టాటా మోటార్స్‌ను మళ్లీ అగ్రస్థానంలో నిలపండి! | Sakshi
Sakshi News home page

టాటా మోటార్స్‌ను మళ్లీ అగ్రస్థానంలో నిలపండి!

Published Tue, Apr 3 2018 1:28 AM

It hurt when Tata Motors was seen as a failing company: Ratan Tata - Sakshi

న్యూఢిల్లీ:  టాటా మోటార్స్‌ను మళ్లీ మొదటి స్థానంలోకి నిలబెట్టడానికి ఉద్యోగులు కృషి చేయాలని టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎమిరిటస్‌ రతన్‌ టాటా పిలుపునిచ్చారు. గత 4–5 ఏళ్లలో టాటా మోటార్స్‌ మార్కెట్‌ వాటాను కోల్పోయిందని, ఇది తనను చాలా బాధించిందని ఆయన ఆవేదన వ్యక్త ం చేశారు. 

పుణేలో జరిగిన వార్షిక ఉద్యోగుల టౌన్‌హౌల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త ఆర్థిక సంవత్సరం ఆరంభంలో ఈ ఉద్యోగుల సమావేశాన్ని ఏర్పాటు చేసే సంప్రదాయాన్ని ఆయనే ప్రారంభించారు. టాటా మోటార్స్‌ ఒక విఫలమైన కంపెనీ అని దేశం భావిస్తోందని, ఇది తనను బాధిస్తోందని రతన్‌ టాటా  పేర్కొన్నారు.

టాటా మోటార్స్‌ ఉద్యోగులందరూ సమర్థులని, టాటా మోటార్స్‌ను మళ్లీ అగ్రస్థానానికి చేర్చాలని ఆయన ఆకాంక్షించారు. చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్, ఎమ్‌డీ గుంటర్‌ బుశ్చెక్‌ల నేతృత్వంలో టాటా మోటార్స్‌ భవిష్యత్‌ నిర్మాణం కొనసాగుతుందని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం వాణిజ్య వాహన మార్కెట్లో 60 శాతంగా ఉన్న ఈ కంపెనీ మార్కెట్‌ వాటా గత ఏడాది మార్చి నాటికి 44.4 శాతానికి పడిపోయింది.

వాణిజ్య వాహనాలపై దృష్టి :టాటా మోటార్స్‌ టర్న్‌ అరౌండ్‌ 2.0కు సిద్ధమవుతోందని కంపెనీ ఎమ్‌డీ, సీఈఓ గుంటర్‌ బుశ్చెక్‌ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాలు మంచి విక్రయాలు సాధించాయని ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో వాణిజ్య వాహనాల విక్రయాల పెంపుపై దృష్టి పెట్టామని, ఇక ఈ ఏడాది వాణిజ్య వాహనాలపై దృష్టిని కొనసాగిస్తూనే, ప్రయాణికుల వాహన అమ్మకాల్లో కూడా టర్న్‌ అరౌండ్‌ సాధించాల్సిన అవసరముందని వివరించారు.

టర్న్‌ అరౌండ్‌ 2.0 కింద ఉన్నత లక్ష్యాలు, వ్యయ నియంత్రణ పద్ధతులు, సకాలంలో కొత్త మోడళ్లను అందించడం, మంచి ఫలితాలు సాధించడం ఉంటాయని వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో అమ్మకాలు పెంచుకోవడం, మార్కెట్‌ వాటా సాధించడం, ఆర్థికంగా మంచి పనితీరు సాధించడం లక్ష్యాలని తెలిపారు.  

Advertisement
Advertisement