బొబ్బిలిలో బెబ్బులిగా... | Sakshi
Sakshi News home page

బొబ్బిలిలో బెబ్బులిగా...

Published Thu, Oct 18 2018 3:29 AM

YS Jagan mohan reddy Public Meeting in Bobbili - Sakshi

సాక్షి ప్రతినిధి, విజయనగరం: నయవంచక పాలకులను నడిరోడ్డులో నిలదీసి.. ప్రజా కంటకపాలనపై నిప్పులు చెరిగి.. బొబ్బిలిలో బెబ్బులిలా... తాండ్ర పాపారాయుడి పౌరుషాన్ని తలపించేలా.. ప్రతిపక్ష నేత వై.ఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి చేసిన ప్రసంగంతో బొబ్బిలి కోట కంపించింది. బొబ్బిలి నియోజకవర్గ కేంద్రంలో జగన్‌ నిర్వహించిన బహిరంగ సభకు జనం పోటెత్తారు. జనప్రవాహంతో బొబ్బిలి పట్టణం కిటకిటలాడింది. దారులన్నీ జనదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఊహకందని రీతిలో ప్రజా ‘సంకల్పం’ఉవ్వెత్తున ఎగసిపడటంతో అవాక్కవ్వడం ప్రత్యర్థుల వంతయింది. బాడంగి మండలం భీమవరం క్రాస్‌ వద్ద నుంచి బుధవారం ఉదయం పాదయాత్రను ప్రారంభించిన జగన్‌మోహన్‌రెడ్డి వెంట వేలాదిమంది అనుసరించారు. సభా ప్రాంగణం పరిసరాల్లో  భవనాలు జనంతో కిటకిటలాడాయి. బొబ్బిలి పట్టణ శివారు నుంచి దారి పొడవునా ప్రజలు జననేతకు ఘన స్వాగతం పలికారు.  

మంత్రి సుజయ్‌పై నిప్పులు చెరిగి జగన్‌
పౌరుషానికి పురిటిగడ్డగా పేరుగొంచిన బొబ్బిలిలో జననేత  జగన్‌ గర్జించారు. పాదయాత్రలో భాగంగా బొబ్బి లి పట్టణంలో బుధవారం నిర్వహించిన బహిరంగ సభలో రాష్ట్ర మంత్రి సుజయ్‌పై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పేరుతో పార్టీ ఫిరాయించి మంత్రి పదవి దక్కించుకున్న ఆయన నియోజకవర్గ ప్రజలకు చేసేందేమిటని నిలదీశారు. గనుల శాఖమంత్రిగా ఉన్న తన జిల్లాలోనే అక్రమంగా గనులు, ఇసుక తవ్వకాలను ప్రోత్సహించటం ద్వారా చేస్తున్న అవినీతిని ఎండగట్టారు. గిరిజనులకిచ్చిన భూములు ఎకరా కోటి రూపాయలకు పైగా ధర పలికడంతో లాక్కున్న నీ నోట అభివృద్ధి కోసం పార్టీ మారాననే మాట ఎలా వచ్చిందని నిలదీశారు. చెరువుల కబ్జాకు సహకరిస్తూ, జూట్‌మిల్లు తెరిపించకుండా మంత్రిగా సాధించిందేమిటని నిలదీశారు. ఎన్‌సీఎస్‌ సుగర్‌ఫ్యాక్టరీ చెరకు రైతులకు బిల్లులు చెల్లించకుండా, కార్మికులకు వేతనాలివ్వకుండా చక్కెరను మాత్రం అమ్ముకు పోతుంటే మంత్రి ఏం చేస్తున్నట్టని ప్రశ్నిం చారు. మంత్రి సుజయ్‌ అవినీతిపై ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నంతసేపు నియోజకవర్గ ప్రజలు జేజేలు పలుకుతూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడుతూ బిరుదులు ప్రకటించిన సందర్భంలోనూ ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. 

