నిరుద్యోగులకు ‘వయో’గండం!

State government does not provide notifications for Employment - Sakshi

ఈ నెలాఖరుతో ముగియనున్న వయో పరిమితి పెంపు జీవో గడువు

మూడుసార్లు గడువు పెంచడమే కానీ నోటిఫికేషన్లు ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం 

ప్రత్యేక హోదా లేక,పరిశ్రమలు రాక ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి కరువు

వయో పరిమితి పెంపు వద్దంటున్న ఏపీపీఎస్సీ.. లక్షల మంది నిరుద్యోగుల్లో ఆందోళన

రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల సంఖ్య 2 లక్షలకుపైనే

సాక్షి,, అమరావతి: రాష్ట్రంలో లక్షల మంది నిరుద్యో గులకు వయోపరిమితి గండం ఎదురవుతోంది. గత మూడేళ్లుగా ఖాళీగా ఉన్న లక్షల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది. వయో పరిమితి జీవోలను పొడిగిస్తూ పోస్టుల భర్తీకి మాత్రం నోటిఫికేషన్లు ఇవ్వకుండా దొంగాట ఆడుతుండటంతో హతాశులవుతున్నారు. వయోపరి మితి దాటిపోతుండడంతో అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంగా మారుతోంది. ఏపీకి ప్యాకేజీ పేరుతో ప్రత్యేక హోదాను సీఎం చంద్రబాబు కేంద్రానికి తాకట్టు పెట్టడంతో రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు లేక ప్రైవేట్‌ రంగంలోనూ ఉపాధి కరువైంది. నోటిఫికేషన్ల కోసం నిరీక్షిస్తూ రూ.లక్షలు వెచ్చించి శిక్షణ పొందినా ప్రభుత్వం తమకు కనీసం దరఖాస్తు చేసుకొనే అవకాశం కూడా లేకుండా చేస్తోందని నిరుద్యోగులు మండిపడుతున్నారు. 

జీవోలే.. నోటిఫికేషన్లు లేవు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు గరిష్ఠ వయోపరిమితి 34 ఏళ్లుగా ఉంది. రాష్ట్ర విభజన అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ వయోపరిమితిని 34 ఏళ్ల నుంచి తొలుత 40 ఏళ్లకు, ఆ తరువాత 42 ఏళ్లకు పెంచారు. మొదటిసారి పెంపు గడువు 2016 సెప్టెంబర్‌ 30 వరకు ఇచ్చినా ఒక్క నోటిఫికేషన్‌ కూడా జారీ చేయలేదు. తర్వాత 2016 అక్టోబర్‌ 17న జీవో  381 ద్వారా వయోపరిమితి పెంపును మరో ఏడాది పొడిగించారు. ఈ మధ్యకాలంలో 4,275 పోస్టులకు 32 నోటిఫికేషన్లు జారీ చేసినా ఆ ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నా ఆ తరువాత మళ్లీ ఒక్క నోటిఫికేషనూ కూడా వెలువడలేదు. రెండో జీవో గడువు కూడా దాటిపోవడంతో గత ఏడాది డిసెంబర్‌ 4న జీవో 182 ద్వారా వయోపరిమితిని పెంపు గడువును మూడోసారి పెంచారు. ఆ గడువు కూడా ఈ నెలాఖరుతో ముగిసిపోనుంది. వయోపరిమితి పెంపు జీవోలు మూడుసార్లు ఇచ్చినా నోటిఫికేషన్లు మాత్రం వెలువడక పోవటంతో ఉపయోగం ఏమిటని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు.  

