ఉలిక్కిపడిన మన్యం | Sakshi
Sakshi News home page

ఉలిక్కిపడిన మన్యం

Published Wed, Jul 24 2019 8:11 AM

Police Find Maoists Dump Of Grenade In Srikakulam - Sakshi

సాక్షి, భామిని–సీతంపేట: ఏజెన్సీ ఉలిక్కిపడింది. ప్రశాంతంగా ఉన్న సరిహద్దులో మావోయిస్టు డంప్‌ లభించడం అలజడి రేపింది. ఈ నెల 28 నుంచి అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏఓబీలోని దోనుబాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు డంప్‌ లభ్యమైంది. కూంబింగ్‌కు వెళ్తున్న పోలీసులను లక్ష్యంగా చేసుకునే ఈ డంప్‌ ఇక్కడ పెట్టారని పోలీసు అధికారులు ప్రకటించడం గమనార్హం.

సీతంపేటలో వాలీబాల్‌ టోర్నమెంట్‌కు హాజరయ్యేందుకు ఎస్పీ అమ్మిరెడ్డి వచ్చిన తరుణంలో కూంబింగ్‌కు వెళ్లిన సాయుధ బలగాలకు డంప్‌ దొరకడంతో మావోల ఉనికిపై మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. గతంలోనూ ఇదే ఏజెన్సీలోని తివ్వాకొండ పరిసరాల్లో మావోల డంప్‌లు దొరికాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఇక్కడే మాటిమాటికీ డంప్‌లు దొరుకుతున్నా యి. తివ్వాకొండలను మావోయిస్టులు తమ సేఫ్టీ జోన్‌గా భావిస్తారు. పోలీసులకూ ఈ సమాచారం ఉంది. ఈ విషయాన్ని బలపరుస్తూ ఈ కొండ చుట్టూనే డంప్‌లు పలుమార్లు లభ్యమయ్యాయి.

డంప్‌ లభ్యం
సీతంపేట మండలం దోనుబాయి సమీపంలోని అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఉంచిన డంప్‌ను పోలీసులు గుర్తించినట్లు ఎస్పీ అమ్మిరెడ్డి మంగళవారం విలేకరులకు తెలిపారు. దోనుబాయి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్‌ జరుపుతుండగా డంప్‌ లభించినట్లు వివరించారు. వాటిలో ఆరు ల్యాండ్‌మైన్లు ఉన్నట్లు గుర్తించామని, సాంకేతిక నిపుణుల సాయంతో నిర్వీర్యం చేసి బయటకు తీశామని తెలిపారు. ల్యాండ్‌మైన్స్‌తో పాటు ఆరు డిటోనేటర్లు కూడా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఓ నాటు తుపాకీ, టార్చిలైట్‌ను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. లభ్యమైన నాటు తుపాకీ పనిచేసే స్థితిలో ఉండడాన్ని చూస్తే ఏడెనిమిదేళ్ల కిందట ఈ డంప్‌ను భూమిలో పాతిపెట్టి ఉండవచ్చని ఎస్పీ అభిప్రాయపడ్డారు. వీటిని గుర్తించిన సిబ్బందికి రివార్డులు ఇస్తామన్నారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీలు కృష్ణవర్మ, శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 
  
రివార్డుల ప్రకటనతో..
కొన్నేళ్లుగా ఏఓబీలో ప్రశాంత వాతావరణం నెలకొంది. హింసాత్మక ఘటనలు జరగలేదు. అయితే ఇటీవల ఆంధ్రా ఒడిశా సరిహద్దులోనే పోలీసు ఇన్‌ఫార్మర్లనే నెపంతో గిరిజనులను హతమార్చిన ఘటనలు వెలుగు చూశాయి. అంతలోనే పోలీసులు కూంబింగ్‌ నిర్వహించడం, వారికి డంప్‌ దొరకడంతో ఇక్కడ మావోయిస్టుల కదలికలపై అనుమానాలు బలపడుతున్నాయి. దీనికి తోడు ఇటీవల భామినిలో కమ్యూనిటీ పోలీసింగ్‌ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని నేరుగా నిషేధిత మావోయిస్టుల వివరాలను ప్రకటించారు.

వారిని పట్టిస్తే రివార్డులు కూడా అందిస్తామని చెప్పారు. మావోల కదలికలపై అంతర్గతంగా ఇంటెలిజెన్స్‌ ఇచ్చిన హెచ్చరికలతోనే పోలీసులు వ్యూహాత్మకంగా ఈ అడుగులు వేశారనే వాదన వినిపిస్తోంది. జూలై 28 నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ తరుణంలో ప్రతీకార చర్యలకు దిగడం కూడా మావోలకు ఆనవాయితీ. ఈ తరుణంలోనే పోలీసులకు డంప్‌ దొరికింది. దీంతో అక్కడక్కడా ఉన్న మావో సానుభూతిపరులపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు.

1/2

ఇటీవల ఏఓబీలో ఇన్‌ఫార్మర్ల పేరుతో మావోల చేతిలో హతమైన గిరిజనులు

2/2

భామిని సమావేశంలో మావోల వివరాలు ప్రకటిస్తున్న జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డి

Advertisement
Advertisement