ఆగని రికార్డ్‌ల హోరు | Sakshi
Sakshi News home page

ఆగని రికార్డ్‌ల హోరు

Published Fri, Aug 24 2018 1:49 AM

Nifty FMCG index in the green; Dabur jumps over 5%  - Sakshi

స్టాక్‌మార్కెట్లో రికార్డ్‌లు కొనసాగుతున్నాయి. బక్రీద్‌ సందర్భంగా బుధవారం సెలవు అనంతరం గురువారం స్టాక్‌ సూచీలు  రికార్డ్‌ లాభాల వద్ద ఆరంభమయ్యాయి. రూపాయి పతనం, చైనా–అమెరికాల మధ్య సుంకాల పోరు తదితర అంశాల  కారణంగా ఒడిదుడుకులకు గురైన సూచీలు చివరకు లాభాల్లో ముగిశాయి. స్టాక్‌ సూచీలు ట్రేడింగ్‌ లాభ, నష్టాల మధ్య కదలాడినప్పటికీ, ఇంట్రాడేలోనూ, ముగింపులోనూ కొత్త శిఖరాలకు చేరాయి. నిఫ్టీ తొలిసారిగా 11,600 పాయింట్లపైకి ఎగిసినా, ఆ స్థాయిలో నిలదొక్కుకోలేకపోయింది. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 51 పాయింట్ల లాభంతో 38,337 పాయింట్ల వద్ద, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో 11,583 పాయింట్ల వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 38,488 పాయింట్ల వద్ద, నిఫ్టీ 11,621 పాయంట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిలను తాకాయి. ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ షేర్లు లాభపడగా, లోహ, బ్యాంక్, వాహన, ఆర్థిక రంగ, ఆయిల్‌ షేర్లు నష్టపోయాయి.  

260 పాయింట్ల రేంజ్‌లో సెన్సెక్స్‌ 
సెన్సెక్స్‌ రికార్డ్‌ లాభాలతో ఆరంభమైంది. కొనుగోళ్ల జోరుతో ఇంట్రాడేలో 202 పాయింట్ల లాభంతో 38,488 పాయింట్ల వద్ద జీవిత కాల గరిష్ట స్థాయిని తాకింది. ఆ తర్వాత లాభాల స్వీకరణతో 58 పాయింట్ల నష్టంతో  38,227 పాయింట్ల వద్ద ఇంట్రాడే కనిష్ట స్థాయిని తాకింది. మొత్తంగా  260 పాయింట్ల రేంజ్‌లో కదలాడింది. ఇక నిఫ్టీ ఒక దశలో 50 పాయింట్లు లాభపడగా, మరో దశలో 24 పాయింట్లు నష్టపోయింది.  రూ.9,000 కోట్ల మేర షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించడంతో ఎల్‌ అండ్‌ టీ షేర్‌ 2.3% లాభంతో రూ. 1,353 వద్ద ముగిసింది. రూ.1,500 చొప్పున  6 కోట్ల షేర్లను సంస్థ కొనుగోలు చేయనుంది.  

Advertisement
Advertisement