2 లక్షలకు పైగా ఉద్యోగ ఖాళీలున్నా...
రాష్ట్ర విభజన సమయంలో ఏపీలోని 13 జిల్లాల్లో మంజూరైన పోస్టులు 6,97,621 ఉన్నాయని, అందులో ఖాళీలు 1,42,825 ఉన్నాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ప్రకటించిన ద్రవ్య విధానపత్రంలో గత ఏడాది మార్చి నాటికి అన్ని రంగాల్లో ఉద్యోగులు 4,99,697 మంది ఉండగా ఈ ఏడాది మార్చి నాటికి 4,54,222 మందే ఉన్నారని పేర్కొన్నారు. ఉద్యోగుల రిటైర్‌మెంట్‌ తదితర కారణాలతో 78,218 మంది తగ్గిపోయినట్లు ప్రభుత్వం తేల్చింది. అంటే పదవీ విరమణ చేసిన వారితో కలిపితే ప్రభుత్వ శాఖల్లో 2.20 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు తేలుతున్నా అన్ని ఖాళీలు లేవంటూ సర్కారు లెక్కలను తారుమారు చేస్తోంది. రాష్ట్రంలో మొత్తం ఉద్యోగాల సంఖ్య 4.83 లక్షలని, అందులో ఖాళీలు కేవలం 77,737 మాత్రమేనని ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు గతంలో పేర్కొన్నారు. ఖాళీల్లో రెగ్యులర్‌ ప్రాతిపదికన భర్తీ చేయాల్సిన పోస్టులు కేవలం 20 వేలు మాత్రమేనని, మిగతావి అవుట్‌ సోర్సింగ్‌ విధానంలో భర్తీ చేయనున్నట్లు చెప్పారు. అయితే నాలుగేళ్లు దాటుతున్నా ఆ 20 వేలలో కేవలం 10 వేల పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్లు ఇచ్చారు.

పెంపు వద్దంటున్న ఏపీపీఎస్సీ..
ఉద్యోగాల భర్తీలో వయో పరిమితి పెంపును అనుమతించవద్దని ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రభుత్వానికి సూచించడం ఆందోళన కలిగిస్తోంది. నేటి అవసరాలకు సరిపోయే నైపుణ్యాలు వయసు దాటిన వారిలో ఉండవంటూ పెంపును కమిషన్‌ వ్యతిరేకిస్తోంది. వయోపరిమితి పెంచాలని ప్రభుత్వాన్ని కోరబోమని ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ ఉదయభాస్కర్‌ ఇటీవల స్పష్టం చేశారు. గతంలో ప్రభుత్వమే తనంతట తాను జీవో ఇచ్చిందని, ఇప్పుడు కూడా అలా ఇస్తేనే పెంపు అమలవుతుందని, లేదంటే వచ్చే నోటిఫికేషన్లకు పాత విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. 

రూల్‌ 7 రద్దుతో ఆశలు గల్లంతు
ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వం 4,275 పోస్టులకు నోటిఫికేషన్లు జారీ చేసినా ఇప్పటివరకు అందులో భర్తీ అయినవి కేవలం 2 వేలు మాత్రమే. మెరిట్‌ జాబితాలో ఉన్న నిరుద్యోగులకు ఇప్పటిదాకా అండగా ఉన్న ఏపీపీఎస్సీ రూల్‌ 7ను టీడీపీ అధికారంలోకి రాగానే రద్దు చేయడమే దీనికి కారణం. రూల్‌ 7 ప్రకారం మెరిట్‌ అభ్యర్థులు చేరకపోయినా, చేరి రాజీనామా చేసినా మెరిట్‌ జాబితాలోని తదుపరి అభ్యర్థులకు అవకాశం దక్కేది. ఇలా ఆ నోటిఫికేషన్లో పరీక్షలు రాసి మెరిట్‌ సాధించిన వారికి వయోపరిమితి దాటిపోయినా పోస్టు వచ్చే అవకాశాలుండేవి. కానీ చంద్రబాబు సర్కారు రూల్‌ 7ను రద్దు చేయడంతో మెరిట్‌లో తదుపరి అభ్యర్థులకు అవకాశం దక్కక ఖాళీలు ప్రభుత్వ మిగులు జాబితాలో చేరుతున్నాయి. 
 