ఎగసిపడిన  జనకెరటం
బొబ్బిలి నియోజకవర్గంలో జనకెరటం ఎగసిపడింది. జననేతకు నియోజకవర్గ ప్రజలు చిక్కని చిరునవ్వుతో ఘన నీరాజనం పలికారు. తమ కష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన ప్రతిపక్ష నాయకునికి సాదరంగా ఆహ్వానించారు. బుధవారం ఉదయం బాడంగి నుంచి పాదయాత్ర ప్రారంభించిన జననేత కాసేపటికే బొబ్బిలి మండలంలోకి ప్రవేశించారు. జె.రంగరాయపురం, రంగరాయపురం మీదుగా మధ్యాహ్న భోజన విరామ సమయానికి అప్పయ్యపేట శివారుకు చేరుకున్నారు. అనంతరం ప్రారంభమైన పాదయాత్ర బొబ్బిలి పట్టణంలోని నిర్వహించిన బహిరంగ సభకు వద్దకు చేరుకోగా... సభ అనంతరం బొబ్బిలి పట్టణ శివారుల్లో ఏర్పాటు చేసిన రాత్రి బస వద్దకు  చేరుకున్నారు. పాదయాత్రలో దారిపొడవునా మహిళలు అభిమాన నేతకు హారతులు పట్టి విజయతిలకం దిద్దారు. 

పాదయాత్రలో వినతుల వెల్లువ
జె.రంగరాయపురంలో జనేతను కలిసిన పాతపెంటకు చెందిన రామునాయుడు, గంగ దంపతులు తమ బాధలు చెప్తూ తమకు ఇద్దరు కుమార్తెలుండగా... బంగారుతల్లి పథకంలో పేర్లు నమోదు చేశామనీ కానీ ఎటువంటి ప్రయోజనం లేకపోయిందనీ తెలిపారు. పాతపెంట  పాఠశాలకు వెళ్లేందుకు సరైన రోడ్డు మార్గం లేకపోవటంతో ఇబ్బందులు పడుతున్నామని పలువురు విద్యార్థులు జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. 500 మంది విద్యార్ధులు బొబ్బిలి మీదుగా 15 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని వాపోయారు. రంగరాయపురంలో చెరుకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రం ఇచ్చారు. స్థానిక ఎన్‌సిఎస్‌ షుగర్‌ఫ్యాక్టరీ గత ఏడాది నుంచి రైతులకు రూ13కోట్లు బకాయి పడిందని, ఆ మొత్తం ఇప్పించాలని స్థానిక మంత్రి సుజయ్‌ను కోరినా పట్టించుకోలేదని  ఆవేదన వ్యక్తం చేశారు. తపాల శాఖ గ్రామీణ ఉద్యోగులు తమ గోడును చెప్పుకున్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ పథకం రద్దుపై విపక్షనేత స్పష్టమైన హామీ ఇవ్వటంపై పలువురు ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. 

పాదయాత్రలో పార్టీ శ్రేణులు
పాదయాత్రలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల పరిశీలకుడు భూమన కరుణాకరరెడ్డి, పోలిట్‌ బ్యూరో సభ్యుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ప్రోగ్రామ్స్‌ కమిటీ కోఆర్డినేటర్‌ తలశిల రఘురాం, మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ, కె.పార్థసారధి, మాజీ ఎంపీ బొత్స ఝాన్సీలక్ష్మి, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్రస్వామి, కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్ఫశ్రీవాణి, జిల్లా రాజకీయ వ్యవహారాల సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, విజయనగరం, అరకు పార్లమెంటరీ జిల్లాల అధ్యక్షులు బెల్లాన చంద్రశేఖర్, శత్రుచర్ల పరీక్షిత్‌రాజ్, బొబ్బిలి నియోజకవర్గ సమన్వయకర్త శంబంగి వెంకట చినఅప్పలనాయుడు, మా జీ ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య, జిల్లా పార్టీ కోశాధికారి కందుల రఘుబాబు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement