రూపాయి.. ఢమాల్‌

RBI intervenes as rupee breaches 72.5 to dollar - Sakshi

ఒకే రోజు 72 పైసల నష్టం

72 స్థాయి కోల్పోయిన  రూపాయి

డాలర్‌తో 72.45 వద్ద క్లోజ్‌

ట్రంప్‌ హెచ్చరికల ప్రభావం  

ముంబై: కొద్ది రోజులుగా క్రమంగా క్షీణిస్తూ వస్తున్న రూపాయి సోమవారం భారీగా నష్టపోయింది. డాలర్‌ మారకంతో ఒక్క రోజే 72 పైసల విలువను కోల్పోయింది. ఈ ఏడాది ఆగస్టు 13 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇది. ఇంట్రాడేలో 94 పైసల నష్టంతో చారిత్రక నూతన కనిష్ట స్థాయి 72.67 వరకు దిగజారిన దేశీ కరెన్సీ, ఆ తర్వాత ఆర్‌బీఐ రంగంలోకి దిగి రూపాయి కొనుగోళ్లకు మద్దతుగా నిలవడంతో కాస్త కోలుకుంది. 72.45 వద్ద క్లోజయింది. ముఖ్యంగా అంతర్జాతీయ వాణిజ్య యుద్ధ భయాలు ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దిగుమతిదారులు డాలర్ల కొనుగోళ్లకు మొగ్గుచూపడం సైతం రూపాయి బలహీనతకు దారితీసింది.

చైనా దిగుమతులపై అదనంగా 267 బిలియన్‌ డాలర్ల టారిఫ్‌ల విధింపును అమెరికా యంత్రాంగం పరిశీలిస్తోందంటూ ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించడం, చైనా, భారత్‌ తదితర వర్ధమాన దేశాలకు రాయితీలు నిలిపివేస్తామనడం ప్రతికూల సెంటిమెంట్‌కు దారితీసింది. గత శుక్రవారం రూపాయి అంతకుముందు వరుస ఏడు రోజుల నష్టాల నుంచి బయటపడి 26 పైసలు లాభపడి 71.73 వద్ద ముగిసింది. కానీ, ఈ స్థాయిని నిలబెట్టుకోలేకపోయింది.

దేశ వాణిజ్య లోటు, స్వల్పకాలిక రుణాల భారం పెరుగుతుండటం ఫారెక్స్‌ మార్కెట్‌పై పెద్ద ఎత్తున ప్రభావం చూపించినట్టు డీలర్లు తెలిపారు. అలాగే, చమురు ధరల పెరుగుదల ప్రభావం కూడా పడింది. దేశ కరెంటు ఖాతా లోటు (క్యాడ్‌) ఏప్రిల్‌–జూన్‌ క్వార్టర్‌కు జీడీపీలో 2.4 శాతం ఉండగా, ఈ పూర్తి ఆర్థిక సంవత్సరానికి 2.5% ఉంటుందని అంచనా. అయితే, రూపాయి బలహీనతతో ఈ లోటు ఇంకా పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు డాలర్‌తో ఇతర వర్ధమాన కరెన్సీలు కూడా నష్టపోతూనే ఉన్నాయి.

400 బిలియన్‌ డాలర్ల విదేశీ మారకం
‘‘విదేశీ నిధులు వెనక్కి వెళ్లిపోతుండటం, ఆర్‌బీఐ డాలర్ల విక్రయాలతో రూపాయి భారీ పతనాన్ని నిలువరించింది. దీంతో విదేశీ మారకం నిల్వలు ఆగస్టు 31తో ముగిసిన వారంలో 400.101 బిలియన్‌ డాలర్లకు తగ్గాయి’’ అని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. గడిచిన కొన్నేళ్ల కాలంలో విదేశీ మారక నిల్వలు భారీగా పెరగడం, మనదేశ కరెన్సీకి మద్దతుగా నిలిచింది.

ఆర్‌బీఐతో కేంద్రం సంప్రదింపులు
న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి అదే పనిగా పడిపోతుండడంతో కేంద్రం రంగంలోకి దిగింది. ఆర్‌బీఐ జోక్యం ద్వారా రూపాయి క్షీణతకు చెక్‌ పెట్టేందుకు కేంద్ర ఆర్థిక శాఖ సంప్రదింపులు జరుపుతున్నట్టు ఓ అధికారి తెలిపారు. కేంద్రం సూచనల ఫలితమేమో కానీ, ఆర్‌బీఐ ఇప్పటికే రంగంలోకి దిగి డాలర్ల అమ్మకాలు మొదలు పెట్టింది. దీంతో విదేశీ మారకం నిల్వలు ఆగస్టు చివరికి 400.10 బిలియన్‌ డాలర్లకు పరిమితమైనట్టు ఆర్‌బీఐ నివేదిక ఆధారంగా తెలుస్తోంది. ఆర్‌బీఐ వద్ద తగినన్ని విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, సమయానుకూలంగా మార్కెట్‌ జోక్యం కోసం సంప్రదింపులు కొనసాగుతాయని ఆ అధికారి చెప్పారు.

రూపాయి మరింత పడకపోవచ్చు: రాజన్‌
రూపాయి మరింత పడిపోకపోవచ్చని ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ చెప్పారు. ద్రవ్యోల్బణం నియంత్రణకు ఆర్‌బీఐ తగిన విధంగా వడ్డీ రేట్లను పెంచుతుందని అభిప్రాయపడ్డారు. ‘‘ఆర్‌బీఐ ఇప్పటి వరకు చేసినట్టే ద్రవ్యోల్బణాన్ని నియంత్రణలోనే ఉంచుతానన్న సంకేతాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది. దాంతో రూపాయి మరింత పతనం కాదన్న నమ్మకం ఇన్వెస్టర్లకు కలిగిస్తుంది’ అన్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top