ఏటా డీఎస్సీ అని ఊరించి...

ఏటా డీఎస్సీ అని చెప్పిన టీడీపీ సర్కారు ఇప్పటివరకు ఒకే ఒక్కటి మాత్రమే నిర్వహించింది. రాష్ట్రంలో 31 వేలకు పైగా టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఇటీవల సమగ్ర శిక్షా అభియాన్‌ ద్వారా కేంద్రానికి పంపిన నివేదికలో ప్రభుత్వం పేర్కొంది. ఇన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా డీఎస్సీ నిర్వహించకుండా దాగుడుమూతలు ఆడుతోంది. పలుమార్లు షెడ్యూళ్లు ప్రకటిస్తూ కాలయాపన చేస్తోంది. 

నిరుద్యోగ భృతికీ మొండిచేయి
ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయకపోవడం, ప్రైవేట్‌లోనూ ఉపాధి అవకాశాలు లేకపోవడంతో నిరుద్యోగుల భవిష్యత్తు అంధకారంలో కూరుకుపోతోంది. ఇంటికో ఉద్యోగం కల్పిస్తామని, లేదంటే ప్రతి నిరుద్యోగికి రూ.2 వేల చొప్పున ప్రతి నెలా భృతి ఇస్తామని ఇచ్చిన ఎన్నికల హామీకి చంద్రబాబు తూట్లు పొడిచారు. ‘యువనేస్తం’ పేరుతో మరో దగాకు తెరతీశారు. నిరుద్యోగ భృతి రూ.2 వేలు ఇస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు రూ.1,000కి కుదించారు. రాష్ట్రంలో 1.35 కోట్ల కుటుంబాలున్నాయి. ఇంటికో ఉద్యోగం లేదంటే నిరుద్యోగ భృతి అని హామీ ఇచ్చిన చంద్రబాబు ఇప్పుడు కేవలం 12 లక్షల మంది మాత్రమే అర్హులున్నారని ఆ సంఖ్యను కుదించేశారు. కళ్ల ముందే లక్షల మంది నిరుద్యోగులున్నా  కళ్లకు గంతలు కడుతున్నారు. 

కేబినెట్‌ ఆమోదిస్తేనే...
పలు శాఖలు ఖాళీల జాబితాలను ప్రభుత్వానికి పంపినా ఆమోదించడం లేదు. తాజాగా ఆర్థికశాఖ కేడర్‌స్ట్రెంగ్త్‌ అంటూ కొత్త మెలికపెట్టడంతో పోస్టుల భర్తీకి ఇప్పట్లో నోటిఫికేషన్లు వెలువడే అవకాశాలు కనిపించడం లేదు. ఆయా శాఖల్లో మొత్తం పోస్టులు ఎన్ని? మిగులు ఎన్ని? నేటి అవసరాలకు అనుగుణంగా ఎంతమంది అవసరం? అనే సమాచారాన్ని కొత్తగా రూపొందించి ఇవ్వాలి. దీన్ని ఆర్థికశాఖ పరిశీలించాక కేబినెట్‌ ఆమోదిస్తేనే నోటిఫికేషన్లకు మోక్షం కలుగుతుంది. 

లక్షన్నర మంది ఔట్‌
ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా పలువురిపై  నిర్దాక్షిణ్యంగా వేటు వేసింది. ఆదర్శ రైతులు, గోపాలమిత్ర, వైద్యమిత్ర, ఫీల్డ్‌ అసిస్టెంట్లు, వయోజన విద్యాకేంద్రాల సమన్వయకర్తలు, మధ్యాహ్న భోజనం కుక్‌లు, సహాయకులు ఇలా పలు కేటగిరీల్లో పనిచేస్తున్న దాదాపు లక్షన్నర మంది అవుట్‌సోర్సింగ్, కాంట్రాక్టు సిబ్బందిని తొలగించింది. 


 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top