ఇలాగేనా ఆసుప్రతిని ఉంచుకునేది? | Sakshi
Sakshi News home page

ఇలాగేనా ఆసుప్రతిని ఉంచుకునేది?

Published Thu, Nov 27 2014 2:15 AM

ఇలాగేనా ఆసుప్రతిని ఉంచుకునేది?

వైద్య సిబ్బంది పనితీరుపై మండిపడిన ఎమ్మెల్యే

వాకాడు : ‘ఆసుప్రతి అంటే ఎంత శుభ్రంగా ఉండాలి. ఆసుపత్రికి వస్తే ఆరోగ్యవంతులు కూడా అనారోగ్యానికి గురయ్యేటట్లు ఉన్నారు. ఇలాగేనా ఆసుపత్రిని ఉంచుకునేది.. ఇదే మీ ఇల్లు అయితే ఇలానే ఉంచుకుంటారా’ అంటూ గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ వైద్య సిబ్బందిపై మండిపడ్డారు. బుధవారం రాత్రి వాకాడులోని ప్రభుత్వ 30 పడకల ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కాన్పుల గది, డ్రస్సింగ్ రూమ్, పడకల వార్డులను పరిశీలించారు. పరిశుభ్రంగా ఉండాల్సిన కాన్పుల గదిలో బల్లపై రక్తపు మరకలు ఉండటంతో ఎమ్మెల్యే సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిని శుభ్రంగా ఉంచకపోతే ఎలా ప్రశ్నించారు.

మరొక సారి ఇలాంటి దుస్థితి ఉపేక్షించేది లేదని ఆయన సిబ్బందిని హెచ్చరించారు. డ్యూటీలో ఉన్న వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని, పనితీరును మెరుగుపరుస్తామని ఎమ్మెల్యేకు వివరించారు. వాకాడు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి సలహా మండలి కమిటీలను డిసెంబర్ 3వ తేదీన ఏర్పాటు చేయనున్నట్లు ఎమ్మెల్యే పాశం తెలిపారు. వైఎస్సార్‌సీపీ నేత పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రి అభివృద్ధికి తమవంతు కృషి చేస్తామని చెప్పారు.

అనంతరం వాకాడులోని సెయింట్ జేమ్స్ లూథరన్‌చర్చి నూతన ప్రతిష్ట మహోత్సవాల్లో ఎమ్మెల్యే సునీల్‌కుమార్ పాల్గొని క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యయ ప్రయాశలు ఓర్చి అధునాతనమైన చర్చి నిర్మాణానికి కృషి చేసిన చర్చి కమిటీ సభ్యులను ఆయన అభినందించారు. పీసీసీ కార్యవర్గ సభ్యుడు ప్రశాంత్‌బాబు, ప్రభుచరణ్, వి.దినకర్‌బాబు, రాజ్‌కుమార్, అజయ్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, రాజరత్నం, మణికుమార్, జోసఫ్, వైఎస్సార్‌సీపీ నేత నేదురుమల్లి ఉదయశేఖర్‌రెడ్డి, కె.నందగోపాలరెడ్డి, పాపారెడ్డి మనోజ్‌కుమార్‌రెడ్డి, పాపారెడ్డి పురుషోత్తమ్‌రెడ్డి, కడూరు భాస్కర్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement