (విండో) అందుబాటులో ఉంటుంది. ప్రతీ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఏ రోజు అయినా బ్యాంకులు ఈ విండో ద్వారా నిధుల కోసం బిడ్‌ దాఖలు చేసుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది.

ఈ సదుపాయం కింద తీసుకునే నిధులను బ్యాంకులు మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థల (అస్సెట్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలు/ఏఎంసీలు) నిధుల అవసరాలకే వినియోగించాల్సి ఉంటుంది. అంటే ఫండ్స్‌కు రుణాలను అందించడం, మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కలిగి ఉన్న ఇన్వెస్ట్‌మెంట్‌ గ్రేడ్‌ కార్పొరేట్‌ బాండ్లు, కమర్షియల్‌ పేపర్లు, డిబెంచర్స్, సర్టిఫికెట్‌ ఆఫ్‌ డిపాజిట్ల కొనుగోలుకు బ్యాంకులు ఖర్చు చేయాల్సి ఉంటుంది. తద్వారా ఫండ్స్‌కు నిధుల లభ్యత ఏర్పడుతుంది. బ్యాంకుల నుంచి డిమాండ్‌ అధికంగా ఉంటే అదనంగా నిధులను అందించే అవకాశం కూడా ఉంటుందని  ఏప్రిల్‌ 23 నాటికి నాలుగు ఫండ్స్‌ సంస్థలు పెట్టుబడుల ఉపసంహరణ ఒత్తిళ్లను ఎదుర్కొనేందుకు బ్యాంకుల నుంచి రూ.4,428 కోట్లను రుణాలుగా తీసుకున్నట్టు యాంఫి గణాంకాలు చెబుతున్నాయి.

గతంలో ఇలాంటి ఉదంతాలు..
మ్యూచువల్‌ ఫండ్స్‌కు నిధులు ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. వాటి అవసరాల కోసం బ్యాంకులకు ప్రత్యేకంగా రూ.25,000 కోట్ల రుణాలను అందించేందుకు 2013 జూలైలో ఆర్‌బీఐ ప్రత్యేక విండోను తెరిచింది. అదే విధంగా లెహమాన్‌బ్రదర్స్‌ సంక్షోభం అనంతరం 2008 అక్టోబర్‌లోనూ ఆర్‌బీఐ ఇదే తరహా నిర్ణయంతో ముందుకు వచ్చింది.  

నిపుణుల భిన్నాభిప్రాయాలు..
ఫండ్స్‌కు రూ.50,000 కోట్ల నిధుల లభ్యతకు ఆర్‌బీఐ తీసుకున్న నిర్ణయంపై నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అద్భుతమైనదని, ఇన్వెస్టర్లలో విశ్వాసాన్ని పెంచుతుందని కొందరు పేర్కొంటే.. రిస్క్‌ అధికంగా ఉండే డెట్‌ విభాగంలో పెద్ద ఫలితాన్నివ్వకపోవచ్చని మరికొందరు అభిప్రాయపడ్డారు.  

మార్కెట్లలో సాధారణ పరిస్థితులు నెలకొనేందుకు, ఇన్వెస్టర్లలో విశ్వాసం పెంచే చక్కని చర్యలు ఇవి.

– నీలేశ్‌షా, యాంఫి చైర్మన్‌

సానుకూలమైన ఆహ్వాన చర్య. ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను సానుకూలంగా మారుస్తుంది.

– నిమేశ్‌షా, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ ఏఎంసీ సీఈవో

ఫండ్స్‌కు బ్యాంకులు తమ రుణాలను ఎప్పుడు పెంచుతాయన్నదే ఇప్పుడు ప్రశ్న. కార్పొరేట్‌ బాండ్‌ మార్కెట్లో అవసరానికంటే ఎక్కువ నిధుల లభ్యతకు ఆర్‌బీఐ చర్యలు తీసుకుంది. ఈ చర్యలు బాండ్‌ మార్కెట్లకు మేలు చేస్తాయి. నమ్మకాన్ని భారీగా పెంచే బూస్టర్‌ వంటిది.

– ఎ.బాలసుబ్రమణ్యం, ఆదిత్య బిర్లా ఏఎంసీ ఎండీ, సీఈవో

లిక్విడిటీ విండో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని కచ్చితంగా పెంచుతుంది.  అయితే, నిధుల కటకట ఏర్పడిన, తక్కువ క్రెడిట్‌ రేటింగ్‌ ఉన్న పేపర్లకు బ్యాంకులు నిధులు అందిస్తాయా అన్నది చూడాల్సి ఉంది.
– కౌస్తభ్‌ బేల్‌పుర్కార్, మార్నింగ్‌ స్టార్‌ ఇండియా రీసెర్చ్‌

Advertisement
Advertisement