ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌ | Sakshi
Sakshi News home page

ఐఓసీ లాభం 47 శాతం డౌన్‌

Published Thu, Aug 1 2019 12:52 PM

IOC Profits 47Percent Down - Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు సంస్థ, ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌(ఐఓసీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో 47 శాతం క్షీణించింది. గత క్యూ1లో రూ.7,092 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ1లో రూ.3,738 కోట్లకు తగ్గిందని ఐఓసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ తెలిపారు. ఒక్కో షేర్‌ పరంగా చూస్తే, నికర లాభం రూ.7.48 నుంచి రూ.4.07కు తగ్గిందని పేర్కొన్నారు. రిఫైనరీ మార్జిన్లు, ఇన్వెంటరీ లాభాలు తగ్గడం వల్ల నికర లాభం కూడా తగ్గిందని వివరించారు. గత క్యూ1లో రూ.7,065 కోట్లుగా ఉన్న ఇన్వెంటరీ లాభాలు ఈ క్యూ1లో రూ.2,362 కోట్లకు తగ్గాయని తెలిపారు. ఆదాయంలో పెద్దగా మార్పు లేదని,  రూ.1.53 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. 

సగానికి పైగా తగ్గిన జీఆర్‌ఎమ్‌.....
ఒక్కో బ్యారెల్‌ ముడి చమురును ఇంధనంగా మార్చినందువల్ల వచ్చే స్థూల రిఫైనింగ్‌ మార్జిన్‌(జీఆర్‌ఎమ్‌) 4.69 డాలర్లకు తగ్గిందని, గత క్యూ1లో ఈ జీఆర్‌ఎమ్‌ 10.21 డాలర్లని సంజీవ్‌ సింగ్‌ పేర్కొన్నారు. కాగా గత క్యూ1లో రూ.1,805 కోట్ల విదేశీ మారక ద్రవ్య నష్టాలు రాగా ఈ క్యూ1లో రూ.92 కోట్ల విదేశీ మారక ద్రవ్య లాభాలు వచ్చాయని చెప్పారు.
ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఓసీ షేర్‌ 4.3% లాభంతో రూ. 139 వద్ద ముగిసింది.

Advertisement
Advertisement